Share News

సోషల్‌ మీడియాపై నిఘా

ABN , First Publish Date - 2023-10-13T23:10:24+05:30 IST

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జిల్లాలో సోషల్‌ మీడియాపై నిఘా పెంచారు. విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. విఘాతం కలిగించే ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసినా, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా, ఇతరులను హెచ్చరిస్తూ పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా సోషల్‌ మీడియా యూనిట్‌ ఆధ్వర్యంలో 24/7 నిఘా పెట్టింది.

సోషల్‌ మీడియాపై నిఘా

వాట్సాప్‌, టెలీగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పోస్టులపై నిరంతర పరిశీలన

జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో మీడియా పరిశీలనా బృందాలు

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలే

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ కేసులు

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జిల్లాలో సోషల్‌ మీడియాపై నిఘా పెంచారు. విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. విఘాతం కలిగించే ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసినా, వ్యక్తిగత దూషణలకు పాల్పడినా, ఇతరులను హెచ్చరిస్తూ పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా సోషల్‌ మీడియా యూనిట్‌ ఆధ్వర్యంలో 24/7 నిఘా పెట్టింది.

వికారాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పట్టణ ప్రాంతాల నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దూరమెంతైనా.. ఏ సమాచారమైన క్షణాల్లో చేరిపోతోంది. యువకుల నుంచి పెద్దల వరకు అత్యధిక శాతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌(ఎక్స్‌), ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌ అకౌంట్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీల నాయకులు తమ కార్యక్రమాలు ప్రచారం చేసుకోవడానికి వీలుగా తమ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. రోజు వారీ పర్యటనలు, ప్రచార కార్యక్రమాల గురించి ఈ గ్రూపుల్లో వైరల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలపైన విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలే కాకుండా వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. ఇదే తీరున కొనసాగితే విమర్శలు హద్దులు దాటి గొడవలు, ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఎన్నికల సంఘం సోషల్‌ మీడియాపై నిఘా పెంచడమే కాకుండా పలు ఆంక్షలు విధించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న నేతల పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు, ఆరోపణలను పరిశీలించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక మీడియా మానిటరింగ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. సోషల్‌ మీడియాపై జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాలు, మండలాల వారీగా కూడా నిఘా ఉంచారు. సోషల్‌ మీడియాలో వచ్చే వాటిని పరిశీలించేందుకు నియోజకవర్గ స్థాయిల్లోనూ పరిశీలనా బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులపై వారు చర్యలు తీసుకోనున్నారు. గ్రూప్‌ అడ్మిన్‌తో పాటు పోస్ట్‌ చేసిన వారితో పాటు ఇతరులకు షేర్‌ చేసే వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారు.

మీడియాపై నిరంతర నిఘా

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో రాజకీయ పార్టీల నాయకులు సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచార కార్యక్రమాలను నిశితంగా పరిశీలించేందుకు మీడియా మానిటరింగ్‌ బృందాలను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ నేతృత్వాల్లో వేర్వేరు బృందాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యే పోస్టులను పరిశీలిస్తున్నాయి. ప్రతిరోజూ దినపత్రికల్లో వచ్చే వార్తలు, ప్రకటనలు పరిశీలించడమే కాకుండా సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే అంశాలను కూడా ఆ బృందాల సభ్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా ప్రసంగాలు, విమర్శలు, ఆరోపణలు ప్రచారమయ్యే వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌కు, ఇలాంటి పోస్టులు పెట్టే వ్యక్తులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోనున్నారు.

రెచ్చగొడితే క్రిమినల్‌ కేసులు...

సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీల నాయకులను కించపరిచేలా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద అంశాలను నమోదు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే రాజకీయ అంశాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసినా, లేక ఎన్నికల అధికారుల పరిశీలనలో గుర్తించినా సంబంధిత వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌పై, పోస్టు చేసిన వ్యక్తిపై ఎన్నికల సంఘం రూపొందించిన చట్టాల మేరకు సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. న్యాయమూర్తి పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత వ్యక్తులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని తేలితే శిక్ష విధించే అవకాశం ఉంటుంది. సాధారణ సమయంలో సోషల్‌ మీడియాలో వచ్చే అసభ్యకర, పరువు నష్టం కలిగించే పోస్టులపై వచ్చే ఫిర్యాదులపై నమోదు చేసే కేసులకు, ఎన్నికల సమయంలో నమోదు చేసే కేసులకు తేడా ఉంటుంది. ఎన్నికల సమయంలో నమోదు చేసే కేసులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు.

హద్దులు దాటితే చర్యలు : జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

జిల్లాలోని సోషల్‌ మీడియాపై నిరంతర నిఘా కొనసాగుతోంది. సోషల్‌ మీడియా గ్రూపుల్లో వచ్చే పోస్టులకు అడ్మిన్లదే బాధ్యత. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు పెట్టినా, ఇతరులకు షేర్‌, ఫార్వర్డ్‌ చే సినా, లైక్‌ కొట్టినా చర్యలు తప్పవు. తప్పుడు వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా ఆరోపణలు చేయడం, దుష్ప్రచారం చేయడం చర్యరీత్యా నేరం. ఇలాంటి పోస్టులు పెట్టిన వారి సమాచారం డయల్‌ 100కు కాల్‌ చేసి ఇవ్వాలి. సోషల్‌ మీడియాపై జిల్లా సోషల్‌ మీడియా యూనిట్‌ ఆధ్వర్యంలో 24/7 నిఘా ఉందనేది మరిచిపోవద్దు.

మీడియా సెంటర్‌ ద్వారా సమాచారం : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్‌ ద్వారా ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియాకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెల్‌ను జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం జరుగుతుందని, ఈ కమిటీ ద్వారా ప్రకటనలు, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం లాంటి ప్రక్రియను పరిశీలిస్తుందన్నారు. సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం జరుగుతుందన్నారు. సోషల్‌ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల ప్రకటనలకు ఎంసీఎంసీ ద్వారా సకాలంలో ఆమోదం మంజూరు చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియామవాళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంసీఎంసీ, ఎన్నికల సంబంధిత ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌, 1950 కాల్‌ సెంటర్‌, సి- విజిల్‌ సెంటర్‌ లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ శర్మ, డీఆర్డీవో కృష్ణన్‌,డీవైఎ్‌సవో హనుమంత్‌ రావు, ఎన్నికల నోడల్‌ అధికారులు ఉపేందర్‌, శ్రీనివాసరావు, సుధారాణి, ఆరిఫుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన కలిగి ఉండాలి : రంగారెడ్డి కలెక్టర్‌భారతీ హొలికేరీ

శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై నోడల్‌ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతీ హొలికేరీ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, భూపాల్‌రెడ్డి, డీఆర్‌వో సంగీతలతో కలిసి నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల పనులు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు పూర్తి చేయాలన్నారు. అన్ని సెషన్లకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ రోజు, ఈవీఎంల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందిని గుర్తించి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నోడల్‌ అధికారులు విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నిరంతర పర్యవేక్షణ చేస్తూ క్షేత్రస్థాయి నుంచి పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో దిలీప్‌ కుమార్‌, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్‌, సీపీవో సౌమ్య, డీసీసీవో ధాత్రి దేవి, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, సివిల్‌ సప్లయ్‌ అధికారి మనోహర్‌ రాథోడ్‌, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం : కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌ అక్టోబర్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్‌ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ఓటర్ల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల పాటు టోల్‌ఫ్రీ నెంబర్‌ పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు, ఓటర్లు ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే టోల్‌ఫ్రీ నెంబర్‌ 180042520520 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, డబ్బులు, మద్యం వంటి ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిసిన టోల్‌ఫ్రీ నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2023-10-13T23:10:24+05:30 IST