వైద్య విద్యకు వేళాయే!

ABN , First Publish Date - 2023-09-10T00:04:28+05:30 IST

జిల్లాలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ వైద్యవిద్య త్వరలో సాకారం కాబోతోంది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు వినియోగించుకునేందుకు వీలుగా ఆసుపత్రి భవనాలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది

వైద్య విద్యకు వేళాయే!
అనంతగిరి ప్రభుత్వ క్షయ, ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల

అనంతగిరిలో సిద్ధ్దమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల

15న వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరిలోని టీబీ ఆసుపత్రి భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైద్య కళాశాలకు సొంత భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు తరగతుల నిర్వహణ, వసతి గృహాల కోసం ఈ ఆసుపత్రి భవనాలను సిద్ధం చేశారు. ఏర్పాట్లకు సంబంధించిన తుది దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు తరగతులు బోధించేందుకు వైద్య కళాశాల అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వికారాబాద్‌, సెప్టెంబరు9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ వైద్యవిద్య త్వరలో సాకారం కాబోతోంది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు వినియోగించుకునేందుకు వీలుగా ఆసుపత్రి భవనాలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. ఈ భవనాల్లో వైద్య కళాశాల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. ఈ విద్యా సంవత్సరం వికారాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులను ఎంబీబీఎ్‌సలో చేర్చుకునేందుకు జాతీయ వైద్య మండలి అనుమతించగా, రెండు విడతల్లో 100 మంది విద్యార్థులు ఈ కళాశాలను ఎంచుకోగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు 98 మంది విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్‌ చేశారు. ఎంబీబీఎ్‌సలో చేరిన విద్యార్థులకు తరగతులు బోధించేందుకు వైద్య కళాశాల అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ తదితర తరగతులు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు కావాల్సిన ఈ మూడు విభాగాలను సన్నద్ధం చేశారు. మొదటి ఏడాదివైద్య కళాశాలలోనే తరగతులు కొనసాగనుండగా, రెండో సంవత్సరం నుంచి తరగతులతో పాటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలపై శిక్షణ ఇవ్వనున్నారు. చికిత్సల శిక్షణ కోసం కళాశాలకు అనుబంధంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని బోధనా ఆసుపత్రిగా వినియోగించుకోనున్నారు.

62 పోస్టులు భర్తీ

వైద్య విద్యార్థులకు తరగతుల బోధనకు అవసరమైన ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. వైద్య కళాశాలకు అవసరమైన కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ప్రిన్సిపాల్‌, ఆయా విభాగాల హెచ్‌వోడీలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం పూర్తయింది. మొత్తం 62 పోస్టులకు అన్ని పోస్టులను భర్తీ చేశారని కళాశాల వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, అనుబంధ భవనాల నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 235 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15వ తేదీన వికారాబాద్‌తో పాటు మరో ఎనిమిది జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎ్‌సలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నారు.

వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ నుంచి నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వైద్య కళాశాల ప్రారంభోత్సవం తేదీ ఖరారు కావడంతో ఇటీవల జిల్లా కలెక ్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ తదితరులు అనంతగిరిని సందర్శించి పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. వైద్య కళాశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో పెండింగ్‌ పనులన్నీ గడువులోగా శరవేగంగా పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

త్వరలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ...

అనంతగిరిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా రాజీవ్‌ కాలనీ వద్ద బోధనా ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోంది. ఇంతకు ముందు ఇక్కడ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధీనంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకు వచ్చి రూ.30.50 కోట్లతో అన్ని హంగులతో జీ ప్లస్‌ టూ భవనాలను బోధనా ఆసుపత్రిగా తీర్చిదిద్దే పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. వైద్య కళాశాలకు అనుమతి లభించాలంటే అనుబంధంగా 380 పడకలు కలిగిన బోధనా ఆసుపత్రి ఉండాల్సి ఉంటుంది. బోధనా ఆసుపత్రి/ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందనున్నాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నా... అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సదుపాయాలు లేక, వైద్య నిపుణుల కొరత కారణంగా ఒక్కోసారి ప్రసవం కూడా ఇక్కడ చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న అనారోగ్య సమస్యకు కూడా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు కానున్న టీచింగ్‌ హాస్పిటల్‌ అందుబాటులోకి వస్తే స్థానికంగానే అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో వస్తాయి. అన్ని రకాల చికిత్సలతో పాటు శస్త్ర చికిత్సలు కూడా స్థానికంగానే నిర్వహించే ందుకు వీలవుతుంది.

Updated Date - 2023-09-10T00:04:28+05:30 IST