బెల్ట్ జోరు.. జనం బేజారు
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:41 PM
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులపై నిషేధం విధించడానికి కసరత్తు చేస్తుంటే స్థానిక ఎక్సైజ్, సివిల్ పోలీసులు మాత్రం వారి కళ్ల ముందే విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
శంకర్‌పల్లిలో జోరుగా బెల్ట్ షాపుల దందా
రోడ్లపై మందుబాబుల వీరంగం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పట్టించుకోని ఎక్సైజ్, స్థానిక పోలీసులు
శంకర్‌పల్లి, డిసెంబరు 18 : కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులపై నిషేధం విధించడానికి కసరత్తు చేస్తుంటే స్థానిక ఎక్సైజ్, సివిల్ పోలీసులు మాత్రం వారి కళ్ల ముందే విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ, మండలంలో పలు గ్రామాలలో బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతోంది. ఉదయం 5 గంటల నుండే మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో మద్యంప్రియులు ఆ సమయంలోనే తాగి రోడ్లపై దొర్లుతున్నారని.. అయినా, ఎక్సైజ్, సివిల్ పోలీసులు వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రోజంతా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండడంతో వాటిని తాగిన మద్యం ప్రియుల ఇళ్లలో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ్ధరాత్రి వేళల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, దీంతో ఆ సమయంలో ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. కొందరు పీకలదాకా తాగి రోడ్డుపై పడిపోతుండడంతో వారిని భుజానికెత్తుకొని ఇళ్లకు చేరుస్తున్న ఘటనలు ప్రతిరోజూ చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. మద్యం దుకాణాల నిర్వాహకులు గ్రామాల వారీగా బెల్ట్ దుకాణాలకు అప్పుగా మద్యం ఇస్తుండడంతో వీటి సంఖ్య భారీగా పెరిగి పోతోందని, పెట్టుబడి కూడా లేకపోవడం.. భారీగా ఆదాయం వస్తుండడంతో గ్రామాల్లో పెద్ద ఎత్తున బెల్ట్ దుకాణాల సంఖ్య పెరిగి పోటీలు పడి అమ్మకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్, సివిల్ పోలీసులు వీటిపై కఠిన చర్యలు తీసుకొని బెల్ట్ షాపులను మూసివేయాలని కోరుతున్నారు.
బెల్ట్ షాపులను నియంత్రించాలి : నర్సింలు, రామంతాపూర్ మాజీ సర్పంచ్
మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 4 గంటల నుండే బెల్ట్ షాపులలో మద్యం విక్రయిస్తున్నారు. నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు, బెల్ట్ షాపుల వద్ద పీకల దాకా తాగి రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. మందు బాబుల చేష్టల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు : జొన్నడ రాములు, శంకర్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్
మున్సిపాలిటీ పరిధి, మండలంలోని పలు గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. బెల్ట్ షాపుల వల్ల కుటుంబాల మధ్య గొడవలు, యువకులు మధ్య తగాదాలు నెల కొంటున్నాయి. మద్యం దుకాణాల యజమానులు విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు మద్యం విక్రయించడంతో బెల్ట్‌షాపుల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. బెల్ట్ షాపులు తొలగించకపోతే యువత చెడిపోయే ప్రమాదముంది.