ఇంకెన్నాళ్లు?

ABN , First Publish Date - 2023-05-31T23:48:38+05:30 IST

ధరణి పోర్టల్‌ చిక్కుముడులు వీడటం లేదు. ఏళ్లతరబడి అనేక సమస్యలు పరిష్కారం కాక బాధితులు తలలు పట్టుకుంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగి అలసి పోతున్నారు.

ఇంకెన్నాళ్లు?
కొత్త పాసు పుస్తకంలో కనిపించని భూమి

‘ధరణి’తో రైతులకు తప్పని తిప్పలు

పట్టా భూములు ఇళ్ల స్థలాలుగా నమోదు

పొరపాట్లను దిద్దేందుకు ఆప్షన్‌ లేక ఇబ్బందులు

అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

ధరణి పోర్టల్‌ చిక్కుముడులు వీడటం లేదు. ఏళ్లతరబడి అనేక సమస్యలు పరిష్కారం కాక బాధితులు తలలు పట్టుకుంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగి అలసి పోతున్నారు. పొరపాట్లను ఇంకెప్పుడు సరిచేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణిలో నమోదైన తప్పులను సరి చేసేందుకు ఆప్షన్లు లేక అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

షాద్‌నగర్‌ రూరల్‌, మే 30 : ధరణి కష్టాల నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ మాయల నుంచి సామాన్య రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు బాధితులుగా మిగిలిపోతున్నారు. పొరపాట్లను సరిచేసుకునేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశం లేకపోవడంతో ఏళ్లతరబడి ఇబ్బంది పడుతున్నారు. అయినా ధరణి పోర్టల్‌లో జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి ఆప్షన్లు రావడం లేదు.

ఇళ్ల స్థలాలుగా పట్టా భూములు

సమగ్ర భూ ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములను కంప్యూటరైజ్డ్‌ చేసింది. గతంలో జరిగిన పొరపాట్లను సరి చేయకుండానే డిజిటల్‌ పాసుపుస్తకాలను తీసుకువచ్చింది. భూములను కంప్యూటర్‌లో నమోదు చేసే సమయంలో ఆఽధార్‌ కార్డు అనుసంధానం చేయకపోవడంతో పట్టా భూములు ఇళ్ల స్థలాలుగా నమోదయ్యాయి. వాటిని సరి చేసేందుకు ధరణిలో ఆప్షన్‌ లేకపోవడంతో తహసీల్దార్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం హాజిపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ సింగారం శ్రీనివా్‌సకు అదే గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 27లో 0.30 గుంటలు, సర్వే నెంబరు 22లో గుంటన్నర భూమి ఉంది. ఆ భూమి ధరణిలో ఇళ్ల స్థలాలుగా నమోదైంది. ఏళ్ల తరబడి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.

భూమి లేకున్నా పాసు పుస్తకం, రైతు బంధు

ధరణిలో జరిగిన పొరపాట్ల వల్ల భూమి లేనివారికి పాసు పుస్తకాలు ఇవ్వడమే కాకుండా రైతుబంధు కూడా ఇస్తున్నారు. గతంలో ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు భూమి లేకున్నా 1.38 ఎకరాలకు పాసు పుస్తకం ఇచ్చారు. నేటికీ అతడి ఖాతాలో రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. అలాగే చటాన్‌పల్లి శివారులో సర్వే నెంబర్‌ 577లో కూడ ఓ వ్యక్తికి భూమి లేకున్నా పాసు పుస్తకం ఇచ్చారు. అతడికి పాసుపుస్తకం ఇచ్చారు. విశేషమేమంటే ఏకంగా అతడు కాస్తు చేస్తున్నట్లు గతంలో పని చేసిన వీఆర్వో సర్టిఫికెట్‌ ఇవ్వడం విచిత్రం. సదరు వ్యక్తి పెద్దలు ఆ సర్వే నెంబరులో రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి తర్వాత రెండు ఎకరాలు ఇతరులకు విక్రయించారు. కానీ, వాళ్ల వారసుల పేరు మీద మళ్లీ ఎకరం భూమి రికార్డుల్లోకి ఎక్కించారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారి మధురాపూర్‌ గ్రామ శివారులో గతంలో ఎకరం భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని ఇతరులకు విక్రయించారు. అయితే ఆ భూమి ధరణిలో కొన్నవారి పేరు మీద లేదు, అమ్మివారి పేరు లేదు.

వీఆర్వో వ్యవస్థ రద్దుతో...

గతంలో భూములకు సంబంధించిన సమస్యలు ఉంటే రైతులు నేరుగా వీఆర్వోల దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పుకునేవారు. కానీ, నేడు అటువంటి పరిస్థితి లేదు. తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లకే పరిమితమయ్యారు. దీంతో ధరణిలో జరిగిన పొరపాట్లను సరి చేసే అవకాశం లేదు. ఉన్న ఆప్షన్లకు దరఖాస్తు చేసుకుంటే కొన్ని కలెక్టర్‌ స్థాయిలో సరి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా కారణం చేత దానిని రిజెక్ట్‌ చేస్తే మీ సేవకు చెల్లించిన రుసుము పోయినట్లే. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ రుసుము చెల్లించాలి. అయినా తర్వాత కూడా సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియని పరిస్థితి.

తహసీల్దార్లకు అవకాశం ఇస్తేనే..

తహసీల్దార్లకు భూములను సరిచేసే అవకాశం ఇస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేసి వెంటనే రికార్డుల్లో సరిచేయడానికి వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.

ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కావడం లేదు

హాజిపల్లి గుండ్లకుంట శివారులో సర్వేనెంబర్‌ 27లో 30 గుంటలు, సర్వే నెంబర్‌ 22లో గుంటన్నర భూమి ఉంది. ఆ భూమి వారసత్వంగా వచ్చింది. కానీ ధరణిలో ఆ భూమి ఇళ్ల స్థలాలుగా నమోదైంది. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. తన లాంటి వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్య రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

సింగారం శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌, హాజిపల్లి

ఆప్షన్‌ రాలేదు

ఇళ్ల స్థలాలుగా నమోదైన భూములను మార్చుటకు ధరణిలో ఆప్షన్‌ రాలేదు. ప్రభుత్వం దృష్టిలో కూడా ఆ విషయం ఉంది. ఆప్షన్‌ వస్తే వాటిని సరి చేస్తాం.

- గోపాల్‌, తహసీల్దార్‌, ఫరూఖ్‌నగర్‌

Updated Date - 2023-05-31T23:48:38+05:30 IST