కొలువుదీరిన లంబోదరులు

ABN , First Publish Date - 2023-09-19T23:43:40+05:30 IST

వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రజలు వినాయక చవితి వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. గల్లీగల్లీలో గణనాథులు శోభాయమానంగా కొలువుదీరారు.

కొలువుదీరిన లంబోదరులు
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో పూజలో మంత్రి మల్లారెడ్డి

వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో

ఘనంగా వినాయక చవితి వేడుకలు

వాడవాడల గణనాథుల ప్రతిష్ఠ

ఘట్‌కేసర్‌/తాండూరు : వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో ప్రజలు వినాయక చవితి వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. గల్లీగల్లీలో గణనాథులు శోభాయమానంగా కొలువుదీరారు. ప్రత్యేకంగా రూపొందించిన మండపాలు, ఇళ్లలో లంబోదరులను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధ్దలతో పూజిస్తున్నారు. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో వినాయకుడు విశేష పూజలందుకుంటున్నాడు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్టు మణిసాయి తన నైపుణ్యంతో పెన్సిల్‌ లిడ్‌పై 0.8 సెంటిమీటర్ల గణపతిని తయారు చేశారు. గతంలో పెన్సిల్‌ లిడ్‌పై మైక్రో ఆర్ట్స్‌ వేసి ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. నవరాత్రుల్లో భాగంగా తాండూరు భావిగి భద్రేశ్వరస్వామి దేవస్థానంలోని శివుడు సిద్ధి గణపతి అలంకరణలో భక్తులకు దర్శమిచ్చాడు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని ఆర్‌కే శివాజీ యూత్‌ అసోసియేషన్‌ , ఎస్‌ఆర్‌ యూత్‌ అధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక పూజల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు పోచారం మున్సిపాలిటీలోని అన్నోజిగూడలో సూర్యయూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాఽథుడి వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు ముల్లి పావని జంగయ్య యాదవ్‌, బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు పల్గుల మాధవరెడ్డి, నానావత్‌ రెడ్డియా నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-19T23:43:40+05:30 IST