రైతులపై దౌర్జన్యం తగదు

ABN , First Publish Date - 2023-06-02T23:55:27+05:30 IST

అప్రోచ్‌ రోడ్డుకు భూసేకరణ చేసి పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో పనులేలా చేపడతారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులపై దౌర్జన్యం తగదు
రైతుల సమస్యపై ఎస్‌ఐతో మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్‌, నాయకులు

  • టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌

బషీరాబాద్‌, జూన్‌ 2: అప్రోచ్‌ రోడ్డుకు భూసేకరణ చేసి పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో పనులేలా చేపడతారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల ఆందోళనతో జీవన్గి గ్రామానికి చేరుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాధవరెడ్డితో కలిసి శుక్రవారం బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుకు భూమిని సేకరించి ఏడాది కిందట పరిహారం మంజూరు చేసినా ఇంతవరకు ఇవ్వకుండా దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని భూనిర్వాసితులు ఆయనతో మొరపెట్టుకున్నారు. ఇందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు సీరియ్‌సగా స్పందించారు. అప్రోచ్‌ రోడ్డు పనులను రైతులతో కలిసి అడ్డుకున్నారు. అనంతరం అక్కడే బైటాయించి విలేఖర్లతో మాట్లాడారు. 2020 సంవత్సరంలో 19 మంది రైతుల వద్ద 11ఎకరాల భూమిని అధికారులు సేకరించారని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకుని కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా రోడ్డు పనులు చేయించడమేమిటని ప్రశ్నించారు. భూ నిర్వాసితులు పరిహారం అడిగితే జేసీబీతో తొక్కిస్తామని బెదిరింపులకు గురిచేయడమేమిటని ఆయన మండిపడ్డారు. భూ నిర్వాసితులకు ఎమ్మెల్యే పరిహారం ఇప్పించకుండా అభివృద్ధి పేరిట పనులు చేయిస్తే తర్వాత రైతులను పట్టించుకునేదేవరన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు దాదాగిరి చూపిస్తే ఇకపై ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అనంతరం రమేష్‌ ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడుతూ రైతులకు పరిహారం విషయమై చర్చించి, పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూ నిర్వాసితులకు ఎమ్మెల్యే పరిహారం ఇప్పిస్తే దగ్గరుండి పనులు చేయిస్తారని, భయబ్రాంతులకు గురిచేయొద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌ అన్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ సీనియర్‌ నాయకులు ఎం.నరేష్‌ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ రైతులకు అండగా ఉంటుందని, భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడి వెంట ఆపార్టీ సీనియర్‌ నాయకులు జనార్ధన్‌రెడ్డి, నర్సిరెడ్డి, తాండూరు మునిసిఫల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ అలీం తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-06-02T23:55:27+05:30 IST