కదం తొక్కిన గిరిజన రైతులు

ABN , First Publish Date - 2023-03-21T22:57:56+05:30 IST

ఆమనగల్లు మున్సిపాలిటీ సాకిబండ తండా సమీపంలో నెమినెల్‌ గుట్ట వద్ద పచ్చని పంట పొలాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మైనింగ్‌ అనుమతులను రద్దు చేసి పనులను వెంటనే నిలిపివేయాలని తండా రైతులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు కదం తొక్కారు.

కదం తొక్కిన గిరిజన రైతులు
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజనులు, నాయకులు

మైనింగ్‌ పనులు నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన

ఆమనగల్లు , మార్చి21: ఆమనగల్లు మున్సిపాలిటీ సాకిబండ తండా సమీపంలో నెమినెల్‌ గుట్ట వద్ద పచ్చని పంట పొలాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మైనింగ్‌ అనుమతులను రద్దు చేసి పనులను వెంటనే నిలిపివేయాలని తండా రైతులు, ప్రజలు, అఖిలపక్ష నాయకులు కదం తొక్కారు. మంగళవారం ర్యాలీగా వెళ్లి ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనుమతులను రద్దు చేసి మైనింగ్‌ పనులు నిలిపివేసే వరకు ఆందోళన విరమించబోమని అఖిల పక్ష నేతలు భీష్మించారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏర్పాటు చేసిన మైనింగ్‌ వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని, ఇళ్లు బీటలు బారుతున్నాయని, మూగ జీవాలు అనారోగ్యం బారిన పడుతున్నాయని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని సాకిబండతండా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్‌ విషయంలో స్థానిక ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ సహకరించని పక్షంలో ఆయన ఇంటిని, కల్వకుర్తి కాం్యపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. అనంతరం మైనింగ్‌ పనులు నిలిపివేయాలని తహసీల్దార్‌ జ్యోతికి వినతి పత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కండె హరిప్రసాద్‌, చీమర్ల అర్జున్‌రెడ్డి, నేనావత్‌ రాంపాల్‌ నాయక్‌, గోరటి నర్సింహ, గన్యనాయక్‌, కృష్ణనాయక్‌, కృష్ణయాదవ్‌, శ్రీకాంత్‌ సింగ్‌, నరేందర్‌, రవిరాథోడ్‌, వినోద్‌, రమేశ్‌, దేవేందర్‌, గోపాల్‌, శివరామ్‌, నరేశ్‌, దశరథం, శ్రీను, బాలు, విజయేందర్‌, రాజేందర్‌, జైపాల్‌, గోపి, బాలు, శేఖర్‌, మహేశ్‌, హర్షవర్ధన్‌, గోవర్దన్‌, గోవిందు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T22:57:56+05:30 IST