Share News

శివార్లలో రాష్ట్ర రాజకీయం!

ABN , First Publish Date - 2023-10-25T23:00:48+05:30 IST

రాష్ట్ర రాజకీయాలకు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకుల వ్యూహ ప్రతిహ్యూహాలకు ఈ కేంద్రాలు కేంద్రంగా నిలుస్తున్నాయి. తిరుగుబాట్లు, బుజ్జగింపుల పర్వాలన్నీ ఈ కేంద్రాల ద్వారానే నడుస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు ఇక్కడ ఫామ్‌హౌస్‌లు ఉండడంతో నిత్యం ఇక్కడ రాజకీయ నేతల హడావిడి నెలకొని ఉంది.

శివార్లలో రాష్ట్ర రాజకీయం!

ఫామ్‌హౌస్‌లు, పంక్షన్‌ హాళ్లలో సమావేశాలు

బడా నేతలంతా శివార్లలోనే తిష్ట

ఇక్కడ నుంచే రాజకీయ వ్యూహాలు

మొయినాబాద్‌ నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాస్త్రం

తుర్కయాంజల్‌లో ‘నాగం’ అనుచరులతో భేటీ

రాష్ట్ర రాజకీయాలకు హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకుల వ్యూహ ప్రతిహ్యూహాలకు ఈ కేంద్రాలు కేంద్రంగా నిలుస్తున్నాయి. తిరుగుబాట్లు, బుజ్జగింపుల పర్వాలన్నీ ఈ కేంద్రాల ద్వారానే నడుస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు ఇక్కడ ఫామ్‌హౌస్‌లు ఉండడంతో నిత్యం ఇక్కడ రాజకీయ నేతల హడావిడి నెలకొని ఉంది.

(ఆంధ్రజ్యోతి , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

రాష్ట్ర రాజకీయాలకు నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, ఫంక్షన్‌ హాళ్లు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీల నేతలు సైతం ఇక్కడే మకాం వేసి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు శరవేగంగా మారుతున్నాయి. ఆయా పార్టీల్లోకి ఆయారాంలు గయారాంలు పెరుగుతున్నారు. పలు పార్టీలకు చెందిన అసమ్మతి నేతల రహస్య సమావేశాలు నిత్యం శివార్లలో జరుగుతున్నాయి. బీజేపీలో ఇమడ లేక సతమతమవుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆయన బుధవారం మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో అనుచరులతో సమావేశమనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన అక్కడ నుంచి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అనంతరం మీడియాతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌పై తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తుర్కయాంజల్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అనుచరులతో బుధవారం భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో దిగే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌ కొన్నేళ్లుగా పాలన వ్యవహారాలతో పాటు రాజకీయాలను శివార్లలోని తన ఫామ్‌హౌస్‌ నుంచి నడుపుతున్న విషయం తెలిసిందే. ఆయన బాటలోని కొందరు నేతలు ఇపుడు నగర శివారు కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలకు నగర శివార్లలో ఫామ్‌హౌస్‌లున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచే తమ రాజకీయ కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీలు పార్టీ అంతర్గత సమావేశాలు ఇక్కడ ఫామ్‌హౌస్‌లతో పాటు రిసార్ట్స్‌, హోటళ్లలో నిర్వహిస్తున్నాయి. అనుచరులను ఇక్కడకు తీసుకువచ్చి ఖుషీ చేస్తున్నారు. దీంతో నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిస్టార్ట్‌లు కళకళలాడుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో జాతీయ పార్టీల నేతలు కూడా శంషాబాద్‌లో విమానాశ్రయానికి సమీపంలోనే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ కార్యక్రమాలను ముగించుకుని ఇక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు నగరం నడిబొడ్డున అన్ని హంగులతో పార్టీ కార్యాలయాలు ఉన్నప్పటికీ శివార్లలో సమావేశాలకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ శామీర్‌పేటలోని ఫామ్‌హౌస్‌లోనే నివసిస్తున్నారు. ఆయన అంతర్గత సమావేశాలు,. మీడియా సమావేశాలు ఇక్కడ నుంచి ఎక్కువ నిర్వహిస్తున్నారు. మరో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ మొయినాబాద్‌లో ఉంది. ఈ ఫామ్‌హౌస్‌ కేంద్రంగా తరచూ రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అప్పా జంక్షన్‌ వద్ద ఫామ్‌హౌస్‌ ఉంది. కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించిన సమావేశాలు ఇక్కడే జరిగాయి. అలాగే, మరో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి శంషాబాద్‌లో ఫామ్‌హౌస్‌ ఉంది. అంతర్గత విభేదాల వల్ల కొన్నాళ్లుగా పార్టీకి దూరమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో కాంగ్రెస్‌ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ఏఐసీసీ నాయకులు ప్రేమ్‌సాగర్‌రావులు ఇక్కడే సమావేశమై ఆయన్ని బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకువచ్చారు. అలాగే గండిపేట సమీపంలో మరి కొందరు రాజకీయ నేతలకు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. రాజకీయ నేతలు రాజకీయ, వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఈ ఫామ్‌హౌస్‌ కేంద్రంగానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా పార్టీలకు చెందిన అసంతృప్త నేతలకు మొయినాబాద్‌, గండిపేట ఫామ్‌హౌస్‌లు అడ్డాగా మారాయి. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పలు కీలక సమావేశాలు శంషాబాద్‌ నోవాటెల్‌లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి విచ్చేస్తున్న జాతీయ నేతలు, పార్టీ అగ్రనేతలు మోదీ,. అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతలంతా ఈ నక్షత్ర హోటల్‌ల్లోనే రాష్ట్ర నేతలతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే ఈ హోటల్‌ ఉండడంతో బీజేపీతో పాటు ఇతర పార్టీ జాతీయ నేతలు కూడా సమయం వృథా కాకుండా ఇక్కడ ఎక్కువ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-10-25T23:00:48+05:30 IST