Stray dogs: నగరంలో.. వీధి కుక్కల విజృంభణ

ABN , First Publish Date - 2023-12-17T11:24:07+05:30 IST

వీధి కుక్కల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా

Stray dogs: నగరంలో.. వీధి కుక్కల విజృంభణ

- నగరంలో తరచూ దాడులు

- నియంత్రణపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం

- లెక్కల పేరిట కాగితాల్లో కనికట్టు..

- క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితి

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా కుక్కలు ఎగబడి కరుస్తోన్నా.. యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్‌లో ట్యూషన్‌కు వెళ్లి వస్తోన్న ఓ బాలుడిని కుక్కలు వెంటపడి కరిచాయి. అదృష్టవశాత్తు అతని నాన్న స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలోనూ అంబర్‌పేటలో కుక్కలు కరిచి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రాంనగర్‌(Ramnagar)లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటపడడంతో స్పీడ్‌ పెంచాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి కిందపడడంతో కాలు విరిగింది. ఆయన వైద్యానికి రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయి. ఇప్పటికీ అతడి కాలు పూర్తిస్థాయిలో నయం కాలేదు. ఇలా.. కుక్కకాటు ఘటనలు నగరంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. స్టెరిలైజేషన్‌ చేస్తున్నాం.. యాంటి రేబిస్‌ వ్యాక్సిన్లు ఇస్తున్నామని బల్దియాలోని వెటర్నరీ విభాగం చెబుతోన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయు. గ్రేటర్‌లోని ఏ ప్రాంతంలో చూసినా కుక్కల గుంపులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే చిన్నారులు లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. రాత్రి వేళ విధులు ముగించుకొని వెళ్లే వారికీ కుక్కలతో ఇబ్బందులు తప్పడం లేదు. నడుచుకుంటు వెళ్లినా.. వాహనాలపై వెళ్తోన్నా.. వెంటపడ్తున్నాయి.

కాగితాల్లో కనికట్టు

బల్దియా చెబుతోన్న లెక్కల ప్రకారం ప్రస్తుతం నగరంలో దాదాపు ఆరు లక్షల కుక్కలున్నాయి. ఇందులో 75శాతం స్టెరిలైజేషన్‌ జరిగిందని కాగితాల్లో చూపుతోంది. కానీ, అంచనాలకు మించి కుక్కల సంఖ్య నగరంలో పెరుగుతోంది. బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ చేసినా ఎందుకీ స్థాయిలో కుక్కలు అధికమవుతున్నాయి అని అంటే మాత్రం అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సర్వేలో నగరంలో 5.61 లక్షల కుక్కలున్నట్టు గుర్తించారు. వాటిలో 2 లక్షల్లోపు కుక్కలకే స్టెరిలైజేషన్‌ జరిగినట్టు నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. అంబర్‌పేట ఘటన నేపథ్యంలో ఈ యేడాది ఫిబ్రవరిలో ఇచ్చిన వివరాల్లో 2020 అనంతరం మరో 1.63 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేసినట్టు వివరాలు వెల్లడించారు. కాగితాల్లో లెక్కలు చూపడం ఆది నుంచి అలవాటున్న వెటర్నరీ విభాగం కుక్కల సంఖ్య పెరుగుతోన్నా.. కుక్కకాటు బాధితులు అధిమవుతోన్నా తీరు మార్చుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టకుండా.. కాగితాల్లో కనికట్టు చేస్తున్నారు.

కోట్లల్లో ఖర్చు చేస్తున్నా..

కుక్కల నియంత్రణ బాధ్యతలను కొన్నాళ్ల క్రితం స్వచ్ఛంద సంస్థలకు జీహెచ్‌ఎంసీ అప్పగించింది. కుక్క లను పట్టుకోవడంతోపాటు వాటికి శస్త్రచికిత్సలు చేయడం, సంరక్షణ, ఆహారం కోసం నిర్ణీత మొత్తాన్ని ఎన్‌జీఓలకు చెల్లిస్తున్నారు. బల్దియా తరపు పలు ఏనిమల్‌ కేర్‌ సెంటర్లలో అవుట్‌ సోర్సింగ్‌లో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఫిర్యాదుల మేరకు వీధుల్లో పట్టుకొచ్చిన కుక్కలకు శస్త్రచికిత్స చేయడంతోపాటు ఐదునుంచి వారం రోజులపాటు అక్కడే ఉంచి మందులు, ఆహారం అందజేస్తారు. కొన్ని కేంద్రాల్లో కోతులనూ ఉంచి ఆహారం పెడ్తారు. యాంటీ రేబీస్‌ వ్యాక్సినేషన్‌ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం యేటా రూ.15 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు లెక్కలు చూపుతున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తోన్నా.. కుక్కల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం. వెటర్నరీ విభాగం పనితీరు, నిధుల వ్యయంపై ఆది నుంచి అనుమానాలున్నాయి. ఏనిమల్‌ కేర్‌ సెంటర్లలో ఫీడింగ్‌ కోసం వెచ్చించాల్సిన డబ్బులు కొందరు అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయన్న ఫిర్యాదులు గతంలో వచ్చాయి. దీనిపై సంస్థలోని విజిలెన్స్‌ విభాగం విచారణ జరపగా.. వాస్తమే అని తేలింది. అనంతరం అవినీతికి సంబంధించి ఆధారాలు లభించినా.. అన్ని విచారణ నివేదికల్లానే పక్కన పెట్టారు. దీంతో ఆ విభాగంలోని కొందరు అధికారులు మరింత రెచ్చిపోతున్నారు.

శివారులో మరీ అధ్వానం..

నగర శివార్లలోని కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వీధి కుక్కలను నియంత్రణను అక్కడ పట్టించుకునే నాథుడు లేడు. నిజాంపేటలో ఓ చిన్నారి మెడ పట్టుకొని వీధి కుక్క లాక్కెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడింది. గతంలోనూ నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలో కుక్క కాట్లపై స్థానికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-12-17T11:24:10+05:30 IST