కొట్లాడికొట్లాడి అలసిపోయినం!

ABN , First Publish Date - 2023-03-25T23:05:47+05:30 IST

ఉద్యమకాలం నుంచి కొట్లాడికొట్లాడి అలసిపోయినం..కొట్లాడినోళ్లంతా కనుమరుగయ్యారు.. కిందిస్థాయిలో అనుకున్నంత ఈజీగా లేదు...కార్యకర్తలు, ఉద్యమకారుల్లో దాగివున్న ఆవేశం, కోపం బద్ధ్దలైతే తట్టుకోలేరంటూ పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమలోని ఆక్రోశాన్ని ఆత్మీయ సమ్మేళనంలో వెళ్లగక్కారు.

కొట్లాడికొట్లాడి అలసిపోయినం!
సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా సమన్వయకర్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

కార్యకర్తలు, ఉద్యమకారులు ఆగ్రహిస్తే తట్టుకోలేరు

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తల ఆవేదన

ఓదార్చి అక్కున చేర్చుకుంటాం : జిల్లా సమన్వయకర్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి

అందరికీ న్యాయం చేస్తా : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉద్యమకాలం నుంచి కొట్లాడికొట్లాడి అలసిపోయినం..కొట్లాడినోళ్లంతా కనుమరుగయ్యారు.. కిందిస్థాయిలో అనుకున్నంత ఈజీగా లేదు...కార్యకర్తలు, ఉద్యమకారుల్లో దాగివున్న ఆవేశం, కోపం బద్ధ్దలైతే తట్టుకోలేరంటూ పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమలోని ఆక్రోశాన్ని ఆత్మీయ సమ్మేళనంలో వెళ్లగక్కారు. మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం శనివారం శామీర్‌పేట అలియాబాద్‌ చౌరస్తాలోని సీఎంఆర్‌ కన్వెషన్‌లో నిర్వహించారు. జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు తమలోని ఆక్రోశాన్ని, ఆవేదనను సభ దృష్టికి తీసుకువచ్చారు. 2వసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పూర్తిగా విస్మరించారన్నారు. ఐక్యత లేదు కాబట్టే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాల్సి వస్తోందని పలువురు కార్యకర్తలు స్పష్టం చేశారు.

అక్కున చేర్చుకుంటాం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

కార్యకర్తలు, ఉద్యమకారుల ఇబ్బందులను గుర్తించి ఓదార్చి సహాయపడి అక్కున చేర్చుకుంటామని జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆత్మీయసమ్మేళనంలో మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్న తరువాత లబ్ధిపొందింది తెలంగాణ ప్రజలేనని, నష్టపోయింది మాత్రం కార్యకర్తలేనన్నారు. భవిష్యత్‌లో అందరికి న్యాయం చేస్తామన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, పేపర్‌ లీకేజీలో ప్రతిపక్షాలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారని దానిని మనం తిప్పికొట్టాలన్నారు. గట్టిగా మాట్లాడితే రైడ్స్‌ చేస్తున్నారని, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లో బీఆర్‌ఎ్‌సపై విషం గక్కుతున్న వారిని తెలంగాణసమాజం నుంచి వెలివేయాలన్నారు.

అందరికీ న్యాయం చేస్తా : మంత్రి మల్లారెడ్డి

దేశంలో, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ది మేడ్చల్‌ నియోజకవర్గంలో జరుగుతున్నదని, తాను ఎవరికీ అన్యాయం చేయనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 141 మంది ఉద్యమకారులకు జవహర్‌నగర్‌లో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ఇప్పించానని, త్వరలోనే జిల్లాలో జీవో 58 కింద 25వేలు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, వ్యక్తిగత ఇబ్బందులను పట్టించుకోవద్దన్నారు. త్వరలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మహిళా సమ్మేళనం నిర్వహిస్తానన్నారు. కాగా సమావేశంలో మంత్రి బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజశేఖర్‌రెడ్డిని ప్రస్తావిస్తూ నా అల్లుడు బంగారం... అల్లుడంటే రాజశేఖర్‌రెడి ్డ లెక్క ఉండాలే.... మామకు తగ్గ అల్లుడు అంటూ నవ్వులు పూయించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారరెడ్డి, మాట్లాడుతూ జిల్లాలో కార్యకర్తల్లో ఉన్న ఆవేదనను గుర్తించి చక్కదిద్దాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శర త్‌చంద్రారెడ్డి అన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కష్టపడిని వారిని కాపాడుకుంటామని పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవులు వచ్చేంత వరకు ఓపిగ్గా ఉండాలని అందరం కలిసికట్టుగా ఉంటూ కేసీఆర్‌ను కాపాడుకుందామన్నారు. బీజేపీ వారు హిందుత్వం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్‌ హిందువులకు ఏం తక్కువ చేశాడని మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ దయాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌, నియోజకవర్గ ఇంఛార్జ్‌ మహేందర్‌రెడ్డి, మేయర్లు, మున్సిపాల్టీల చైర్మన్‌, పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద ్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:05:47+05:30 IST