దంచికొట్టిన వర్షం

ABN , First Publish Date - 2023-07-23T00:39:13+05:30 IST

ఉమ్మడి జిల్లాలో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం కుదుటపడింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో వానాకాలం సాగుపై రైతాంగం ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే గడిచిన వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో అన్నదాతలు ఊరట చెందారు.

దంచికొట్టిన వర్షం

వికారాబాద్‌లో 73శాతం అధిక వర్షపాతం

రంగారెడ్డిలో 42, మేడ్చల్‌లో 44 శాతం అధికం

దుద్యాలలో రికార్డు స్థాయిలో 511మి.మీ వర్షపాతం నమోదు

విస్తారంగా కురిసిన వర్షాలతో ఊపందుకున్న సాగు పనులు

నీటి వనరుల్లోకి భారీగా వరద ... నాట్లకు దున్నకాలు

పెరుగుతున్న భూగర్భ జలమట్టాలు.. బోర్లలో చేరుతున్న నీరు

ఐదారు రోజులుగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లాలో కరువు తీరినట్టయింది. మొన్నటి వరకు సాగు పనులకు సరిపడా వర్షాల్లేక విత్తనాలు, నాట్లు వేసుకునేందుకు ఆలస్యం అవుతోందని రైతులు దిగులు చెందారు. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో నాలుగైదు రోజులు ఏకధాటిగా వర్షాలు కురియడంతో నీటి వనరుల్లోకి పుష్కలంగా నీరొచ్చింది. దీంతో సాగు పనులు ఊపందుకున్నాయి. తాజా వర్షాలతో మూడు జిల్లాల్లోనూ వర్షపాత లోటును అధిగమించినట్టయింది. వికారాబాద్‌ జిల్లాలో సాధారణం కంటే 73శాతం, మేడ్చల్‌ జిల్లాలో 44శాతం, రంగారెడ్డి జిల్లాలో 42శాతం చొప్పున అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం!

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 22): ఉమ్మడి జిల్లాలో గత కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం కుదుటపడింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో వానాకాలం సాగుపై రైతాంగం ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే గడిచిన వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో అన్నదాతలు ఊరట చెందారు. ఉమ్మడి జిల్లాలో ఐదారు రోజులుగా తెరిపివ్వకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కొన్ని రోజుల క్రితం వరకూ సాధారణ వర్షపాతం కూడా కురవక లోటుగా ఉన్న వర్షపాతం ఐదారు రోజులుగా కురిసిన వానలతో ఇప్పటి వరకు ఉన్న లోటు భర్తీ కావడంతో పాటు కొన్ని చోట్ల అధిక వర్షపాతం కురిసింది. మూడు జిల్లాల్లోనూ సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదైంది. దీంతో జిల్లాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులంతా సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. వాస్తవానికి జూన్‌లో అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. జూలై మొదటి పక్షంలోనూ కొన్ని చోట్ల చిరు జల్లులే తప్పా ఎక్కడా పెద్ద వర్షాలు కురియలేదు. ఇక పంటలు విషయానికి వస్తే ఈ ఏడాది వికారాబాద్‌ జిల్లాలో మాత్రమే పంటల సాగు ఆశించినంతగా ఉంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వర్షాలు లేకపోవడంతో బోర్ల కింద మాత్రమే నారు పోయడం, కొంత కూరగాయ, ఇతర మెట్ట పంటలు వేసుకున్నారు. వానాకాలం ఆరంభం నుంచీ ఈ జిల్లాల్లో సాగు పనులు నామమాత్రంగానే జరిగాయి. ఇప్పటి వరకు వికారాబాద్‌ జిల్లాలో 74.3శాతం పంటలు సాగు చేయగా, రంగారెడ్డి జిల్లాలో 29.63శాతం, మేడ్చల్‌ జిల్లాలో 10.45శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు సాగు చేశారు.

సాగు పరిస్థితిని మార్చిన తాజా వర్షాలు

వర్షాకాలం వచ్చి నెలన్నరకుపైగా అయినా పంటలు సాగు చేసుకునేలా వానలు పడలేదు. వికారాబాద్‌ జిల్లాతో పోలిస్తే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మరింత లోటు వర్షపాతం ఉండేది. అయితే కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మూసీ, ఈసీ, కాగ్నా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. ఇప్పటి వరకు ఈ జిల్లాలో సాధారణం కంటే 73శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మేడ్చల్‌ జిల్లాలో 44శాతం, రంగారెడ్డి జిల్లాలో 42శాతం అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తి మూసీలోకి వరదనీటిని వదులుతున్నారు. భూగర్భ జలమట్టాలు కూడా పెరుగుతున్నాయి. ఎండిన బోర్లలో నీరు వస్తోంది. దీంతో రైతులు సంతోషిస్తున్నారు. చెరువులు, కుంటలు, బోర్ల కింద సాగు పనులు ముమ్మరం అయ్యాయి. ఇన్ని రోజులూ వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు తాజా వానలతో ఆనందంగా సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. శనివారం నుంచి ముసురు కొంత తెరిపివ్వడంతో వ్యవసాయ పనులు చురుకుగా సాగుతున్నాయి.

దుద్యాలలో రికార్డు వర్షపాతం

అనేక చోట్ల కుండపోతగా వర్షాలు కురవడంతో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా దుద్యాల మండలంలో ఇప్పటి వరకు 511 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వికారాబాద్‌ జిల్లా ధారూర్‌, తాండూరు, పెద్దేముల్‌ మండలాల్లోనూ 500మి.మీ వరకు వర్షపాతం నమోదవడం గమనార్హం. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా మండలాల్లో సగటు వర్షపాతంలో ఈ ఏడాది సగం వర్షపాతం ఇప్పటికే నమోదైంది. అయితే శంషాబాద్‌, కందుకూరు, కడ్తాల్‌, మేడిపల్లి, హయత్‌నగర్‌ మండలాల్లో మాత్రం సగటు కంటే కొంచెం తక్కువగానే వర్షాలు కురిశాయి.

వర్షానికి పలుచోట్ల కూలిన ఇళ్లు

షాద్‌నగర్‌ రూరల్‌/కొందుర్గు/కడ్తాల్‌: ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్లలో వర్షానికి రెండు ఇళ్లు కూలాయి. వెంకటేశ్‌, పాండయ్యల ఇళ్లు శుక్రవారం తెల్లవారు జామున కూలిపోయాయి. అలాగే బుచ్చిగూడ, పీర్లగూలో మరో రెండు ఇళ్లు కూలినట్లు తహసీల్దార్‌ గోపాల్‌ తెలిపారు. కొందుర్గు మండలం చిన్నఎల్కిచర్లలో ఏముల పార్వతయ్య ఇల్లు కూలింది. పులప్పగూడలో నిక్క రాములు ఇల్లు కూడా వానలకు కూలిపోయింది. ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరారు. కడ్తాల్‌ మండలం మైసిగండిలో అయిళ్ల లక్ష్మమ్మ వ్యవసాయ భూమికి కట్టిన ప్రహరీ కూలిపోయింది. ప్రహరీ కట్టేందుకు తనకు రూ.4లక్షల వరకూ ఖర్చయిందని ఆమె వాపోయారు.

Updated Date - 2023-07-23T00:39:13+05:30 IST