Sharmila: కేసీఆర్‌ ఒక 420..

ABN , First Publish Date - 2023-02-08T12:49:45+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక 420.. 8యేళ్ల పాలనలో ఇచ్చిన ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయని అసమర్థుడు. తెలంగాణ పేరిట బీర్లు,

Sharmila: కేసీఆర్‌ ఒక 420..

- బంగారు తెలంగాణ కాదు.. బీర్లు, బ్రాండీల తెలంగాణ

- వైఎస్సార్‌టీపీని గెలిపిస్తే రాజన్న రాజ్యం

- వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల

- ధర్మసాగర్‌, జఫర్‌గడ్‌, ఐనవోలు మండలాల్లో సాగిన యాత్ర

ఐనవోలు(వరంగల్), ఫిబ్రవరి 7: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక 420.. 8యేళ్ల పాలనలో ఇచ్చిన ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయని అసమర్థుడు. తెలంగాణ పేరిట బీర్లు, బ్రాండీలతో రాష్ట్రాన్ని మార్చివేశారు్‌ అని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) విమర్శించారు. వైఎస్సార్‌ టీపీ పాదయాత్ర మంగళవారం ఐనవోలు మండలం వనమాలకనపర్తి, గర్మిళ్లపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా గర్మిళ్లపల్లిలో ఆమె మాట - ముచ్చట కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా జీవించారన్నారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతానని అధికారం చేపట్టిన కేసీఆర్‌.. అప్పుల రాష్ట్రంగా మార్చాడన్నారు. మిగులు బడ్టెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం రూ.4 లక్షల కోట్ట అప్పుల రాష్ట్రంగా ఖ్యాతిని తెచ్చారన్నారు. అభివృద్ధి, ప్రాజెక్టుల పేరు చెప్పి వేలకోట్ల కమీషన్లను కేసీఆర్‌ కుటుంబం దండుకుందని విమర్శించారు. ప్రజల సమస్యలను తెలియపరిచేందుకే పాదయాత్ర చేపట్టానని, ఇప్పటికి 3600 కిలోమీటర్లకు చేరిందన్నారు. ఆశీర్వదించి అధికారం ఇస్తే సంక్షేమ పూర్వ వైభవాన్ని తీసుకవస్తామన్నారు.

కేసీఆర్‌ను సార్‌ అనొద్దు..

గర్మిళ్లపల్లి మాటముచ్చట కార్యక్రమంలో యాదమ్మ అనే మహిళ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగింది. వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. పదే పదే కేసీఆర్‌ సారు అని ఉచ్ఛరిస్తుంటే యాదమ్మ అనే మహిళ కలుగజేసుకుని కేసీఆర్‌ను సారు కాదు.. మోసగాడని అనాలని పరష పదజాలంతో దూషించింది. అనంతరం గ్రామస్థుడు కొమురయ్య మాట్లాడుతూ.. రేషన్‌బియ్యంను వండి కుక్కలకు పెడితే కుక్కలు సైతం తినడంలేదని.. తామెలా తినాలని ప్రశ్నించాడు. కంటిచూపులేని రాజు మాట్లాడుతూ.. దళితబంధు పథకంలో ముందుగా డబ్బులు ముట్టచెప్పిన వారికే ఇస్తున్నారని, ఈ పాలన మాకొద్దు అని విమర్శించారు. పలువురు మహిళలు, వృద్ధులు, వికలాంగులు తమకు పింఛన్లు రావడంలేదని మొరపెట్టుకున్నారు.

గుంటూరుపల్లిలో బస

షర్మిల పాదయాత్ర ఐనవోలు మండలం వెంకటాపురం క్రాస్‌నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ గర్మిళ్లపల్లి శివారుపల్లె గుంటూరుపల్లికి చేరుకుంది. రాత్రి ఆకేరు వాగు ఒడ్డున గుంటూరుపల్లిలో బస చేశారు. బుధవారం ఆకేరువాగు ఆవల జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం తిడుగు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.

కేసీఆర్‌ ఓ అబద్దాల కోరు

ధర్మసాగర్‌ : సీఎం కేసీఆర్‌ ఓ అబద్దాల కోరు, మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్న మోసకారి అని వైఎస్సార్‌టీపీ నాయకురాలు షర్మిల అన్నారు. మంగళవారం ఉదయం షర్మిల పాదయాత్ర ధర్మసాగర్‌ మండలం ధర్మాపురం, మల్లక్‌పల్లి గ్రామాల మీదుగా పాదయాత్రను నిర్వహించారు. ప్రజాప్రస్ధానం పాదయాత్ర 3,600 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ధర్మాపురంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో వరంగల్‌ జిల్లా దేవాదుల ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం జరిగిందని, 70 శాతం పనులు పూర్తి చేశారని, మిగతా 30 శాతం పనులను ఎన్నిమిది సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి చేయని అసమర్ధుడు కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. కాగా, ధర్మసాగర్‌ మండలం నుంచి షర్మిల పాదయాత్ర పూర్తి అయిన తర్వాత ఐనవోలు మండలంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ టీపీ నాయకులు ఇర్మియా, టెకుమట్ల విష్ణు, రాజు, అభిమానులు పాల్గొన్నారు.

ఆదరించి... ఆశీర్వదించండి

జఫర్‌గఢ్‌ : వైఎస్ఆర్‌ బిడ్డగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి విచ్చేసిన తనను ఆదరించి.. ఆశీర్వదించాలని వైఎస్సార్‌టీపీ తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల కోరారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 229వ రోజు మంగళవారం ధర్మసాగర్‌ మండలం ధర్మాపురం, మల్లక్‌పల్లి, వెంకటాపూర్‌, గుంటూరు గూడెం క్రాస్‌ మీదుగా మధ్యాహ్నం జఫర్‌గడ్‌ మండల శివారుకు చేరుకుంది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి మండలంలోని రఘునాథ్‌పల్లి, కూనూరు గ్రామాల్లో ఆమె పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా పంట క్షేత్రాల వద్ద, పలు వీధుల్లో కూలీలు, మహిళలు, వృద్ధులు, గ్రామస్థులను కలుసుకుని అభివాదం చేశారు. అనంతరం ఈ పాదయాత్ర కూనూరు మీదుగా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలోకి ప్రవేశించింది.

ఇదికూడా చదవండి: కేసులో దూసుకెళుతున్న ఈడీ.. మరో కీలక వ్యక్తి అరెస్ట్

Updated Date - 2023-02-08T12:49:45+05:30 IST