Share News

ఎంపీపై వికారాబాద్‌ గెలుపు బాధ్యత

ABN , First Publish Date - 2023-10-29T23:29:50+05:30 IST

వికారాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ను గెలిపించే బాధ్యతను బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిపై ఉంచింది.

 ఎంపీపై వికారాబాద్‌ గెలుపు బాధ్యత

అసమ్మతి నాయకులతో ఎప్పటికప్పుడు చర్చలు

పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగా సమన్వయంతో ముందుకు..

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని సూచన

వికారాబాద్‌లో తిష్టవేసిన పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ఎంపీ రంజిత్‌రెడ్డి

వికారాబాద్‌, అక్టోబరు 29 : వికారాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ను గెలిపించే బాధ్యతను బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిపై ఉంచింది. వికారాబాద్‌ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఎమ్మెల్యేకు అనుకూలవర్గం, వ్యతిరేక వర్గాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలవేళ పార్టీలో అసంతృప్త సెగలు బయటకు పొక్కకుండా వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థిగెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ఎంపీ రంజిత్‌రెడ్డిని వికారాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో రంగంలోకి దిగిన ఆయన పార్టీలో అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అసమ్మతి నాయకుల ఇంటింటికీ వెళ్లి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా వారిని ఒప్పించడంలో ఆయన చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమయ్యాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు నాయకులను సమన్వయం చేస్తూ వారిని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు వారాలుగా వికారాబాద్‌ నియోజకవర్గంలో అసమ్మతి నాయకులతో పాటు ఓటర్లను ప్రభావితం చేసే నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతివ్వాలని అభ్యర్థిస్తున్నారు.

పని చేసే నాయకులకు ప్రాధాన్యం

వికారాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలను తీసుకున్న తరువాత రంజిత్‌రెడ్డి పనిచేసే నాయకులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసే నాయకులను గుర్తించిన ఆయన వారిని మండలాలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. మూడు రోజులకు ఒకసారి మండలాల్లో సర్వేలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితిని, నాయకుల పనితీరును అధ్యయనం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులతో ఎంపీ స్వయంగా మాట్లాడుతూ వారిని పార్టీ కోసం పనిచేసే విధంగా బుజ్జగిస్తున్నారు.

నేనున్నా...మీరు పని చేయండి

స్థానిక ఎమ్మెల్యే తీరు పట్ల వ్యతిరేకతతో ఉన్న నాయకులకు సైతం ఎంపీ రంజిత్‌రెడ్డి నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి మీరు పనిచేయండి, మీకు భరోసా కల్పిస్తూ వారిలో స్థైర్యం నింపుతున్నారు. ఇచ్చిన మాట తప్పేది లేదని, మీకు అన్ని విధాలుగా తోడుగా నేను ఉంటానని హామీ ఇస్తూ వారిని ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఎమ్మెల్యేకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పలువురు నాయకులతోనూ ఆయన రహస్యంగా సమావేశమై వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ధీటుగా కాంగ్రెస్‌ ముందుకు దూసుకు వెళుతున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగేలా పనిచేయిస్తున్నారు. నెల రోజులు కష్టపడితే పార్టీ విజయం ఖాయమనే నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లో కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే, జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ మార్క్‌ పనిచేస్తుందా ? లేక ఎంపీ ఎన్నికల్లో ఆయనకు ఉపయోగపడుతుందా అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-10-29T23:29:50+05:30 IST