నేను ఎన్నాళ్లో బతకను.. అమ్మానాన్నకు చెప్పకండి!

ABN , First Publish Date - 2023-01-06T03:28:50+05:30 IST

నేను ఆరునెలల కన్నా ఎక్కువ బతకను డాక్టర్‌.. నాకు క్యాన్సర్‌.

నేను ఎన్నాళ్లో బతకను.. అమ్మానాన్నకు చెప్పకండి!

నాకు క్యాన్సర్‌ అని తెలిస్తే బాధపడతారు

చివరి రోజుల్లో వారిని సంతోషంగా చూడాలనుంది

ఇది.. ఆరేళ్ల చిన్నారి ఓ వైద్యుడికి చేసిన విన్నపం

బిడ్డకు చెప్పొద్దంటూ తల్లిదండ్రులకు చెప్పిన వైద్యుడు

ఎనిమిది నెలల పాటు జబ్బు గురించి

తెలియనట్లుగానే గడిపిన బాబు, కన్నవారు

బిడ్డతోనే గడిపేందుకు ఉద్యోగాలకు రాజీనామా

ఇష్టమైన వంటకాలతో భోజనం.. అమెరికా యాత్ర

చిన్నారి చనిపోయాక ట్విటర్‌లో వైద్యుడి పోస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘నేను ఆరునెలల కన్నా ఎక్కువ బతకను డాక్టర్‌.. నాకు క్యాన్సర్‌. నేను అనుభవిస్తున్న రోగ లక్షణాలను బట్టి గూగుల్‌ చేసి తెలుసుకున్నా. ఇది మమ్మీ డాడీకి తెలియదు. తెలిస్తే బాధపడతారు. మీరూ చెప్పకండి. చివరి రోజుల్లో వారిని సంతోషంగా చూడాలని అనుకుంటున్నా’ ఇవి ఓ వైద్యుడితో ఆరేళ్ల పిల్లాడు అన్న మాటలు! వయసుకు మించి అతడి ఆలోచన.. పరిణతి, స్థిత ప్రజ్ఞతకు ఆ వైద్యుడికి నోట మాట రాలేదు.. మనసంతా బాధతో నిండిపోయి కన్నీటి బొట్లుగా రాలడం తప్ప! ఈ విషయాన్నంతా సదరు వైద్యుడు, ఆ బాబు మృతిచెందిన తర్వాత ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

తాను ఇక బతకను అని తెలిసీ.. తల్లిదండ్రులు బాధపడొద్దనే తపనతో వైద్యుడిని వేడుకున్న తీరుకు నెటిజెన్లూ జోహార్లు చెబుతున్నారు! ఆ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన దంపతులకు ఏకైక కుమారుడున్నాడు! వయసు ఆరేళ్లు. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతుండటంతో ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ బాబుకు క్యాన్సర్‌ అని తేలింది. హతాశులైన తల్లిదండ్రులు బాబుకు చికిత్స అందించారు. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతున్నట్లు అతడికి చెప్పలేదు. అయితే తనకు అందుతున్న చికిత్సలు, వైద్యులు రాసిన ప్రిస్కషన్‌, వాటి ఆధారంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా ఆ చిన్నారి తెలుసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం ఆ దంపతులు, బాబును వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకొని న్యూరాలజిస్టు డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ వద్దకు తీసుకువచ్చారు. ‘మా బాబుకు ఇప్పటికే క్యాన్సర్‌ ఉంది, మందులు వాడుతున్నాం, కానీ ఈ విషయం అతడికి తెలియదు.

ఇప్పుడు ఫిట్స్‌ వస్తున్నాయి, ఆంకాలజిస్టు మీ వద్దకు పంపించారు’ అని చెప్పారు. మెడికల్‌ నివేదికలను పరిశీలించిన డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌, ఆ బాబు మెదడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, దీని కారణంగా కుడి కాలు, చేయి పక్షవాతం వచ్చి పనిచేయడం లేదని గుర్తించారు. ఆ సమయంలోనే చిన్నారి.. ‘మమ్మి....డాడీ...మీరు బయటకు వెళ్లండి...నేను డాక్టర్‌తో మాట్లాడాల్సి ఉంది’ అని రిక్వెస్ట్‌ చేశాడు. దీంతో ఆ తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం డాక్టర్‌తో ఆ బాబు మాట్లాడాడు. ‘డాక్టర్‌ నాకు క్యాన్సర్‌ ఉందని తెలుసు, దీని గురించి గూగుల్‌లో వెతికితే డేంజర్‌ జబ్బు అని, అది సోకిన వారు ఎక్కువ కాలం బతకరు అని ఉంది. ఈ విషయం అమ్మనాన్నకు చెప్పలేదు, మీరూ చెప్పకండి’ అని వేడుకున్నాడు.

అనంతరం డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌, ఆ బాబును బయటకు పంపించి, తల్లిదండ్రులను పిలిపించుకున్నారు. బాబు తనతో అన్న మాటలన్నీ వారికి చెప్పారు. ‘తనకు జబ్బు గురించి తెలుసు, మీరు తెలియనట్లే ఉండండి. చివరి సమయంలో అతడితో అనందంగా గడిపేందుకు ప్రయత్నించండి’ అని సూచించారు. ఇక చివరి రోజుల్లో ఎక్కువ సమయం కొడుకుతోనే గడుపాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకొని ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొడుకు ఆలనపాలన అంతా ఆ తల్లిదండ్రులే దగ్గరుండి చూసుకున్నారు. బిడ్డకు ఇష్టమైన వంటలు స్వయంగా తల్లి చేసి తినిపించారు. అమెరికాకు తీసుకెళ్లి డిస్నిలాండ్‌, ధీమ్‌ పార్క్‌లో తన కొడుకుతో గడిపారు.

ఆ బిడ్డ గానీ.. తల్లిదండ్రులు గానీ ఏ క్షణంలో కూడా తమ దుఃఖాన్ని బయటపడనీయకుండా ఒకరి ఆనందం కోసం మరొకరు ముఖంపై నవ్వులు పులుముకున్నారు. ఎనిమిది నెలలు గడిచిన తర్వాత ఆ చిన్నారి, తల్లిదండ్రులను వదిలి వెళ్లిపోయాడు. ఇటీవల ఆ తల్లిదండ్రులు, డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ వద్దకు వెళ్లి కలిశారు. నెల రోజుల క్రితం తమ బాబు చనిపోయినట్లు ఆయనకు చెప్పారు. చివరి సమయంలో బిడ్డతో ఆనందంగా గడపాలని చెప్పడంతో అలాగే చేశామని వైద్యుడితో చెప్పారు.

Updated Date - 2023-01-06T11:32:26+05:30 IST