గ్రామాలకు జాతీయ స్థాయి గుర్తింపు తేవాలి

ABN , First Publish Date - 2023-03-25T23:25:31+05:30 IST

రాబోయే రోజుల్లో గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేవిధంగా కృషి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

గ్రామాలకు జాతీయ స్థాయి గుర్తింపు తేవాలి
డీపీవో, డీఆర్‌డీవో, జడ్పీ సీఈవోలను సన్మానిస్తున్న మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

  • జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/వికారాబాద్‌ రూరల్‌/మోమిన్‌పేట్‌/కొడంగల్‌రూరల్‌/తాండూరు రూరల్‌/పరిగి/కులకచర్ల/బొంరా్‌సపేట్‌: రాబోయే రోజుల్లో గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేవిధంగా కృషి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. డీపీఆర్‌సీలో శనివారం జరిగిన జాతీయ పంచాయతీ జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీల పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ గ్రామాలుగా ఎంపికైన 27గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, జడ్పీసీఈవో, డీఆర్‌డీవో, డీపీవోలను అవార్డులు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉత్తమ గ్రామాలుగా ఎంపికైన 27పంచాయతీలకు రూ.10లక్షల వంతున మంత్రి నిధులు మంజూరు చేశారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా టాప్‌ 20 ఉత్తమ గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం తెలంగాణ సర్పంచుల విజయమని ఆమె అన్నారు. గతంలో గ్రామాలకు వెళితే చెత్తాచెదారం స్వాగతం పలికేవని, సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, చెత్తరహిత స్వచ్ఛగ్రామాలుగా రూపుదిద్దుకున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై అవార్డులు తీసుకున్న సర్పంచులను, ఆ గ్రామాలను ఇతర గ్రామాల సర్పంచులు స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల మహే్‌షరెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్లు మనోహర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుశీల్‌కుమార్‌గౌడ్‌, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీపీవో తరుణ్‌కుమార్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, డిప్యూటీ సీఈవో సుభాషిణి, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:25:31+05:30 IST