ఎన్నికల దారిలో...

ABN , First Publish Date - 2023-05-26T00:01:51+05:30 IST

ఉమ్మడి జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి మొదలైంది. అటు అధికారులు, ఇటు నేతలు ఎన్నికలపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో అందుకనుగుణంగా సన్నాహాలు మొదలు పెట్టారు.

ఎన్నికల దారిలో...

అటు అధికారులు.. ఇటు నేతల సన్నాహాలు..

ఉమ్మడి జిల్లాలో మొదలైన పార్టీల హడావిడి

వివిధ కార్యక్రమాలతో జనంలోకి..

క్షేత్రస్థాయిలో ఎలక్షన్స్‌ సందడి

ఉమ్మడి జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి మొదలైంది. అటు అధికారులు, ఇటు నేతలు ఎన్నికలపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో అందుకనుగుణంగా సన్నాహాలు మొదలు పెట్టారు. ఆయా రాజకీయ పార్టీలు జనంతో మమేకమయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, అధికారులు బూత్‌స్థాయిలో చర్యలను ప్రారంభించారు.

తాండూరు/ రంగారెడ్డి అర్బన్‌, మే 25 : అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఉమ్మడి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టిసారించారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు సరికొత్త కార్యచరణ రూపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. క్షేత్రస్థాయిలో తన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమం ఏదైనా పార్టీ పరంగా గుర్తింపు పొందేలా హడావిడి చేస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. పార్టీల పరంగా టికెట్లు ఎవరికి వస్తాయనే విషయం పక్కనబెడితే ప్రజల్లో దూసుకెళ్లేందుకు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. గడిచిన నాలుగున్నరేళ్లు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అనేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు ఆందోళనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్నికల సన్నద్ధంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కొంత ముందంజలో ఉండడం గమనార్హం. అన్ని వనరులు బీఆర్‌ఎ్‌సకు పుష్కలంగా ఉండడంతో అన్ని విధాలా పార్టీని సమాయత్తం చేస్తోంది. అయితే గులాబీలో టికెట్ల పంచాయతీ ప్రతి నియోజకవర్గంలో ఉండడం ఆ పార్టీకి కొంత చికాకులు తప్పడం లేదు. ఒక్కో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ కోసం ముగ్గురు నలుగురు నేతలు పోటీపడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు చాపకింద నీరులా ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీలో అసమ్మతిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రె్‌సలు పోటీపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో తన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రాజకీయ పార్టీలు సన్నాహాలను మొదలు పెట్టాయి. కార్యక్రమం ఏదైనా పార్టీ పరంగా గుర్తింపు పొందేలా హడావిడి చేస్తున్నారు. పార్టీల పరంగా టికెట్లు ఎవరికి వస్తాయనే విషయం పక్కనబెడితే ప్రజల్లో దూసుకెళ్లేందుకు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి గులాబీ దళం

ఎన్నికల సన్నద్ధంలో భాగంగా మిగతా పార్టీలతో పోలిస్తే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో ఉంది. పలు కార్యక్రమాలతో కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందే ఆదేశాలకనుగుణంగా నేతలు ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతి సమావేశంలో చెబుతున్నారు. అంతేకాక నిత్యం జనాల్లో ఉండేవిధంగా పార్టీపరంగా గులాబీ దళానికి కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రారంభమైన హడావిడి ఇంకా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. మండల, పట్టణ స్థాయిలో ఈ కార్యక్రమాలను చేపట్టి మంత్రులు, ఎంపీలను, ఇన్‌చార్జీలను పంపించి పరిస్థితులను రాష్ట్ర పార్టీ అంచనాలు వేసింది. వన భోజనాలు ఏర్పాటు చేయించారు. జిల్లాలో తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాండూరులో పల్లెపల్లెకు పైలెట్‌, వాడవాడకు పైలెట్‌ పేరుతో నెలరోజులపాటు జనం మధ్య ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఉన్నారు. పరిగిలో పల్లెబాట పేరిట ఎమ్మెల్యే మహే్‌షరెడ్డి ఊరూవాడను చుట్టి వచ్చారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ప్రజల్లోకి వెళ్తూ.. రాత్రివేళ పల్లెల్లో బస చేసి మరుసటి రోజు గ్రామంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టకపోయినా నిత్యం ఏదో ఒక ప్రోగ్రాంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం మేరకు సీఎం కప్‌ కార్యక్రమంతో యూవతతో మమేకమయ్యారు. మరోవైపు సిట్టింగ్‌లకే టికెట్లు అని గులాబీ బాస్‌ పలుమార్లు ప్రకటిస్తుండటంతో ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్యన ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

చాపకింద నీరులా బీజేపీ

బీజేపీ ఉమ్మడి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలను టార్గెట్‌ చేసింది. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా అంతటా నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే యత్నం చేస్తోంది. నియోజకవర్గాల్లో బీజేపీ సంస్థాగతంగా నిర్మాణం చేపడుతుంది. బూత్‌స్థాయి కేంద్రంగా కాషాయం నేతలు కార్యక్రమాలను చేపడుతున్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తున్నారు. కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. ఇప్పటికే కార్నర్‌, బూత్‌స్థాయి, ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన విషయం విధితమే. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతూ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. ప్రజా సమస్యలు ఎజెండాగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే యువతను పెద్ద ఎత్తున బీజేపీ ఆకట్టుకోవడం గమనార్హం.

కర్ణాటక జోష్‌తో కాంగ్రెస్‌

ఉమ్మడి జిల్లాకు సరిహద్దున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పవనాలు బాగా వీచాయి. దీంతో సరిహద్దున ఉన్న తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. సరిహద్దు ప్రాంతాల ఫలితాలు కాంగ్రె్‌సకు అనుకూలంగా రావడంతో ఇక్కడ కూడా అలాంటి విజయం సాధించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ శ్రేణుల్లో భరోసా నింపాయి. దీంతో కాంగ్రెస్‌ నేతలు దూకుడు పెంచారు. పలు కార్యక్రమాలతో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు నాలుగు నియోజకవర్గాల్లో హాత్‌ సే హాత్‌ జోడోయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వస్తే చేపట్టే డిక్లరేషన్లను ప్రజలకు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుకు రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి, నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ కర్ణాటక ఎన్నికలు, డిక్లరేషన్ల ప్రకటన వంటివాటితో క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు.

రంగంలో టీడీపీ

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కూడా పూర్తిస్థాయిలో రంగంలో దిగేందుకు కసరత్తు చేస్తోంది. టీడీపీ రాష్ట్ర పగ్గాలను చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్‌ ఉమ్మడి జిల్లా వాసి కావడంతో ఆయన మళ్లీ ఇక్కడ టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ పలు సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు టీడీపీకి, బీజేపీకి పొత్తు ఉండవచ్చనే ప్రచారం సాగుతుండడంతో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు టిక్కెట్ల కోసం ముందునుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీకి గతంలో వెన్నంటి ఉన్న నేతలంతా ఆయా పార్టీల్లో చేరిపోయారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి మంచి కేడర్‌ ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు ఆ పార్టీలో లేరు. ఇప్పుడిప్పుడే మళ్లీ నిలదొక్కుకునేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ఎంఐఎం...

ఈసారి ఎన్నికల్లో జిల్లాలో ఎంఐఎం పార్టీ బరిలో నిలుస్తుందన్న రాజకీయ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్‌ఎ్‌సకు మద్దతిచ్చిన విషయం విధితమే. ముఖ్యంగా రాజేంద్రనగర్‌, తాండూరు, మహేశ్వరం, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఎంఐఎంకు గట్టి పట్టుంది. దాదాపు 30వేల వరకు ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ ఎంఐఎం బరిలో నిలుస్తుందా, గతంలో మాదిరిగా ఇతర పార్టీలకు మద్దతిస్తుందా అన్నది స్పష్టం కాలేదు. కాకపోతే ఎంఐఎం పార్టీ తన కార్యక్రమాలను కొనసాగిస్తుంది.

సిద్ధమవుతున్న అధికారులు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతోంది. ప్రధానంగా ఓటరు జాబితాపై దృష్టి సారించారు. ఓటరు లిస్టులను పకడ్బందీగా ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు జాబితా తయారు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతున్నారు. మరోవైపు బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితా, సౌకర్యాలు, బూత్‌ల వివరాలు క్షేత్రస్థాయి నుంచి అధికారులు కోరుతున్నారు. బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్‌లు, వీవీ ప్యాట్ల వివరాలను ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఒక ఇంట్లో ఆరు మంది కంటే ఎక్కువ ఉంటే వారి వివరాలను పకడ్బందీగా సేకరిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, అధికారులు ఎన్నికలకు సంబంధించి వివరాలను తహసీల్దార్ల ద్వారా తెలుసుకుంటున్నారు. దాదాపుగా ఎన్నికల ఏర్పాట్లలో రెవెన్యూ అధికార యంత్రాంగం నిగ్నమైందని చెప్పవచ్చు.

Updated Date - 2023-05-26T00:01:51+05:30 IST