పత్రీజీ సంకల్ప శక్తితో ధ్యానం విలువ విశ్వవ్యాప్తం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:04 AM
ఆత్మసత్యం తెలిసిన వారు జ్ఞానులని, అది ధ్యానం ద్వారా ప్రాప్తిస్తుందని పీఎ్‌సఎ్‌సఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ, పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డిలు అన్నారు.
పీఎ్‌సఎ్‌సఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ
10వ రోజుకు చేరిన ధ్యాన మహాయాగం వేడుకలు
కడ్తాల్, డిసెంబరు 30 : ఆత్మసత్యం తెలిసిన వారు జ్ఞానులని, అది ధ్యానం ద్వారా ప్రాప్తిస్తుందని పీఎ్‌సఎ్‌సఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ, పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డిలు అన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ధ్యానం నేర్చుకొని నాలుగు దశాబ్దాలలో తన సంకల్ప శక్తి ద్వారా ధ్యాన విలువలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత దివంగత ధ్యాన గురువు సుభాష్ పత్రీజీకే దక్కుతుందని కొనియాడారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో ధ్యాన మహాయాగం వేడుకలు-2 అట్టహాసంగా కొనసాగుతున్నాయి. పదోరోజు శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు, సాధకులు, సందర్శకులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మిక వేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పత్రీజీ శక్తిస్థల్‌ను సందర్శించి ధ్యాన నివాళులర్పించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాత:కాలం సంగీత వేణునాద ధ్యానం నిర్వహించారు. నిర్వాహకులు పత్రీజీ వీడియో సందేశాలను వినిపించారు. పరిమళ పత్రీ, విజయభాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ సమాజ శాంతికి పాటుపడిన వ్యక్తుల్లో పత్రీజీ ఒకరన్నారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ సింగర్ దామిని, పలువురు కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు, నృత్య ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. పాల్వంచకు చెందిన జయశ్రీ పత్రీజీ శక్తిస్థల్ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు. పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు, మారం శివప్రసాద్ రావు, శివప్ప, మాధవి, దామోదర్ రెడ్డి, మహేశ్వరి, లక్ష్మీ, నవకాంత్, కిషన్ రెడ్డి, అన్మా్‌సపల్లి సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పిరమిడ్ సభా ప్రాంగణంలో పలు ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను పరిమళ పత్రీ, విజయభాస్కర్‌రెడ్డిలు ఆవిష్కరించారు. పలు పుస్తకాలను ధ్యానులకు అందజేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పిరమిడ్ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల కళాప్రదర్శనలు, పాటలు, నృత్యరూపకాలు అందరినీ మైమరిపించాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కార్యక్రమాలు కొనసాగాయి. ముఖ్యంగా యువతుల నృత్యరూపకాలు అదరహో అనిపించాయి.పలు ప్రదర్శనలు ధ్యానులు, సందర్శకులను మంత్ర ముగ్దులను చేశాయి.