నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2023-05-26T23:45:51+05:30 IST
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో భాగంగా ఇద్దరు నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
9.75 క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం
వికారాబాద్, మే 26: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో భాగంగా ఇద్దరు నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశంకు వచ్చిన సమాచారం మేరకు వికారాబాద్ సీఐ శ్రీనుతో కలిసి వికారాబాద్ ఎన్నెపల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న బాపట్ల ప్రాంతానికి చెందిన జూగర్లమూడి శ్రీనివా్‌సరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతడి చేతిలో ఉన్న రెండు బ్యాగులను పరిశీలించగా అందులో 25 పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. హెచ్‌టీ పత్తి విత్తనాలకు తెలంగాణలో మంచి డిమాండ్ ఉందని గుర్తించి కర్నూల్ జిమ్మింగ్ చేసి సుమారు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు విత్తనాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. దానికి గులాబీ రంగు 30శాతం రసాయనాన్ని కలిపి తెలంగాణలోని వికారాబాద్, నారాయణ పేట ప్రాంతాల్లో రైతులకు విక్రయించడానికి సిద్ధం చేశారని తెలిపారు. తెలంగాణ సరిహాద్దు ప్రాంతమైన కర్ణాటకలోని ముథెల్లి మండలం వీరపల్లి గ్రామంలో రెండు నెలల నుండి ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో సుమారు 10క్వింటాళ్ల వరకు పత్తి విత్తనాలను ప్యాకెట్లుగా దాచి ఈ విత్తనాలను మార్కెటింగ్ చేద్దామని నిర్ణయించినట్లు విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. వికారాబాద్ డీఏవోతో తనిఖీ చేయించగా అవన్నీ నకిలీ విత్తనాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు సీఐ శ్రీను కర్ణాటక వెళ్లి అక్కడ 9.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం మోమిన్‌పేట మండలంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ఇదే విధంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతుంటే పట్టుకున్నట్లు తెలిపారు. అతడి వద్ద క్వింటాల్ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, వికారాబాద్ సీఐ శ్రీను, టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశంలు తదితరులు పాల్గొన్నారు.
‘నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు’
కొడంగల్/దోమ: ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. కొడంగల్ పట్టణంలోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులు కె.శంకర్‌రాథోడ్, ఎస్‌ఐ ఎ.రవిగౌడ్, ఏవో బాలాజీప్రసాద్ తదితరులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాల పరిమితి దాటిపోయిన పత్తి విత్తనాలను అమ్మితే సహించేది లేదన్నారు. ఆధికృత కంపెనీల ద్వారా కొనుగోలు చేసిన విత్తనాలను మాత్రమే రైతులకు అందించాలన్నారు. విధిగా రైతులకు రశీదులు అందించాలని, అట్టి రశీదులను పంట కాలంపూర్తయ్యే వరకు రైతులు భద్రపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జయవర్ధన్, ఆంజనేయులు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దోమ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఏడీఏ లక్ష్మీకుమారి శుక్రవారంతనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ విశ్వజాన్, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.