అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2023-06-03T00:08:51+05:30 IST

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జిల్లాలోని మండల కేంద్రాలతోపాటు గ్రామగ్రామాన అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పలుచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు.

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు..

సంక్షేమ రంగంలో స్వర్ణయుగం

పెరిగిన రాష్ట్ర, జిల్లా వార్షిక జీఎస్‌డీపీ వృద్ధిరేటు

తలసరి ఆదాయంలో జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం

రైతు బీమా పథకానికి ఐక్య రాజ్యసమితి గుర్తింపు

టీఎస్‌ఐపాస్‌ ద్వారా భారీగా పరిశ్రమలు, ఉపాధి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జిల్లాలోని మండల కేంద్రాలతోపాటు గ్రామగ్రామాన అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పలుచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం, చిత్ర పటాల వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 2 : ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్‌ దేశానికే తెలంగాణ ఆదర్శప్రాయంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాష్ట్ర పదో అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉదయం 9గంటలకు జయశంకర్‌ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమర వీరుల కుటుంబాలను మంత్రి సబితారెడ్డి ఆప్యాయంగా పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా జీవన జ్యోతి మహిళా సమాఖ్యకు రూ.59.22 కోట్లు చెక్కును అందజేశారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి వేడకులను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు సరూర్‌నగర్‌ ఇండర్‌ స్టేడియంలో ఉదయం 8 గంటలకు అమరు వీరుల స్మారక స్థూపానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి సబితారెడ్డి కలెక్టరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అమరుల త్యాగఫలం, కేసీఆర్‌ పోరాట ఫలితంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తొమ్మిదేళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలో టీఎ్‌సఐపాస్‌ చట్టం వచ్చాక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల ప్రక్రియ అత్యతంత సులువుగా మారిందన్నారు. జిల్లాలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 1,715 పరిమ్రలు దరఖాస్తు చేసుకోగా, 47.62 కోట్ల పెట్టుబడితో 1,252 పరిశ్రమలు వచ్చాయని, 5,15,851 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. రాష్ర్టానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో రంగారెడ్డి జిల్లా పెట్టుబడులు 32 శాతం, ఉపాధి కల్పనలో 57 శాతంతో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. జిల్లాలో పెద్దపెద్ద సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. రూ.21,520 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 19,333 ఎకరాల్లో రూ.63వేల కోట్ల పెట్టుబడితో జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

పెరిగిన ఆర్థిక వృద్ధి రేటు

రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీఎ్‌సడీపీ వార్షిక వృద్ధి రేటు 12 శాతం మాత్రమే ఉండేదన్నారు. ఇది జాతీయ వృద్ధి రేటులో 13.4 శాతం కంటే తక్కువని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో జీఎ్‌సడీపీ పెరుగుతూ వచ్చిందని వివరించారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎ్‌సడీపీ వృద్ధి రేటు 13.2 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014-15 నుంచి 2019-20 వరకు రంగారెడ్డి జిల్లా వార్షిక జీఎస్‌డీపీ వృద్ధి రేటు 17.2 శాతానికి పెరిగిందని తెలిపారు.

తలసరి ఆదాయంలో నెంబర్‌ వన్‌

2013-14 సంవత్సరంలో రూ.1,12,162 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో రూ.3,17,115 ఉండవచ్చని అంచనా, ఇది జాతీయ సగటు ఆదాయం కంటే 86 శాతం ఎక్కువని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 2014-15 సంవత్సరంలో రూ.2,83,636 ఉండగా 2020-21 సంవత్సరంలో రూ.6,69,102కు చేరిందన్నారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

రైతు బీమాకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు

రైతు బీమా పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడం తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణమని మంత్రి తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 644 రైతు మరణాలు నమోదు కాగా, 532 మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.26.60 కోట్ల సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4,413 మంది రైతు కుటుంబాలకు 220 కోట్లకు పైగా బీమా మొత్తాన్ని అందించినట్లు వెల్లడించారు. లక్ష రూపాయల లోపు పంట రుణాలను ప్రభుత్వ మాఫీ చేస్తుందని, మొదటి విడతగా జిల్లాలో 10,940 మందికి రైతులకు 25 వేలలోపు ఉన్న మొత్తం రూ.16.73 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో 50 వేలలోపు ఉన్న 21,090 మంది రైతులకు రూ.82.49 కోట్లు రుణమాఫీ అయినట్లు చెప్పారు.

నీటి వనరుల పునరుద్ధరణ

జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా 4 విడతల్లో మొత్తం 999 చెరువులకు పాలన అనుమతులు ఇవ్వగా 956 చెరువుల పునరుద్ధరణ పనులను 132 కోట్ల 95 లక్షల వ్యయంతో పూర్తి చేశామని, మిగిలిన చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 50 చెరువుల మరమ్మతుల పనులకు కోటి ఇరవై ఐదు లక్షలు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో రూ. 10.27 కోట్ల వ్యయంతో 4 చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

2,94,705 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు

మిషన్‌ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 1,072 ఆవాసాలకు 476 కోట్ల అంచనాలతో 3,236 కిలో మీటర్ల పైపులైను, 850 ట్యాంకుల నిర్మాణం, 2,94,705 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అర్బన్‌ మిషన్‌ భగీరథ కింద జిల్లాలోని మహేశ్వరం నియోజవర్గంలో 362 కోట్లతో, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 213 కోట్లతో రాజేంద్రనగర్‌ నియోజవర్గంలో 323 కోట్లతో ఇంటింటికి సురక్షిత తాగునీటి జలాలలను అందించే పథకాన్ని హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్స్స్‌ చేపట్టగా పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.

గురుకుల విద్యకు పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యకు పెద్ద పీట వేసిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పడినప్పుడు జిల్లాలో 7,360 మంది విద్యార్థులతో 21 గురుకులాలు ఉండేవన్నారు. నేడు గురుకులాల సంఖ్య 67కు పెరిగితే వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 20,800కు పెరిగిందని తెలిపారు. మన ఊరు-మన బడి ద్వారా జిల్లాలో మొదటి విడతలో 464 పాఠశాలలు ఎంపిక కాగా, 448 పాఠశాలలకు రూ.97.88 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 11 పాఠశాలలు ప్రారంభం కాగా దశాబ్ధి ఉత్సవాల్లో 40 పాఠశాలలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని, మిగతా 413 నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఉచిత విద్యుత్‌, ఆసరా పింఛన్లు, మహిళా సంఘాలకు రుణాలు, ఉపాధి హామీ పథకం కింద పనులు, దళితబంధు పథకాలను ప్రవేశ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. గొర్రెల పంపిణీ, మత్య్సకారులకు చేపల పంపిణీ చేసి ఆదుకుంటుందన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో సీసీ, బీటీ రోట్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మూసి రివర్‌ బోర్డు చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్‌గుప్తా, యెగ్గె మల్లేశం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీదర్‌, జిల్లా కలెక్టర్‌ హరీష్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డిఎస్‌ చౌహాన్‌, అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్‌, తిరుపతిరావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాచకొండ పోలీస్‌ అధికారి, టైనీ కలెక్టర్‌ కధీరవన్‌ పళని, డీఆర్వో హరిప్రియ, ఆర్డీవో వెంకటచారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణరెడ్డి, కలెక్టరేట్‌ ఏఈవో ప్రమీలరాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సోనియాకు పాలాభిషేకం

తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సేనని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోనిగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జితేందర్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, చల్లా బాల్‌రెడ్డి, సిద్దాల శ్రీశైలం, కృష్ణ, వెంకటేష్‌గౌడ్‌, జయమ్మ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యాలయంలో వేడుకలు

రాష్ట్ర అవతరణ వేడుకలను బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రేమ్‌రాజు, అంజన్‌కుమార్‌గౌడ్‌, పాపయ్యగౌడ్‌, ఎల్‌.ప్రభాకర్‌రెడ్డి, నందకిషోర్‌, వెంకటేష్‌, రాజిరెడ్డి, శ్రీనివాస్‌, మల్లేష్‌, నరేష్‌ పాల్గొన్నారు.

నేడు రైతు దినోత్సవ సంబురం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న రైతు దినోత్సవ సంబరానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వేడకలకు జిల్లావ్యాప్తంగా ఉన్న 83 రైతువేదికలను ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో రైతుల వేదికలన్నీ సరికొత్త శోభతో కళకళలాడుతున్నాయి. రైతు దినోత్సవ కార్యక్రమాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ హరీష్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నియోజకవర్గ నోడల్‌ ఆధికార్లు, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో రైతు దినోత్సవ తుది ఏర్పాట్లపై సమీక్షించారు.

Updated Date - 2023-06-03T00:08:51+05:30 IST