చెరువు నిండింది.. ఎవుసం ఆగింది!

ABN , First Publish Date - 2023-03-19T00:18:20+05:30 IST

ఇబ్రహీంపట్నం చెరువు నిండు కుండను తలపిస్తోంది. 42 అడుగుల లోతుతో ఉన్న ఈ చెరువు ఇబ్రహీంపట్నం, ఉప్పరిగూడ, పోచారం, కర్ణంగూడ, చెర్లపటేల్‌గూడల మధ్య విస్తరించింది.

చెరువు నిండింది.. ఎవుసం ఆగింది!
ఇబ్రహీంపట్నం చెరువు శిఖంలో మునిగిన పొలాలు

నాలుగు గ్రామాల్లో విచిత్ర పరిస్థితి

ప్రత్యామ్నాయం కోసం రైతుల ఎదురుచూపు

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండడంతో శిఖం భూములు నీట మునిగాయి. గత నవంబర్‌, డిసెంబర్‌ నుంచే ఎఫ్టీఎల్‌ భూముల్లోకి నీరు చేరి బోర్లు, బావులు మునిగాయి. దీంతో వందలాది మంది రైతులు ఉపాధి కోల్పోయారు. చెరువు నిండిందని సంతోషించాలో.. తమ పొలాలు మునిగాయని బాధ పడాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్‌ వాటర్‌తో ఉప్పరిగూడ, పోచారం, కర్ణంగూడ, చెర్ల పటేల్‌గూడల్లో 700 ఎకరాలు నీటి ముంపులో ఉంది. ఈ భూముల్లో రైతులు ఆకుకూరలు సాగుచేసే వారు. భూముల మునకతో అన్నదాతలు ఉపాధి కోల్పోయి కూలికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఇబ్రహీంపట్నం, మార్చి 18: ఇబ్రహీంపట్నం చెరువు నిండు కుండను తలపిస్తోంది. 42 అడుగుల లోతుతో ఉన్న ఈ చెరువు ఇబ్రహీంపట్నం, ఉప్పరిగూడ, పోచారం, కర్ణంగూడ, చెర్లపటేల్‌గూడల మధ్య విస్తరించింది. ఈ చెరువుకు 1,206 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే చెరవు నిండిందని ఓ పక్క జనం సంబరపడుతున్నా ఇబ్రహీంపట్నం మినహా ఈ చెరువు శిఖం కొమ్ము భూములున్న నాలుగు గ్రామాలకు చెందిన 200 మంది రైతుల భూమి నీట మునిగి ఉపాధి పోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాల పరిధి 600-700 ఎకరాలు ఇప్పటికీ నీలోనే ఉంది. గతంలో చెరువు నిండినా, సంగం నిండినా ఆయకట్టుకు నీరొదిలే వారు. దీంతో శిఖం భూముల్లోకి నీరు తట్టేది కాదు. కానీ ఈ మధ్య ప్రభుత్వం తైబందీ చేయడం లేదు. భూగర్భ జలమట్టం పెంపే లక్ష్యంగా చెరువు, కుంటల్లో నీటిని కాపాడుతోంది. ఎక్కడిక్కడక తూములను కట్టేస్తున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం చెరువులోనూ భారీగా నీటి నిల్వ ఉంది. బ్యాక్‌ వాటర్‌ ఓ ప్రాజెక్టునే తలిపిస్తోంది. చెరువులోకి అరకొరగా నీరు చేరితే ఇబ్బందేమీ ఉండేది కాదు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎ్‌ఫటీఎల్‌)లో పట్టా పొలాలున్న రైతులు సాగు చేసుకునేవారు. అయితే ఇప్పుడు చెరువు వంద శాతం నిండడం, సాగు నీటిని కిందికి వదలక నెలల పాటు శిఖం భూములు మునిగే ఉంటున్నాయి. దీంతో సాగుపైనే ఆధారపడి బతుకీడుస్తున్న రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వారు వ్యవసాయాన్ని పక్కన బెట్టి వేరే పనిచేసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం తప్ప వేరేపని రాని కొందరు రైతులు గ్రామాల్లోనే పొరుగు రైతుల పొలాలను కౌలుకు తీసుకొని సాగుచేసుకుంటూ ఎలాగోలా బతుకు బండి లాగిస్తున్నారు. చిన్న రైతులు గ్రామంలోనే ఉపాధి కూలీకి, సాగు పనుల కూలికి పోతున్నారు. కనీసం తమ పొలాలు తేలే వరకన్నా నీటిని వదలాలని రైతులు కోరుతున్నారు.

పచ్చగూరకు కేరాఫ్‌ ఉప్పరిగూడ

ఆకుకూరలకు ఉప్పరిగూడ కేరా్‌ఫగా నిలిచింది. ఇక్కడ 90శాతం మంది రైతులు ఆకుకూరలే పండిస్తారు. పాలకూర, సుక్కకూర, గంగవెళ్లికూర, కోయిగూర, మెంతికూర, తోటకూర, కొత్తిమీర, పుదీన తదితర ఆకు కూరలు సాగుచేస్తారు. పండిన ఆకు కూరలను నిత్యం నగరంలోని మాదన్నపేట, ఎన్టీఆర్‌నగర్‌, వనస్థలిపురం మార్కెట్లకు తరలిస్తారు. అయితే ఇప్పుడు పొలాలు నీట మునగడంతో ఆకుకూరల సాగు బాగా పడిపోయింది. ఆముటోనిబాయి, కొనబాయి, మక్తబాయి, గుంటబాయి, తగంబాయి ఇలా అనేక బావులు, బోర్ల నీటిలోనే ఉన్నాయి. భూమి తేలేదెప్పుడు.. ఆకుకూరల సాగు చేసేదెప్పుడు? అని రైతులు ఎదురు చేస్తున్నారు.

పాలం పనులు తప్ప వేరే పనులు రావు : ఎన్ను బాల్‌రెడ్డి, రైతు, ఉప్పరిగూడ

కొనబాయి, మక్తబాయి, కాల్వకాడి చెల్క కింద నాకున్న 8 ఎకరాల భూమి నీటిలో మునిగింది. నీరు రానప్పుడు ఆకు కూరలు సాగుచేస్తూ మాకు మాకు చేతినిండా పనుండేది. కూలీలకూ పనిదొరికేది. మాకు ఎవుసం తప్ప వేరే పని రాదు. ఇప్పుడు భూమి, బావులు చెర్ల మునిగే. మరి మా పరిస్థితి ఏందో తెలుస్తలేదు. శిఖం భూములు నీట మునిగి ఊర్లో చాలా మంది రైతులకు పనే లేకుండా పోయింది.

ఉన్న ఆరెకరాలూ మునిగింది .. : రామిడి వెంకటమ్మ, రైతు, ఉప్పరిగూడ

నాకున్న ఆరెకరాలూ నీట మునిగింది. వేరేవాళ్ల పొలం కైలుకు తీసుకొని ఆకు కూరలు సాగు చేశాం. చెరువులో నీళ్లు లేనప్పుడు పొలాలు సాగుచేసుకునే వాళ్లం. ఇప్పుడు ఉన్న భూమే మునిగి మొత్తానికే పనిలేకుండా పోయింది. పని చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. పొలం మునిగినోళ్ల గురించి సర్కారు ఆలోచించాలి.

తూములను తగ్గింస్తే రైతులకు మేలు : వంగేటి కవితాతిర్మల్‌రెడ్డి, సర్పంచ్‌, కర్ణంగూడ

ఒక్క కర్ణంగూడకు సంబంధించే 60మంది రైతుల 180 ఎకరాలు నీట మునిగాయి. చెరువు నిండుడే కాదు.. పొలాలు మునిగిన రైతుల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆయకట్టుకు నీరు వదల కుంటే తూములను ఐదు ఫీట్లమేర తగ్గించినా కొద్ది మేర నీరు ఖాళీ అయి పొలాలు తేలితే రైతులు సాగుచేసుకుంటారు.

Updated Date - 2023-03-19T00:18:20+05:30 IST