శివ..శివా!

ABN , First Publish Date - 2023-05-26T23:46:36+05:30 IST

వికారాబాద్‌ పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తున్న శివసాగర్‌పై పర్యవేక్షణ కొరవడింది. చెరువులో నీరు పుష్కలంగా ఉన్నా దానిని వినియోగించుకోవడంలో మున్సిపల్‌ యంత్రాంగం విఫలమవుతోంది. కొన్నేళ్లు ఫిల్డర్‌ బెడ్లు పనిచేయక పోవడంతో అత్యవసర సమయంలో శుద్ధి చేయని చెరువు నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

శివ..శివా!
ఫిల్టర్‌ బెడ్‌లో ఫిల్టర్‌కానీ నీరు

పని చేయని శివసాగర్‌ చెరువు ఫిల్టర్‌ బెడ్లు

మిషన్‌భగీరథ నీటి సరఫరాకు బ్రేక్‌ పడితే అంతే

అత్యవసర సమయంలో కలుషిత నీరే సరఫరా

రోగాల బారిన పడుతున్న వికారాబాద్‌ పట్టణ ప్రజలు

కొత్త ఫిల్టర్‌ బెడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టని బల్దియా

ఐదేళ్లుగా నిధులు కేటాయించని యంత్రాంగం

వికారాబాద్‌ పట్టణ ప్రజల దాహార్తి తీరుస్తున్న శివసాగర్‌పై పర్యవేక్షణ కొరవడింది. చెరువులో నీరు పుష్కలంగా ఉన్నా దానిని వినియోగించుకోవడంలో మున్సిపల్‌ యంత్రాంగం విఫలమవుతోంది. కొన్నేళ్లు ఫిల్డర్‌ బెడ్లు పనిచేయక పోవడంతో అత్యవసర సమయంలో శుద్ధి చేయని చెరువు నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని తాగిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

వికారాబాద్‌, మే 26: మనిషి భోజనం చేయకుండా అయినా ఉంటాడేమో కానీ, గుక్కెడు మంచినీరు తాగకుండా ఉండలేని పరిస్థితి. దశాబ్దాలుగా వికారాబాద్‌ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చింది మాత్రం వికారాబాద్‌ శివసాగర్‌ చెరువు. ప్రస్తుతం ప్రభుత్వం మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తోంది. ఒక వేళ మిషన్‌ భగీరథ నీటి సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా వికారాబాద్‌ మునిసిపాలిటీకి శివసాగర్‌ చెరువు నీరే దిక్కు. అయితే ఈ చెరువుపై పర్యవేక్షణ కొరవడింది. మూడున్నర సంవ్సరాలుగా కొత్త మునిసిపల్‌ బాడీ ఏర్పడినప్పటికీ ఆచెరువు, ఫిల్టర్‌ బెడ్‌ కోసం నిధులు మాత్రం కేటాయించడం లేదు. ఫలితంగా ఫిల్టర్‌ బెడ్‌లు పనిచేయడం లేదు. దీంతో దుర్వాసనతో కూడిన ఎర్రటి నీటినే అధికారులు నెలలో మూడు నాలుగు సార్లు సరఫరా చేస్తున్నారు.

నిత్యం 8 ఎంఎల్‌డీ నీరు అవసరం

సుమారు 70వేల పై చిలుకు జనాభా కలిగిన వికారాబాద్‌ పట్టణంలోని ప్రజలకు నిత్యం 8 ఎంఎల్‌డీ నీరు అవసరం. గతంలో వికారాబాద్‌ పట్టణానికి మంజీర నీటితో పాటు శివసాగర్‌ నీటిని పట్టణ ప్రజలకు రోజు తప్పించి రోజు సరఫరా చేసే వారు. ఆ తరువాత మిషన్‌ భగీరథ నీరు రావడంతో మంజీరా నీటి సరఫరాను ఆపేశారు. భగీరథ నీరు రాని సమయంలో శివసాగర్‌ చెరువు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీరు పూర్తిగా ఎర్రగా దుర్వాసనతో రావడంతో పట్టణ ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు.

ఫిల్టర్‌ బెడ్ల ఏర్పాటుకు రూ. 30 లక్షలు

ఇదిలా ఉంటే ఫిల్టర్‌ బెడ్ల ఏర్పాటు కోసం అధికారులు, ప్రజా ప్రతినిఽధులు గతంలో మెకానిక్‌లను పిలిపించి వాటి మరమ్మతులతో పాటు కొత్తవి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిధులు కేటాయించలేదు. దీంతో ఫిల్టర్‌ బెడ్‌లో నీరు శుద్ధ్ది కాకుండానే శివసాగర్‌ చెరువు నీరు యథావిధిగా పట్టణ ప్రజలకు సరఫరా అవుతోంది. మిషన్‌ భగీరథ నీరు అనుకోని ప్రజలు చెరువు నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. మునిసిపాలిటీ ఏజెండాలో మూడున్నర సంవత్సరాలుగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు కేటాయించలేదని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.

అభివృద్ధి పక్కన పెట్టి కుర్చిల కోసం కుస్తీ

వికారాబాద్‌ మునిసిపాలిటీలో రెండున్నరేళ్ల చైర్‌పర్సన్‌ ఒప్పందం మునిసిపల్‌ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఇరువుకి రెండున్నరేళ్ల చైర్‌పర్సన్‌ పదవి ఇస్తామని చెప్పడంతో ఓ వర్గం ఒప్పంద గడువు ముసిగిందని కొట్లాడుతుండగా, మరో వర్గం మేము దిగేది లేదని బీష్మించుకొని కూర్చొవడంతో పట్టణ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. తాజాగా మునిసిపల్‌ సాధారణ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి అంశాలను అందులో పొందుపర్చగా బీఆర్‌ఎస్‌ మరో వర్గం దాన్ని తిరస్కరించడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రధానంగా వికారాబాద్‌ పట్టణంలో మంచినీటి సమస్యతో పాటు ఎస్‌టీపీ ప్లాంట్‌, అండర్‌ డ్రైనేజీ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎస్‌టీపీ ప్లాంట్‌లోని డ్రైనేజీ నేరుగా మూసీనదితో పాటి గండిపేటలో కలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

అధికారుల చేతివాటం

శివసాగర్‌ చెరువులో పుష్కలంగా నీరు ఉన్నా వాటిని ఉపయోగించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. అధికారులు మాత్రం దాని పేరు చెప్పి అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నచిన్న రిపేర్లు, అలామ్‌ పేరుతో డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్‌ట్యాంక్‌ల విషయంలో ఒకటి రెండు లెక్కలు రాసి బిల్లులు కాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ శాఖకు సంబంధించిన ఓ అధికారి పెద్దల అండదండలు ఉన్నాయన్న ధీమాతో చైర్‌పర్సన్‌, ప్రతిపక్ష కౌలర్లతో పాటు మునిసిపల్‌ కమిషనర్‌ మాట కూడా లెక్కడచేయడం లేదని తెలుస్తోంది. నామ్‌కే వాస్తేగా అలామ్‌ వేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి నీటిని సరపరా చేయిస్తున్నారు.

అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తాం : మంజుల రమేష్‌ , మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌

వికారాబాద్‌ శివసాగర్‌ నీటిని ఫిల్టర్‌ చేసే విషయమై అత్యవసర సమావేశం నిర్వహిస్తాం. నీటిశుద్ధి కోసం నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం. అధికారులు మాట వినడం లేదు. అభివృద్ధి అంశాలపై ఏజెండాలో చేరిస్తే సొంత బీఆర్‌ఎస్‌ నాయకులే తిరస్కరించారు. గతంలో ఫిల్టర్‌ బెడ్‌ వద్ద అలామ్‌ కోసం రూ.5 లక్షలు కేటాయించాం.

ఫిల్టర్‌ బెడ్‌కు నిధులు కేటాయించాలని కోరాం: శరత్‌ చంద్ర, మునిసిపల్‌ కమిషనర్‌

వికారాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చే ఫిల్టర్‌ బెడ్‌ కొత్తవి ఏర్పాటుకు నిధులు కేటాయించాలని రాత పూర్వకంగా మునిసిపల్‌ బాడీని చైర్‌ పర్సన్‌ను కోరడం జరిగింది. వాస్తవానికి మిషన్‌ భగీరథ నీరు రాని సమయంలో శివసాగర్‌ నీరు సరఫరా చేస్తున్నాం. శివసాగర్‌ ఫిల్టర్‌ బెడ్లు మరమ్మతులు అయ్యే వరకు ఆ నీటిని ఎవరూ తాగోద్దు. అవసరాలకు మాత్రమే వాడుకోవాలి.

ఎమ్మెల్యే సమస్యకు పరిష్కారం చూపాలి: సుధాకర్‌ రెడ్డి , మునిసిపల్‌ ప్లోర్‌ లీడర్‌

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పంచాయతీ పెట్టినా, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సమస్యలపై స్పందించాలి. వికారాబాద్‌ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడంలో విఫలమవుతున్నారు. మునిసిపల్‌లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఉంది పరిస్థితి. వికారాబాద్‌లో ప్రధాన సమస్య అయినా తాగునీటితో పాటు అండర్‌ డ్రైనేజీ, ఎస్‌టీపీ ప్లాంట్‌ పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలి.

Updated Date - 2023-05-26T23:46:36+05:30 IST