Share News

మినీ అంగన్‌వాడీల స్థాయి పెంపు

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:24 PM

మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 138 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మినీ అంగన్‌వాడీల స్థాయి పెంపు

138 మినీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా మార్పు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

చిన్నారులు, గర్భిణులు, బాలింతల సేవల్లో మెరుగు

వికారాబాద్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 138 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలనుచ నిర్వహిస్తోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రారంభించగా, ఆ తరువాత ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు కూడా వీటిల్లోనే పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను విస్తరిస్తూ పథకాన్ని నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆరోగ్యసేవలు, పౌష్టికాహారం అందించాలన్నది లక్ష్యం. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే కాకుండా ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. వెయ్యి మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశంలో అంగన్‌వాడీ మెయిన్‌ కేంద్రాలు కొనసాగుతుండగా, అంత కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మినీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట్ల జనాభా, చిన్నారుల సంఖ్య పెరగడంతో సేవలు ఆశించిన స్థాయిలో అందించలేకపోతున్నారు. అంగన్‌వాడీ టీచర్‌ ఒకరే ఉండడంతో మినీ కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారింది. మినీ కేంద్రాల పరిధిలో అంగన్‌వాడీ సేవలు విస్తృతపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాటి స్థాయి పెంచాలనే నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలంగా మినీ కేంద్రాల స్థాయి పెంపు ప్రతిపాదనలకే పరిమితం కాగా, ఇటీవల అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం మినీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహారం

జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులుండగా, వీటి పరిధిలో 1,107 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 4 నెలల కిందటి వరకు 7నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 33,057 మంది ఉన్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు 20,644 మంది, గర్భిణులు 6,134, బాలింతలు 5,304 మంది నమోదయ్యారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అనుబంధ పోషకాహారాన్ని అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకపూట సంపూర్ణ భోజనం అందించడమే కాకుండా అదనంగా గర్భిణిలకు, బాలింతలకు రోజూ ఉడికించిన గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు అందజేస్తుండగా, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజూ ఉడికించిన గుడ్డు ఒకటి ఇస్తున్నారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపే చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. మినీ కేంద్రాల్లో సిబ్బంది కొరత, పని పెరగడంతో ఆశించిన స్థాయిలో సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జనాభాను దృష్టిలో పెట్టుకునే అప్‌గ్రేడేషన్‌

జిల్లాలో 1,107 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వాటిల్లో 969 మెయిన్‌ కేంద్రాలు, 138 మినీ కేంద్రాలు ఉన్నాయి. మినీ కేంద్రాల పరిధిలో పెరిగిన జనాభా, చిన్నారుల సంఖ్య ఆధారంగా స్థాయి పెంపు నిర్ణయం తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించగా ఆ మేరకు సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మినీ కేంద్రాలన్నింటినీ మెయిన్‌ కేంద్రాలుగా స్థాయి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొండా సురేఖ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ ఫైల్‌పై సంతకం చేశారు. రెండు రోజుల కిందట మినీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా స్థాయి పెంచుతూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్రాల స్థాయి పెంపుతో మెరుగవనున్న సేవలు

మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా స్థాయి పెంచడంతో ఆ కేంద్రాల్లో నమోదైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయి. మినీ కేంద్రాల్లో ఒక టీచర్‌ మాత్రమే ఉండడంతో వారికి పౌష్టికాహారం అందించడానికే సమయం సరిపోతోంది. చిన్నారులను ఆటలు ఆడించడం, పాడించడం, పూర్వ ప్రాథమిక విద్యా బోధన చేయడం వంటి పనులు నిర్వర్తించడంలో ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ సర్వేలు, పథకాల అమలుతీరు, బీఎల్‌వో విధులు తదితర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా పాల్గొంటున్నారు. మినీ కేంద్రాల్లో ఉండే ఒక టీచర్‌కు ఇలాంటి పనులు అప్పగించడంతో ఆ సమయాల్లో కేంద్రాలను మూసి వేయక తప్పడం లేదు. మినీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా స్థాయి పెంచడం వల్ల కొత్తగా సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉంటుంది. మెయిన్‌ కేంద్రాల్లో ఉండే విధంగానే ఒక టీచర్‌తో పాటు ఆయా కూడా నియమించే ఆస్కారం ఉంది. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్‌కు నెల వేతనం రూ.7,800 చెల్లిస్తుండగా, స్థాయి పెరిగితే మెయిన్‌ కేంద్రాల్లో పనిచేసే టీచర్లకు ఇస్తున్న వేతనాన్నే వీరికీ చెల్లిస్తారు.

Updated Date - Dec 18 , 2023 | 11:24 PM