గుంతల మయం.. గుండెల్లో భయం!

ABN , First Publish Date - 2023-07-23T23:47:13+05:30 IST

భారీ వర్షాలకు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. అడుకో గుంత.. గజానికో గొయ్యిలా మారాయి. గతుకులు, గుంతల రోడ్లపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో.. ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతర్గత రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది. చినుకు పడితే చిత్తడిగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే.. అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా మారాయి. కంకర తేలిన రహదారుల్లో ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు వస్తోంది. రాత్రి వేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గుంతల మయం.. గుండెల్లో భయం!

అడుకో గుంత.. గజానికో గొయ్యి

గతుకులు, గుంతలతో వాహనదారుల్లో గుబులు

వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో వర్షాలతో రోడ్లన్నీ ఆగమాగం

చిత్తడిగా మారి దిగబడుతున్న వాహనాలు

మరమ్మతులకు నోచుకోక ప్రయాణికుల ఇబ్బందులు

ప్రమాదాల బారిన పడుతున్న వాహనదాలులు

భారీ వర్షాలకు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. అడుకో గుంత.. గజానికో గొయ్యిలా మారాయి. గతుకులు, గుంతల రోడ్లపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో.. ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతర్గత రోడ్ల దుస్థితి ఘోరంగా మారింది. చినుకు పడితే చిత్తడిగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షాలకు ఉన్న రోడ్లు దెబ్బతింటే.. అప్పటికే ధ్వంసమైన రహదారులు మరింత అధ్వానంగా మారాయి. కంకర తేలిన రహదారుల్లో ప్రయాణం అంటేనే వాహనదారుల్లో వణుకు వస్తోంది. రాత్రి వేళ గుంతలు పడిన మార్గాల్లో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

(వికారాబాద్‌/మేడ్చల్‌ జూలై 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ తాండూరు/కొడంగల్‌/పరిగి/వికారాబాద్‌/ఘట్‌కేసర్‌): గుంతలమయంగా మారిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. శిథిలమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎదురుగా వచ్చే గుంతలను గుర్తించక ప్రమాదాల బారిన పడుతున్నారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లు గుంతమయంగా మారాయి. గత ఏడాది కురిసిన వర్షాలకు వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 248 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.158 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లా వ్యాప్తంగా రూ.19 కోట్లతో 47 కిలోమీటర్ల దూరం మేర మాత్రమే మరమ్మతు పనులు పూర్తి చేయగలిగారు. ఇంకా 201 కిలోమీటర్ల రోడ్లకు 139 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో మరమ్మతు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఉదాహరణకు ధారూరు మండలం, దోర్నాల్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ఫలితంగా ఆ మార్గంలో రాకపోకలు కొనసాగించే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెద్దేముల్‌ మండలం, గాజీపూర్‌ వద్ద చేపట్టిన ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిల పనులు కూడా ముందుకు సాగడం లేదు. వికారాబాద్‌ నియోజక వర్గం పరిధిలో 180 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. సిద్దులూరు రోడ్డుకు రూ.9 కోట్లు, మన్నేగూడ రోడ్డుకు రూ.2.30 కోట్లు, సదాశివపేట రోడ్డుకు రూ.1.50 కోట్లు, కొత్తగడి నుంచి మోత్కుపల్లి మీదుగా బంట్వారం వరకు రూ. 8 కోట్లు, అనంతగిరి రోడ్డుకు రూ.1.50 కోట్లు, మోమిన్‌పేట మండలంలో రూ.4 కోడ్లు, దోర్నాల్‌ రోడ్డుకు రూ.1.50 కోట్లు, కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద రూ.60 లక్షలతో చేపట్టే పనులకు ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలిచింది. ఈ రోడ్డు మార్గాల్లో గుంతలమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు.

ముందుకు సాగని రోడ్ల పనులు

తాండూరు డివిజన్‌ పరిధిలో 50 కిలోమీటర్ల మేరకు ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టేందుకు రూ.50 లక్షలు, కొత్తగా రోడ్లు వేసేందుకు రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. తాండూరు- వికారాబాద్‌ రోడ్డు పునరుద్ధ్దరణకు రూ.52 కోట్లు మంజూరు కాగా, రూ.30 కోట్లతో పనులు పూర్తి చేశారు. ధారూరు నుంచి తాండూరు వరకు రోడ్డు పనులు పూర్తి చేయలేదు. రూ.22 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలిసింది. తాండూరు - కోట్‌పల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డులో 25 కిలోమీటర్ల మేర అధ్వానంగా మారింది. యాలాల మండలం, బాగాయిపల్లి నుంచి ముద్దాయిపేట వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గౌతాపూర్‌ నుంచి కరణ్‌కోట్‌ వరకు 3 కిలోమీటర్ల దూరం రోడ్డు అధ్వానంగా మారింది. మరమ్మతుల కోసం రూ.30 లక్షలు మంజూరు కాగా, ఈ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పెద్దేముల్‌ మండలం, గొట్లపల్లి నుంచి ఇందూర్‌ వరకు 5 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారింది. తాండూరు పట్టణంలో విలియంమూన్‌ చౌరస్తా నుంచి గ్రాండ్‌ హోటల్‌ వరకు రోడ్డు అధ్వానంగా మారగా, ఇటీవల ఈ రోడ్డుకు రూ.5 కోట్లు మంజూరయ్యాయి. పెద్దేముల్‌ మండలం, ఆత్కూర్‌ నుంచి సిద్ధన్న మడుగు తండా వరకు రోడ్డు మరమ్మతుల కోసం కంకర వేసి వదిలేశారు. ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇదే మండలంలో గాజీపూర్‌ వంతెన పైన పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

కొడంగల్‌ నియోజవర్గం పరిధిలో ఆర్‌అంబీ శాఖ పరిధిలో 238 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. నియోజకవర్గం పరిఽధిలో 30 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మతుల కోసం రూ.30 లక్షల వరకు నిధులు అవసరం. కొడంగల్‌ - తాండూరు, కొడంగల్‌-కోస్గి మధ్య ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. పంచాయతీరాజ్‌ రోడ్లు కూడా గుంతలమయంగా మారి అఽధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్ల మరమ్మతులకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అయితే పనులు ముందుకు సాగడం లేదు.

పరిగి నియోజకవర్గం పరిధిలో 300 కిలోమీటర్ల దూరం మేర ఆర్‌అండ్‌బీ రోడ్డు ఉండగా, బీటీ రెన్యూవల్‌ పనులకు రూ.8 కోట్లు మంజూరయ్యాయి. నిధులు మంజూరైనా పనులు ఇంకా ప్రారంభించలేదు. గతంలో కురిసిన వర్షాలకు, అధిక లోడ్‌ వాహనాల రాకపోకలతో 25 కిలోమీటర్ల దూరం మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. పరిగి సబ్‌ డివిజన్‌ పరిధిలో 1100 కిలోమీటర్ల దూరం మేర పంచాయతీరాజ్‌ రోడ్లు ఉండగా, ఈ రోడ్ల మరమ్మతులకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. 300 కిలోమీటర్ల దూరం మేర రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణమా..?

బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యమే రోడ్ల పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రోడ్ల మరమ్మతులకు ఎలాంటి నిధుల కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో రకంగా ఉందనే వాదన వినిపిస్తోంది. కొత్త పనుల సంగతి ఎలా ఉన్నా.. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. చేపట్టిన పనులకు బిల్లులు ఇస్తేనే మిగతా పనులు పూర్తి చేస్తామని, లేకపోతే అదంటూ కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను నిలిపి వేసినట్లు చెబుతున్నారు. కాగా, గత ఐదారు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లకు నష్టం వాటిల్లింది. ఇది వరకే శిథిలమైన రోడ్లు మరింత అధ్వానంగా మారాయి.

మేడ్చల్‌ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్దపెద ్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మండలాలను కలిపే లింకు రోడ్లుపై భారీ గుంతల ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. మేడ్చల్‌-శామీర్‌పేట, మేడ్చల్‌ చెక్‌పోస్టు-గండిమైసమ్మ రోడ్డు గుంతలమయంగా మారి మట్టి రోడ్లకన్నా దారుణంగా మారాయి. ఘట్‌కేసర్‌ మండలంలోని నారపల్లి- ఏదులాబాద్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో రూ, 15కోట్ల సీఆర్‌ఎఫ్‌ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు గత సంవత్సరం నవంబర్‌ 21న మంత్రి మల్లారెడ్డి చౌదరిగూడలోని ప్రతాపసింగారంచౌరస్తా వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కొద్ది మేరకు పనులు చేపట్టి వదిలేశారు. ఇదిలాఉంటే పాత రోడ్డు అడుకోగుంత పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గుంతలు పెద్దవై నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. నారపల్లి - ఏదులాబాద్‌ రోడ్డు అండుకో గుంతపడి నరకానికి చిరునామాగా మారింది. ప్రధానంగా నారపల్లి చౌరస్తా నుంచి ప్రతాపసింగారం చౌరస్తా వరకు మరీ అధ్వానంగా ఉంది. అసలే వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాలకు గురౌతున్నారు. పాలకులు పనుల గురించి సమీక్షలు చేయకపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది. శిలాఫలకాలు వేశారు కానీ, పనులు మాత్రం జరగడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పరిస్థితి అధ్వానం: బీసా జ్ఞానేశ్వర్‌, కొర్రె ముల్‌

నారపల్లి- కొర్రెముల్‌ రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో నిత్యం చౌదరిగూడ, నారపల్లికి రావడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గుంతలు పెద్దగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.

గుంతల రోడ్డుతో నిత్య నరకం : కుర్ర విఘ్నేశ్వర్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ, చౌదరిగూడ

ఏళ్ల తరబడి మరమ్మతులు లేక పోవడంతో నారపల్లి -వెంకటాద్రి టౌన్‌షి్‌పకు వచ్చే ప్రధాన రోడ్డు అడుగుకో గుంతగా మారింది. దీనికి తోడు ఏకధాటి వర్షాలతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. గుంతల రోడ్లతో నిత్యం ఏదోచోట ప్రమాదాలు జరగడం సాధారణంగా మారింది.

అధికారులు పట్టించు కోవడంలేదు: ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ ఘట్‌కేసర్‌ మండలం

నారపల్లి-కొర్రెముల్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు అధికారులను పిలిపించి రోడ్డును పరిశీలించాం, పనులు చేయిస్తామని చెబుతున్నారు తప్పా జరగడం లేదు. తాజాగా శనివారం సంబంధిత అధికారితో కలిసి పరిశీలించాను. 15 రోజుల్లో కొత్త రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-07-23T23:47:13+05:30 IST