టికెట్ ఎవరికో?
ABN , First Publish Date - 2023-09-04T00:43:09+05:30 IST
కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీ చేయదలిచిన నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
బీజేపీ అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ
దరఖాస్తుకు ఆశావహుల సన్నాహాలు
నేటి నుంచి బీజేపీ దరఖాస్తుల స్వీకరణ
టికెట్ల కోసం పెరుగుతున్న పోటీ
తనకే దక్కుతుందన్న ధీమాలో నేతలు
టికెట్ సాధనకు జాతీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించనుంది. సెప్టెంబరు 4 నుంచి 10వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. హైదరాబాద్ నాంపల్లిలో గల పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. కాగా ఈ సారి బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలకు ధీటుగా అభ్యర్థులను దించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే పోటీ చేసేందుకు నాయకులు సైతం భారీ సంఖ్యలోనే ముందుకు వస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం ఐదారుగురు మంది నాయకుల మధ్య పోటీ నెలకొననుంది. వారిలో కార్పొరేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, గతంలో అసెంబ్లీకి పోటీ చేసిన వారు ఉన్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి చివరికి ముగ్గురి పేర్లను మాత్రమే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలనే యోచనలో రాష్ట్ర నేతలు ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, సెప్టెంబరు 3): కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీ చేయదలిచిన నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్‌ఎస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ గత నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. బీజేపీ కూడా సెప్టెంబరు 4 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. నాంపల్లిలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక సెల్‌ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. బీజేపీలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు సిద్ధమయ్యారు. మారిన పరిస్థితుల్లో ఈ సారి గతం కంటే ఎక్కువే దరఖాస్తులొస్తాయని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. బీజేపీ బలపడటంతో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వారు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ఒక్కో నియోజకరవర్గం నుంచి నలుగురు నుంచి పది మంది వరకు పోటీ పడుతున్నారు. కాగా నగర సమీపంలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలలో పోటీ ఎక్కువగా ఉంది. గతంలో పోటీ చేసిన వారు ఈ సారీ తమకే టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అశావహులు ఎంత మంది ఉన్నా.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురి పేర్లను మాత్రమే జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ఎవరెవరూ టికెట్ ఆశిస్తున్నారు? వారు ఎలా పనిచేస్తున్నారనే అంశాలపై అధినాయకత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. క్షుణ్ణగంగా పరిశీలించాకే టికెట్ ఇవ్వనున్నారు. తనకే టికెట్ అని ఇప్పటికే కొందరు చెప్పుకుంటున్నారు. కొందరు ఆశావహులు బీజేపీ జాతీయ నాయకులతో టచ్‌లో ఉంటూ వారి ప్రాపకంతో టికెట్ సాధించాలని నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో..
షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి గతంలో పోటీ చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. అలాగే ఈటెల రాజేందర్ వెంట బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు ఏపీ మిథున్‌రెడ్డి సైతం టికెట్‌పై కన్నేశారు. పార్టీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి భూపాలచారి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు.
చేవెళ్ల బరిలో ఎవరో?
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ ఈ సారీ పోటీలో ఉండనున్నారు. మాజీ ఎంపీ తులసీరామ్ కుమారుడు విజయ్‌కుమార్ సైతం చేవెళ్ల టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇటీవలే ఆయన పార్టీ కార్యక్రమాల్లో హల్‌చల్ చేస్తున్నారు. అలాగే ఎంపీటీసీ తొంట రవి తనకే టికెట్ అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ స్థానంలో పార్టీ అధిష్ఠానం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, యాచారం మండలానికి చెందిన కొప్పు బాషాను దింపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి మాజీ ఎంపీ ఆసక్తి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు లోక్‌సభ మాజీ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్కడి నుంచి పోటీ చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అశోక్‌గౌడ్ సైతం పోటీలో ఉన్నారు. అలాగే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొరెడ్డి నర్సింహారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎంజాపూర్ మాజీ సర్పంచ్ నోముల దయానంద్‌గౌడ్, మర్పల్లి అంజయ్యయాదవ్, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు యాచారం ఎంపీపీ భర్త కొప్పు బాష కూడా ఇబ్రహీంపట్నం టికెట్‌ను ఆశిస్తున్నారు.
మహేశ్వరం నుంచి టికెట్ ఆశిస్తున్న జిల్లా అధ్యక్షుడు
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాల పునర్విభన తర్వాత మూడోసారి కూడా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే ఇక్కడి నుంచే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్, సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశేశ్వర్‌రెడ్డి మహేశ్వరం లేదా రాజేంద్రగనర్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సమచారం.
కల్వకుర్తిలో మళ్లీ తల్లోజు?
కల్వకుర్తి నియోజకవర్గానికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఈ సారి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయన ఇక్కడ ఐదు సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఈసారి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతోన్నారు.
ఎల్బీనగర్‌లో పోటీకి పెద్ద నాయకులు సై!
ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన టీడీపీలో ఉండగా ఆ పార్టీ నుంచి ఇబ్రహీంపట్నంలో పోటీ చేశారు. అలాగే చంపాపేట్ కార్పొరేటర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ మధుసూదన్‌రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పోటీలో పడుతున్నారు. వారితో పాటు మరికొందరు పెద్ద నాయకులు టికెట్ కోసం పోటీపడే అవకాశాలున్నాయి.
రాజేంద్రనగర్‌లోనూ టికెట్ కోసం పోటీ తీవ్రం
రాజేంద్రగనర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివా్‌సరెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క వేణగోపాల్, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శ్రీధర్, నియోజకవర్గంలో పట్టున్న బాల్‌రెడ్డి, వై.శ్రీధర్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు.
శేరిలింగంపల్లిలో టికెట్ ఫైట్!
శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన గజ్జల యోగానంద్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన మువ్వ సత్యనారాయణ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.