Tamilisai Vs Telangana Govt: తమిళిసైపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.. ప్రతివాదిగా గవర్నర్

ABN , First Publish Date - 2023-03-02T16:41:38+05:30 IST

ఒకే ఒక్క సందర్భం.. అన్ని వ్యవహారాలనూ దారికి తెచ్చింది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌ (Pragati Bhavan)కు మధ్య ఏర్పడ్డ దూరాన్ని కరిగిపోయేలా చేసింది.

Tamilisai Vs Telangana Govt: తమిళిసైపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.. ప్రతివాదిగా గవర్నర్

హైదరాబాద్: ఒకే ఒక్క సందర్భం.. అన్ని వ్యవహారాలనూ దారికి తెచ్చింది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌ (Pragati Bhavan)కు మధ్య ఏర్పడ్డ దూరాన్ని కరిగిపోయేలా చేసింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగించారు. ఎటువంటి ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా.. అసలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావనే లేకుండానే ఆమె ప్రసంగం సాగింది. దీంతో గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు సమసినట్లేనని అందరూ అనుకున్నారు. ఇక రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ తగ్గిపోయినట్లేనని భావించారు. ఇదిగో ఇప్పుడు గవర్నర్‌పై ఏకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) తలుపుతట్టింది. గవర్నర్ తమిళిసై దగ్గర పెండింగ్‌లో 10 బిల్లులు ఉన్నాయని, బిల్లులను ఆమోదించడం లేదంటూ సీఎస్ శాంతికుమారి (CS Shantikumari) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్ తమిళిసై పేరును తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) చేర్చింది. ఈ పిటిషన్‌పై రేపు (శుక్రవారం) సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అసెంబ్లీ, శాసనమండలిలో ఆమోందించిన 10 కీలక బిల్లులు గవర్నర్ దగ్గరే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ, మండలిలో ఆమోదించి.. గవర్నర్ ఆమోదం కోసం పంపారు. 4 నెలలు అవుతున్నా ఆ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపలేదని అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాజ్‌భవన్‌కు పంపిన వాటిలో ఉద్యోగాల నియమకాలకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి. ఇవి అమలు కావాలంటే గవర్నర్ ఆమోదం తప్పని సరి. పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం గురించి అడిగినప్పుడు, ఆమోదించే నిర్ణయం పూర్తిగా తన పరిధిలో ఉందని గతంలో గవర్నర్ తెలిపారు. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉన్నాయని, ఆ బిల్లులను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ బిల్లులను అధ్యయనం చేస్తున్నట్లుగా గతంలో గవర్నర్ ప్రకటించారు. ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన ఉమ్మడి బోర్డు బిల్లులు, మున్సిపాలిటీ చట్టానికి సవరణలు, అజామాబాద్ పారిశ్రామిక అభివృద్ధి చట్టం, విశ్వవిద్యాలయాల బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న వాటిలో అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టంలో ముడిపడి ఉంది. అందువల్ల ఈ బిల్లుకు మోక్షం రావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మిగిలిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే గవర్నర్ ఆమోదించాలి. నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్‌లోనే నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు

ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు

తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు

జీఎస్టీ చట్ట సవరణ

ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ

మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు

పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ

ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు

మున్సిపల్‌ చట్ట సవరణ

Updated Date - 2023-03-02T16:53:45+05:30 IST