Share News

అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి చేస్తాం

ABN , First Publish Date - 2023-12-10T23:47:14+05:30 IST

తమను ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజలకు తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.

అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి చేస్తాం
తాండూరు రూరల్‌: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న పార్టీ శ్రేణులు

  • విజయోత్సవ ర్యాలీల్లో తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు

  • భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు

  • వికారాబాద్‌లో ’గ్యారంటీ’ పథకాల ప్రారంభం

తాండూరు రూరల్‌, డిసెంబరు 10: తమను ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజలకు తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీల్లో మాట్లాడుతూ.. అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. తాండూరు బుయ్యని మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ఆదివారం తాండూరులో మొదటిసారి విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్‌ నుంచి నెహ్రుగంజ్‌, గాంధీచౌక్‌, భద్రేశ్వర దేవాలయం, మార్వాడీ బజార్‌, రైల్వే స్టేషన్‌, శాంత్‌మహల్‌ చౌరస్తాల మీదుగా కొనసాగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరులో పార్టీలతో సంబంధంలేకుండా తాండూరు ప్రాంత ప్రజలంతా ప్రతీఒక్కరు తన కుటుంబసభ్యులేనని తెలిపారు. ప్రతిపక్షం, అధికారపక్షం అనేది లేకుండా అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి దిశగా ముందుకెళ్తామన్నారు. ఐదేళ్ల అభివృద్ధే మన నినాదం కావాలన్నారు. పక్కనే ఉన్న కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి సీఎం కావడం మన అదృష్టమని తెలిపారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు పథకాలు అమలుచేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. తాండూరులో ఎలాంటి అక్రమ కేసులు, భూకబ్జాలు, బెదిరింపులు ఉండవని, వ్యాపారస్తులు అందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణం నాయకులు అబ్దుల్‌ రవూఫ్‌, డాక్టర్‌ సంపత్‌, అబ్దుల్‌ రజాక్‌, పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌, ప్రభాకర్‌గౌడ్‌, కౌన్సిలర్లు బాల్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టణంలోని గంజ్‌ రక్తమైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పరిగిని అగ్రగామిగా నిలుపుతా: రామ్మోహన్‌రెడ్డి

పరిగి: పరిగి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యేగా డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి రెండవసారి విజయం సాధించిన సందర్భంగా ఆదివారం రాత్రి పరిగి పట్టణంలోని భారీఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌ నుంచి పరిగికి రాగానే కౌన్సిలర్‌ ఎ.అనసూయకృష్ణ గుమ్మడికాయతో దిష్టి తీసి, దీపాలతో స్వాగతం పలికారు. పూడూరు మండలం మన్నెగూడ నుంచి పరిగికి భారీ కాన్వాయ్‌తో ర్యాలీతో పరిగికి చేరుకున్నారు. పరిగిలోని టెలిఫోన్‌ ఏక్చేంజి దగ్గర బాణసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. టెలిఫోన్‌ ఏక్చేంజి నుంచి ప్రజాభవన్‌గా నామకరణం చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి గాంధీ విగ్రహం గంజ్‌రోడ్‌ మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్‌, కొడంగల్‌ చౌరస్తా మీదుగా తన నివాసం వరకు భారీర్యాలీ నిర్వహించారు. పట్టణమంతా కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. గుర్రాలతో భారీ ర్యాలీ, ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి దంపతులు విజయోత్సవ ర్యాలీలో అందరికీ అభివాదం చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఆశ్వాల రథంపై ఎక్కి ఊరేగింపులో పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, చూపించిన ఆదరణను జీవితంలో మరిచిపోలేనన్నారు. గత ఎన్నికల్లో ఒడినా ప్రజల్లో ఉండి సేవలందించానని చెప్పారు. పరిగిని శాశ్వతంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గతంలోనే రూ.5వేల కోట్లతో తాను ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయగా ఇప్పుడు రూ.10వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చుస్తామని తెలిపారు. పరిగికి రైల్వేలైను, పాలమూరు ఎత్తిపోతల, చేవెళ్ల-ప్రాణహితను సాగునీరును పరిగికి తీసుకొస్తామని తెలిపారు. నాలుగులేన్‌ల రోడ్డు, పూడూరు నేవీరాడార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, కార్యదర్శి కె.హన్మంత్‌, పరిగి పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, నాయకులు బి.పరుశరాంరెడ్డి పాల్గొన్నారు.

వికారాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

వికారాబాద్‌: వికారాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను ఆదివారం ఆయన ఇక్కడ ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ బస్సులను ప్రారంభించారు. అదేవిధంగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా పథకాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సు ప్రయాణంలో ప్రజలతో కలిసి సామాన్యుడిలా ప్రయాణించారు. వికారాబాద్‌ జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయన్నారు. మన ప్రాంతం వారే ముఖ్యమంత్రి కావడంతో తాను మంచి పదవిని పొందే అవకాశం ఉందన్నారు. కచ్చితంగా వికారాబాద్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, ఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో పల్వాన్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, ఎంపీపీ చంద్రకళ, కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి, నాయకులు ఎర్రవల్లి జాఫర్‌, వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:47:15+05:30 IST