ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించం
ABN , First Publish Date - 2023-11-21T23:50:57+05:30 IST
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యయ పరిశీలకులు బాలక్రిష్ణ(ఐఆర్‌ఎస్), రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్‌మిశ్రా(ఐపీఎ్‌స)లు అన్నారు.

రాష్ట్ర వ్యయ పరిశీలకులు, రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్
రంగారెడ్డి అర్బన్, నవంబరు 21: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యయ పరిశీలకులు బాలక్రిష్ణ(ఐఆర్‌ఎస్), రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్‌మిశ్రా(ఐపీఎ్‌స)లు అన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం వారు సమీక్షించారు. కలెక్టర్ భారతి హొలికేరీ, రాచకొండ సీపీ డీసీచౌహాన్, 8 నియోజకవర్గాల వ్యయ పరిశీలకులతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలకులకు వివరించారు. 8 అసెంబ్లీ స్థానాల్లో 209మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. ఈవీఎంలు, సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజెషన్ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో 3,453 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. నియోజకవర్గానికి 5చొప్పున 40మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 80ఏళ్లకు పైబడిన ఓటర్లు, నలభై శాతానికిపైగా వైకల్యం కలిగిన దివ్యాంగ ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆరా
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై జిల్లా వ్యయ, పోలీస్ పరిశీలకులను రాష్ట్ర పరిశీలకులు ఆరా తీశారు. ఈ కేంద్రాల్లోకి ఎలక్షన్ కమిషన్ పాసులున్న వారినే అనుమతించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించాలన్నారు. మొదట కలెక్టర్, సీపీ, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ రాష్ట్ర పరిశీలకులకు స్వాగతం పలికారు.
పోలింగ్ అతి కీలకం
ఎన్నికల్లో పోలింగ్ అతి కీలకమని, ఓటింగ్ ప్రక్రియలో ప్రతీ అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ భారతి హొలికేరి, జనరల్ అబ్జర్వర్లు ఆర్‌ఎస్ నినమ, శిల్పగుప్తా, చంద్రకాంత్, కృష్ణారావుడాంగె రామ్‌కుమార్, తైతులంగ్ పమేయ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. కలెక్టరేట్‌లో శిక్షణ నిర్వహించారు. నిబంధనలు అమలయ్యేలా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా విధులు నిర్వర్తించాలన్నారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30గంటలకే మాక్ పోలింగ్ ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. తాము గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పోలింగ్ కంపార్ట్‌మెంట్ సరిగా ఏర్పాటు చేయించాలన్నారు.