‘పట్టు’ రైతుల నిరసన
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:24 PM
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పట్టుగూళ్ల మార్కెట్ ఎదుట సిద్దిపేట జిల్లా పట్టు రైతుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా రైతులు సోమవారం నిరసన తెలిపారు.
సిద్దిపేట అగ్రికల్చర్, డిసెంబరు 18 : సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పట్టుగూళ్ల మార్కెట్ ఎదుట సిద్దిపేట జిల్లా పట్టు రైతుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన పట్టు గూళ్లు తీసుకెళ్లినప్పటికీ తిరుమలగిరి, జనగామ మార్కెట్‌లలో సరైన ధర రావడం లేదని చెప్పారు. విక్రయించిన గూళ్లకు సరిగా డబ్బు చెల్లించడం లేదని, నెలల తరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పట్టు పరిశ్రమశాఖ కమిషనర్, ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. పట్టు గూళ్లకు సరైన నాణ్యమైన ధర లభించేలా చూడాలని, అమ్మిన గూళ్లకు త్వరగా డబ్బు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా రైతులపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న మార్కెట్ అధికారులపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో సిద్దిపేట జిల్లా పట్టు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల ఐలయ్య, కోశాధికారి రాజు, కార్యవర్గ సభ్యులు బొగ్గుల నర్సింహులు, పిల్లి శ్రీనివాస్, తులసిరామ్, పిల్లి పెద్ద శ్రీనివాస్, రమేష్, రవీందర్, బాల్‌రెడ్డి, ఆంజనేయులు, స్వామి తదితరులు పాల్గొన్నారు.