కబళిస్తున్న క్షయ
ABN , First Publish Date - 2023-01-18T00:13:56+05:30 IST
ఉమ్మడి జిల్లాలో క్షయ (టీబీ) మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వందలాది మంది ప్రాణాలను కబళిస్తోంది. వైద్యశాఖ వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాపకింద నీరులా వ్యాధి విస్తరణ
రంగారెడ్డిలోనే అత్యధికంగా టీబీ కేసులు
ప్రతి సంవత్సరం పెరుగుతున్న రోగులు
ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లలో టీబీకి 1,307 బలి
ఉమ్మడి జిల్లాలో క్షయ (టీబీ) మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. వందలాది మంది ప్రాణాలను కబళిస్తోంది. వైద్యశాఖ వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హెచ్‌ఐవీ, స్వైన్‌ప్లూ, డెంగీ వ్యాధులతో ఒకరిద్దరు మృతి చెందితేనే పెద్దగా హడావిడి చేస్తున్న సర్కార్.. క్షయ వ్యాధితో ఏటా వందల మంది మరణిస్తున్నా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ఉమ్మడి జిల్లాలో ఏటేటా క్షయ (ట్యూబర్‌క్యులోసి్‌స-టీబీ) రోగుల సంఖ్య పెరుగుతోంది. వయోవృద్ధుల నుంచి పిల్లల వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్లకు పైబడిన వారే ఈ వ్యాధి బారిన పడుతుండే వారు. మారుతున్న జీవన విధానం, తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తి కారణంగా కొన్నేళ్లుగా పిల్లలు కూడా క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. క్షయ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ వివిధ చర్యలు తీసుకుంటోంది. అయినా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ వ్యాధిబారిన పడుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఐదేళ్లలో 1,307 టీబీకి బలి
ఉమ్మడి జిల్లాలో ఐదేళ్ల కాలంలో క్షయవ్యాధి సోకి 1,307 మంది మృతి చెందారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 669 మంది మృతి చెందారు. అలాగే మేడ్చల్ జిల్లాలో 402 మంది మృతి చెందగా వికారాబాద్ జిల్లాలో 236 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా 45-65 ఏళ్లలోపువారే ఉన్నారు.
విస్తరిస్తున్న మహమ్మారి
ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లలో ఇప్పటి వరకు 2,19,155 మందికి టీబీ పరీక్షలు జరపగా 48,091 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో అత్యధికంగా కేసులు రంగారెడ్డి జిల్లాలోనే నమోదయ్యాయి. 1,03,530 మందికి టీబీ పరీక్షలు చేయగా 21,848 మందికి టీబీ వ్యాధి ఉన్నట్లు తేలింది. అలాగే తర్వాత స్థానంలో మేడ్చల్ జిల్లాలో టీబీ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 60,206 మందికి టీబీ పరీక్షలు చేయగా 20,197 మందికి టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వికారాబాద్ జిల్లాలో 55,419 మందికి టీబీ పరీక్షలు చేయగా 6,046 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించారు.
క్షయ బారిన 2,253 మంది చిన్నారులు
క్షయ మహమ్మారి చిన్నారులను కూడ వదలడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదేళ్ల కాలంలో 2,253 మంది చిన్నారులు క్షయ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,083 మంది చిన్నారులకు సోకింది. అలాగే మేడ్చల్ జిల్లాలో 978 మంది చిన్నారులకు, వికారాబాద్ జిల్లాలో 192 మంది చిన్నారులు క్షయ బారిన పడ్డారు.
టీబీ నుంచి కోలుకున్న 37,079 మంది బాధితులు
క్షయ వ్యాధి నివారణకు చికిత్స తీసుకున్న వారికి చాలావరకు తిరిగి ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదేళ్ల కాలంలో 37,079 మంది బాధితులు టీబీ నయమైంది. ఇందులో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 16,429 మంది వ్యాధి గ్రస్తులు క్షయ వ్యాధి నుంచి కోలుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 15,817 మంది టీబీ నుంచి కోలుకోగా, వికారాబాద్ జిల్లాలో 4,833 మంది టీబీ నుంచి కోలుకున్నారు. వేళకు మందులు వేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, డాక్టర్ల సూచనల మేరకు నడక, వ్యాయామం చేయడం వంటివి క్రమం తప్పకుండా చేసినవారు చాలావరకు తిరిగి ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. క్షయవ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యంతోపాటు అవసరమైన మందులు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. క్షయవ్యాధి తీవ్రత ఆధారంగా డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా విభజించారు. డ్రగ్ సెన్సిటివ్ టీబీకి ఆరు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉండగా, డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి వ్యాధి తీవ్రత ఆధారంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
అన్ని అవయవాలకు..
క్షయవ్యాది జుట్టు, గోళ్లు మినహా.. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాపించే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఊపిరితిత్తులు, ఎముకలు, పేగులు, మూత్రపిండాలు, మెదడు, వెన్నెముక, శోషరస గ్రంథులు (లింఫ్‌నోడ్స్)లకు సోకుతుంది. అధునాతన ఔషదాల ద్వారా క్షయను వంద శాతం నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ టీబీ వ్యాధిగ్రస్తులకు బలవర్ధక పోషకాహారాన్ని అందించేందుకు నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది.
వ్యాధి లక్షణాలివే..
క్షయ ఒక అంటువ్యాధి. క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రోగ క్రిములు ఇతరులకు వ్యాపిస్తాయి. ఎవరికైనా వ్యాధి సోకితే రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు, ఆకలి తగ్గుదల ఉంటుంది. దగ్గినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. రోగి ఊపిరితిత్తుల నుంచి వచ్చే కఫం ద్వారా ఈ బాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతుడు పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి జబ్బుకు పునాది వేస్తుంది. ఉమ్మినప్పుడు రక్తం పడటం వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు.
పిల్లల్లో లక్షణాలు
పెద్దల్లో మాదిరిగా తీవ్ర దగ్గు ఉండదు. ఆకలి తగ్గిపోతుంది. తినాలని బలవంతం చేస్తే ఏడుస్తారు. పిల్లల్లో వయస్సుకు తగ్గట్లుగా ఎదుగుదల ఉండదు. బరువు పెరగరు. సాయంత్రం వేళల్లో జ్వరం వస్తుంది. మెడ పక్కన లింపు గ్రంథుల్లో వాపు, గడ్డల్లాగా వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
టీకా ఇస్తున్నా..
శిశువు పుట్టిన 24 గంటల్లోపు క్షయను నివారించే బీసీజీ టీకా ఇస్తారు. లేదా పుట్టిన రెండేళ్లలోపు ఎప్పుడైనా ఇప్పించవచ్చు. పుట్టే శిశువుల్లో దాదాపు 99 శాతం మందికి బీసీజీ ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షయ బాధిత బాలలు ఇంకా ఉండటమేమిటన్నది ప్రశ్నగా మారింది. పిల్లలకు 10-12 ఏళ్లు వచ్చేసరికి టీకా సమర్ధత తగ్గడం దీనికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడుతున్న పిల్లల్లో 70 శాతం మంది 12-15 ఏళ్ల వయస్సువారే. వ్యాధి సోకే పిల్లల్లో 3-5 శాతం మందికి మాత్రమే మం దులు ఇవ్వగలుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతోపాటు ఇళ్ల వద్ద కాన్పు జరిగినా.. శిశువులకు కచ్చితంగా బీసీజీ టీకా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంట్లో పెద్దలకు సోకితే..
ఇంట్లో పెద్దవారిలో ఎవరికైనా క్షయ సోకితే.. ఆ ఇంట్లో ఆరేళ్లలోపు పిల్లలందరినీ పరీక్షిస్తారు. పెద్దల నుంచి వారికి సోకకుండా ఉండేందుకు ‘ఐసోనియాజిడ్ (ఐఎన్‌హెచ్)’ మాత్రలు ఇస్తారు. వాటిని ఆరు నెలల పాటు తప్పనిసరిగా వాడాలి. సుమారు 10 శాతం మంది పూర్తి స్థాయిలో మందులు వాడకపోవడంతో ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి క్షయ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు, క్లినిక్‌లోని వైద్యులను సంప్రదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో వీరు 30 శాతానికి పైగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వీరు ప్రైవేట్ వైద్యులు సూచించే ప్రైవేట్ మందులను కొని చికిత్సకు వాడుతున్నారు. ప్రస్తుతం ఇలా ప్రైవేట్‌గా చికిత్స చేయించుకునే వారికి కూడా ప్రభుత్వం మందులు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేట్ వైద్యుల వద్దకు వచ్చే రోగుల వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యశాలకు అందజేయాల్సి ఉంటుంది.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
మెరుగైన వైద్యం అందిస్తున్నాం. క్షయ అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందుల పంపిణీతోపాటు రోగులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను గుర్తిస్తున్నాం. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బాధితులు త్వరగా కోలుకుని రికవరీ అవుతున్నారు. క్షయ వ్యాధిని సకాలంలో గుర్తించి క్రమంగా మందులు వాడితే అదుపులోకి వస్తుంది.
- అరుణకుమారి, జిల్లా క్షయ నివారణ అధికారి
రంగారెడ్డి జిల్లాలో టీబీ కేసుల వివరాలు
2018 2019 2020 2021 2022
(టీబీ) క్షయ పరీక్షలు చేసినవి : 13,936 23,210 15,826 13,133 37,425
నమోదైన క్షయ(టీబి) కేసులు : 3,400 4,788 4,294 4,428 4,938
బాధితుల్లో చిన్నారుల సంఖ్య : 238 242 184 188 231
మృతుల సంఖ్య : 111 181 140 143 94
చనిపోయిన వారి వయస్సు : 45-67 45-65 40-75 55-74 40-65
వ్యాధి నయమైన వారి సంఖ్య : 3,194 4,493 4,003 4,127 0
మేడ్చల్ జిల్లాలో...
2018 2019 2020 2021 2022
(టీబీ) క్షయ పరీక్షలు చేసినవి : 10,363 17,957 11,282 10,082 10,522
నమోదైన క్షయ(టీబి) కేసులు : 2,844 4,016 3,982 3,935 5,420
బాధితుల్లో చిన్నారుల సంఖ్య : 181 208 209 166 214
మృతుల సంఖ్య : 103 99 97 71 32
చనిపోయిన వారి వయస్సు : 16-40 41-60 45-60 40-75 45-76
వ్యాధి నయమైన వారి సంఖ్య : 2,608 3,798 3,757 3,764 2,502
వికారాబాద్ జిల్లాలో...
2018 2019 2020 2021 2022
చేసిన క్షయ పరీక్షలు : 7,430 12,930 9,560 5,736 19,763
గుర్తించిన క్షయ కేసులు : 969 1,235 961 1,103 1,784
బాధితుల్లో చిన్నారులు : 39 44 37 31 41
మృతుల సంఖ్య : 43 57 43 50 49
చికిత్స పూర్తయిన వారి సంఖ్య : 926 1,178 918 1,053 758