అణగారిన కులాలకు రాజ్యాధికారం రావాలి

ABN , First Publish Date - 2023-03-05T23:54:16+05:30 IST

అణగారిన కులాలకు రాజ్యాధికారం వస్తేనే సామ్యవాద పాలన వస్తుందని దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్‌ మహరాజ్‌ అన్నారు.

అణగారిన కులాలకు రాజ్యాధికారం రావాలి

డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌

ఇబ్రహీంపట్నం, మార్చి 5: అణగారిన కులాలకు రాజ్యాధికారం వస్తేనే సామ్యవాద పాలన వస్తుందని దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్‌ మహరాజ్‌ అన్నారు. విశారదన్‌ చేపట్టిన పది వేల కిలోమీటర్ల పాదయాత్ర శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం చేరుకున్న సందర్భంగా ఇక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పది శాతం కూడా లేని అగ్రకులాలే రాజ్యాధికారం చేస్తున్నాయని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే నిలుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యంతోపాటు భూమి, సంపద కూడా అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయని ఇంకెంతకాలం ఇది కొనసాగాలంటూ ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలందరినీ ఏకం చేయడానికే తాను ఈ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు ఈసీ శేఖర్‌గౌడ్‌, పాదయాత్ర ఇన్‌చార్జి లక్ష్మణ్‌, రెహమాన్‌, దుర్గాప్రసాద్‌, రవీందర్‌, జిల్లా అధ్యక్షుడు రాకేష్‌ తదితరులున్నారు.

విశారదన్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి

దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ)రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్‌ మహరాజ్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ డీఎస్పీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో పాదయాత్రలో ఉన్న ఆయనకు భువనగిరి ఎస్సై శివకృష్ణ ఆదివారం రాత్రి నోటీసులు ఇచ్చారు. గత నెల 27న భువనగిరిలో పాదయాత్ర సభ సందర్భంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించలేదంటూ ఐపీసీ 188, 341, 290 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా సభకు అనుమతులిచ్చి పోలీసులు కావాలనే కేసులు నమోదు చేశారని డీఎస్పీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

Updated Date - 2023-03-05T23:54:16+05:30 IST