మాకూ న్యాయం చేయాలి
ABN , Publish Date - Dec 27 , 2023 | 12:07 AM
ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం కింద తమకు న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విన్నపం
షాద్‌నగర్ రూరల్, డిసెంబరు 26: ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం కింద తమకు న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని బిల్లుల చెల్లించలేదన్నారు. అప్పట్లో ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.91వేలు మంజూరు చేసేది. ప్రభత్వం మారడం, గృహ నిర్మాణ శాఖను రద్ధుతో తమకు ఇళ్ల బిల్లులు ఇవ్వలేదన్నారు. మూడు దశల్లో బిల్లులు మంజూరు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పథకాన్ని తెచ్చి ఇందిరమ్మ ఇళ్లను పట్టించుకోలేదు.
నియోజకవర్గంలో 518 మంది లబ్ధిదారులు
షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొత్తూరు మండలాల్లో అసంపూర్తి ఇళ్ల లబ్ధిదారులు 518 మంది ఉన్నారు. వాటికి బిల్లులు రాక కొన్ని బేస్మెంట్, కొన్ని పిల్లర్లు, మరికొన్ని స్లాబ్ దశల్లో ఉన్నాయి. బిల్లులు ఇవ్వక లబ్ధిదారులు వాటిని పూర్తి చేసుకోలేకపోయారు. అప్పులు చేసి, కొందరు భూమి అమ్ముకొని నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. అయినా కొన్ని ఇళ్లు ఇంకా మొడి గోడలను తలపిస్తున్నాయి. అయితే గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన నేపథ్యంలో తాజాగా తమకు గృహలక్ష్మి పథకం వర్తింస్తుందా లేదా అనే అనుమానాలను లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. తమకు ఇప్పటి లెక్కల ప్రకారం బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉన్న భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకున్నా : దాసరి అంతయ్య, కంసాన్‌పల్లి
గతంలో ఇంటి నిర్మాణానికి రూ.32వేలు ఇచ్చారు. తర్వాత రూపాయి కూడా ఇయ్యిలేదు. ఉన్న కొద్దిపాటి భూమి అమ్ముకొని స్లాబ్ వేసుకొని అరకొర సౌకర్యాలతో ఇంటిని నిర్మించుకున్నా. అప్పుడు బిల్లులు ఇవ్వని వారికి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చి ఆదుకోవాలి.