తొలిరోజు ప్రశాంతం
ABN , First Publish Date - 2023-04-03T23:48:23+05:30 IST
పదోతరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం తెలుగు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెంటర్ల వద్దకు ముందస్తుగానే చేరుకున్నారు.
నిఘా నీడలో కొనసాగిన ‘పది’ పరీక్షలు
రెగ్యులర్ విద్యార్థులు 99.62, ప్రైవేట్ విద్యార్థులు 82.39 శాతం హాజరు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆమనగల్లు, మంచాల తలకొండపల్లి మండలాల్లో వంద శాతం హాజరు
పదోతరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం తెలుగు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెంటర్ల వద్దకు ముందస్తుగానే చేరుకున్నారు. ఎగ్జామ్‌లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో కేంద్రాల వద్ద సందడిగా మారింది. అన్ని సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 3 : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 226 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 47,661 రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 47,480 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 99.62 నమోదైంది. మొత్తం 181 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే 142 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 117 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 82.39 నమోదైంది. 25 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేక పోయారు.
అబ్దుల్లాపూర్‌మెట్, ఆమనగల్లు, మంచాల, తలకొండపల్లి మండలాల్లో వంద శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చేవెళ్ల, చౌదరిగూడ, కందుకూరు, కొందుర్గు, మాడ్గుల, యాచారం మండలాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షకు ఒక్కో విద్యార్థి గైర్హాజరయ్యారు. రాజేంద్రనగర్, సరూర్‌నగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, హయత్‌నగర్, బాలాపూర్ మండలాల్లో విద్యార్థులు పరీక్షలకు అధికంగా హాజరు కాలేదు.
విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం 9.30 గంటల తర్వాత అనుమతి నిరాకరించారు. ఒక గంట ముందుగానే చేరుకున్న విద్యార్థులు వారికి కేటాయించిన గదులను హాల్ టికెట్ల వారీగా నోటీస్ బోర్డులపై చూసుకున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది పరీక్షా కేంద్రాల ద్వారాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు ఎలక్ర్టానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరినీ పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతించలేదు. 35 స్టోరేజీ పాయింట్ల నుంచి పరీక్ష ప్రశ్నా పత్రాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. ఒక్కో సెంటర్‌కు పది మంది చొప్పున మొత్తం 2,260 మంది ఇన్విజిలేటర్లు, పది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విధులు నిర్వహించారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి అనైతిక చర్యలకు తావివ్వకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ల్యాప్‌టా్‌పలు, ట్యాబ్‌లు, కెమెరాలు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఇతర వాటిని నిషేధించారు. డీఈవో సుశీందర్‌రావు జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాలను విజిట్ చేశారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ నాలుగు సెంటర్లను విజిట్ చేశారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్ 65 సెంటర్లను విజిట్ చేశారు.ఎండ తీవ్రతకు అస్వస్థకు గురైన విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు కేంద్ర వద్ద ఒక స్టాఫ్ నర్సును అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు అందించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు.
కేజీబీవీ విద్యార్థుల ఇక్కట్లు
కేశంపేట : పరీక్షల ప్రారంభ రోజు కేశంపేట కేజీబీవీ 10వ తరగతి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి పై కప్పులేని వాహనంలో వెళ్లిరావడానికి అవస్థపడ్డారు. పరీక్ష అనంతరం మధ్యాహ్నం తిరిగి వచ్చేటప్పుడు ఎండకు తట్టుకోలేక పోయారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పై కప్పు ఉన్న ఆటోలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
రెగ్యులర్ విద్యార్థులు
హాజరు కావాల్సిన విద్యార్థులు : 47,661
హాజరైన విద్యార్థులు 47,480
హాజరు శాతం : 99.62
ఆబ్‌సెంట్ : 181
---------------------
ప్రైవేట్ విద్యార్థులు
హాజరు కావాల్సింది : 142
హాజరైంది : 117
శాతం 82.39
ఆబ్‌సెంట్ : 25