Share News

అధ్యక్ష పీఠం మనకే!

ABN , First Publish Date - 2023-12-07T23:52:20+05:30 IST

మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్ర ్ఞఅసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

అధ్యక్ష పీఠం మనకే!

అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌కుమార్‌

ఎంపిక చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

జిల్లాకు రెండు కీలక పదవులు

సీఎం రేవంత్‌రెడ్డి గెలిచిందీ ఇక్కడ నుంచే..

పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు

వికారాబాద్‌ జిల్లాకు మరో ఉన్నత పదవి రానుంది. ఇప్పటికే ఈ జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న గురువారం రోజే వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు నిర్ణయించారు. దీంతో అసెంబ్లీలోని కీలకమైన సీఎం, స్పీకర్‌ పదవులు రెండూ వికారాబాద్‌ జిల్లాకే దక్కడంతో జిల్లాలోని ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

వికారాబాద్‌, డిసెంబర్‌ 7: మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్ర ్ఞఅసెంబ్లీ కొత్త స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను అసెంబ్లీ స్పీకర్‌గా పార్టీ అఽధిష్ఠానం ఎంపిక చేయడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఎంపీటీసీగా పదవిగా గెలుపొందిన ఆయన 21 ఏళ్లలోనే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ స్థాయికి ఎదిగారు. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇదివరకు రాష్ట్ర మంత్రిగా సేవలు అందించారు. తాండూరు మండలం బెల్కటూరుకు చెందిన పాల ఎల్లమ్మ, ఎల్లయ్యలు ప్రసాద్‌కుమార్‌ తల్లిదండ్రులు. ఆయనకు ఆరుగురు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో 1989లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ప్రసాద్‌కుమార్‌ జిల్లా యువన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ సెల్‌ జిల్లా, రాష్ట్ర కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు చేపట్టారు. 1994 నుంచి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన వికారాబాద్‌ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2002లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొంశెట్‌పల్లి నుంచి విజయం సాధించి మర్పల్లి మండలం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించగా, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడంతో అలయెన్స్‌లో భాగంగా వికారాబాద్‌ను టీఆర్‌ఎ్‌సకు కేటాయించారు. దీంతో అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే, ఆ తరువాత మూడేళ్లకు. చంద్రశేఖర్‌ సహా మిగతా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో 2008, మేలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసాద్‌కుమార్‌ తన ప్రత్యర్థి చంద్రశేఖర్‌పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం 2009 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసాద్‌కుమార్‌ తన ప్రత్యర్థి చంద్రశేఖర్‌పై మరోసారి గెలుపొందారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో చేనేత, జౌళి శాఖ మంత్రిగా కొనసాగారు. మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్‌కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ పదవి దక్కడం పట్ల వికారాబాద్‌ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మంత్రి పదవి ఆశిస్తే స్పీకర్‌ పదవి దక్కింది

మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రసాద్‌కుమార్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఆశించారు. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో బెర్తు లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే ప్రసాద్‌కుమార్‌ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆయనకు ఏ విధంగా అవకాశం కల్పించాలనేది పార్టీ అధిష్ఠానం పెద్దల వద్ద చర్చకు వచ్చింది. పార్టీ ఽఅధికారంలో లేని పదేళ్లు పార్టీలోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రసాద్‌కుమార్‌కు ఎట్టి పరిస్థితుల్లో పదవి దక్కాల్సిందేనంటూ సీఎం రేవంత్‌రెడ్డి పట్టుబట్టినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పటి నుంచి ప్రసాద్‌కుమార్‌తో ఆయనకు సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇద్దరి మధ్య ఆత్మీయత మరింత పెరిగింది. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ప్రసాద్‌కుమార్‌ ముద్రపడింది. మంత్రి పదవిని ఆశించిన ప్రసాద్‌కుమార్‌కు ఆయన సామాజిక వర్గం నుంచే తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రసాద్‌కుమార్‌ ఉన్నత పదవైన అసెంబ్లీ స్పీకరే సరైనదని భావించి ఆయనను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కకుండా ఉండేకంటే అత్యున్నతమైన స్పీకర్‌ పదవిలో కొనసాగడం ఎంతో గౌరవప్రదమని ప్రసాద్‌కుమార్‌కు పలువురు నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.

రామ్మోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కేనా!?

ఇదిలా ఉంటే, పరిగి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్మోహన్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే ఆశాభావం ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవుల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో తమకు తప్పకుండా అవకాశం కల్పిస్తారనే విశ్వాసం వారు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అఽధికారంలో లేకపోయినా పార్టీని వీడకుండా నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచిన రామ్మోహన్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని రామ్మోహన్‌రెడ్డి కూడా ధీమాతో ఉన్నారు.

Updated Date - 2023-12-07T23:52:22+05:30 IST