Share News

ఉమ్మడి జిల్లాకు సాగునీరందించే బాధ్యత ప్రభుత్వానిది

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:26 PM

ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటిని తీసువస్తామని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

ఉమ్మడి జిల్లాకు సాగునీరందించే బాధ్యత ప్రభుత్వానిది
పరిగిలో విలేకరులతో మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, పక్కన ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి

సీఎం సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

పరిగి, కొడంగల్‌లలో మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు చర్యలు

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

పరిగి, డిసెంబరు 18: ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీటిని తీసువస్తామని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం పరిగిలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సాగునీరందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతులు సుభిక్షంగా ఉంటేనే, రాష్ట్రం బాగుంటుందని, రైతులకు ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు నీరందిస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. గత పదేళ్లలో రోడ్లు గురించి పట్టించుకోని కారణంగా అధ్వానంగా మారాయని, రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిగి, కొడంగల్‌లలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కృషిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేసి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. పరిగి ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్‌ డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌-కొడంగల్‌ వరకు నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సిద్ధాంతి పార్థసారథి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, కడ్మూరు ఆనందం, కార్యదర్శి కె.హన్మంత్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పి.చంద్రయ్య, ఎస్పీ బాబయ్య, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, వైఎస్‌ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు కె.రఘుమోహన్‌రెడ్డి, పాలాది శ్రీనివాస్‌, ఎన్‌.రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ పరిగి మాజీ జెడ్పీటీసీ పి.చంద్రయ్య నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.

విద్యార్థి దశ నుంచే భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పర్చుకోవాలి

పూడూరు: విద్యార్థి దశ నుంచే భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పర్చుకోవాలని శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. స్వీకర్‌ హోదాలో మొదటి సారివచ్చిన స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డిలను మన్నెగూడ విస్డమ్‌ స్కూల్‌ యాజమాన్యం పూలమాలలు, శాలువాలతో సన్మానించింది. అనంతరం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పిల్లల నడవడికలను గమనిస్తుండాలన్నారు. విద్యార్థుల ఆలోచనా విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లోకజ్ఞానాన్నీ పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ గౌస్‌ పటేల్‌, డైరెక్టర్‌ అజీమ్‌, హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, ప్యాక్స్‌ చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఆనందం, పెంటయ్య, రఘునాథ్‌రెడ్డి, సురేందర్‌, శ్రీనివా్‌సరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:27 PM