ిసీలింగ్‌ భూములు స్వాహా!

ABN , First Publish Date - 2023-05-30T23:35:52+05:30 IST

సీలింగ్‌ భూములపై అక్రమార్కులు కన్నేశారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని పట్టాదారులకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇదంతా తెలియని పట్టాదారులు లబోదిబోమంటున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.

ిసీలింగ్‌ భూములు  స్వాహా!
176 సర్వేనెంబర్‌లోని 16 ఎకరాల సిలింగ్‌ భూమి

మోమిన్‌పేట మండలంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు

ఎన్కతల పరిధి సర్వేనెంబరు 176లో 16 ఎకరాలు మాయం

రైతులకు తెలియకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అక్రమార్కులు

2013లో రైతు చనిపోతే 2017లో ఇతరులపై సీలింగ్‌ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌

2023 జనవరి 18న మోమిన్‌పేట తహసీల్దార్‌ పరిధిలో రిజిస్ట్రేషన్లు

సీలింగ్‌ భూములపై అక్రమార్కులు కన్నేశారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని పట్టాదారులకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇదంతా తెలియని పట్టాదారులు లబోదిబోమంటున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.

వికారాబాద్‌ / మోమిన్‌పేట, మే30 : దేశంలో ప్రతీ ఒక్క కుటుంబానికి భూమి ఉండాలనే లక్ష్యంతో 1973లో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సీలింగ్‌ విధించి భూమి లేని పేద కుటుంబాలకు ఇవ్వాలనేది ఉద్దేశం. ఈ క్రమంలో భూమి లేని పేదలకు భూ పంపిణీ చేశారు. ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రైతులు ఆ భూమిని అమ్మడం కానీ ఇతరులకు కొనుగోలు చేయొద్దని గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో తీసుకొచ్చారు. రైతులు ఆ భూముల్లో సాగుచేసుకుంటూ కబ్జాలో ఉన్నారు. తాజాగా అట్టి భూములు రైతులకే తెలియకుండా ఇతరుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్లు అయిన సంఘటన వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం ఎన్కతల గ్రామ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది. ఈ రిజిస్ట్రేషన్‌ అధికారుల కనుసన్నాల్లోనే జరిగినా అధికారులు తామకేమి తెలియదన్నట్లుగా వ్యవహరించడంతో నిరుపేద రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

176 సర్వే నెంబర్‌లో 16 ఎకరాలు

ఇదిలా ఉంటే ఎన్కతల గ్రామ సమీపంలోని 176 సర్వే నెంబరులో 16 ఎకరాల భూమిని అప్పట్లో గ్రామంలోని ఎనిమిది మంది రైతులకు అందజేసింది. గ్రామానికి చెందిన మోకిల కిష్టయ్య, మోకిల అనంతయ్య, ఏంపల్లి లింగయ్య, ఏంపల్లి దుర్గయ్యతో పాటు మరో నలుగురు రైతులకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున కేటాయించింది. అప్పటి నుంచి భూయజమానులతో పాటు వారి వారసులు కబ్జాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూవచ్చారు. ఈ క్రమంలోనే కొందరూ గ్రామస్తులు గతంలో ఒకరూ ఇద్దరు రైతులకు డబ్బుల ఆశ చూపి లోలోపల రిజిస్ట్రేషన్‌ చేసుకోగా తాజాగా జనవరి 18న మోమిన్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు రైతులకు తెలియకుండా జరిగాయి.

రైతులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు

గ్రామానికి చెందిన మోకిల కిష్టయ్యకు సీలింగ్‌ పట్టాగా పాస్‌ బుక్‌ రాగా ఆ తరువాత అట్టి భూమిని వారి కుమారులు శెట్టయ్య, రమేష్‌, మాణిక్యం, నర్సింహులు అనువంశం కింద తండ్రి చనిపోయిన తరువాత అరఎకర చొప్పున పట్టా చేసుకున్నారు. వీరు డిసెంబర్‌ నెల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతు బంధును పొందుతూ వచ్చారు. అయితే జనవరి 18న వీరి పేరుపై ఉన్న భూమి ఎవరో రామానుజంపై ఉన్నట్లు ధరణిలో చూపించడంతో రైతులు కంగున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ కార్యాలయంలో రైతులు సంప్రదిస్తే మాకు ఏం తెలియదనే నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచక, తమ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక కొట్టుమిట్టాడుతున్నారు.

2013లో చనిపోయిన రైతు.. 2017లో రిజిస్ట్రేషన్‌

ఇదే గ్రామానికి చెందిన మోకిల అనంతయ్య అనే రైతు 2013లో మృతి చెందాడు. అట్టి భూమిని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండానే 2017లో అక్రమంగా రిజిస్రేషన్‌ చేసినట్లుగా తెలిసింది. అయితే అట్టి భూమిని మోకిల కిష్టయ్య కుమారుల భూమితో పాటు 2023 జనవరి 18న మళ్లీ రిజిస్ర్టేషన్‌ కావడం కొసమెరుపు. సర్వేనెంబరు ఆ 176కు కు చెందిన భూమిని అసలైన రైతులకు తెలియకుండానే అక్రమంగా దొంగ డాక్యుమెంటట్లు సృష్టించి విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్‌ స్పందించి రైతులకు సంబంధించిన సీలింగ్‌ భూములను తిరిగి అప్పగించేలా చూడాలని కోరుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన అధికారులపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

డిసెంబర్‌ వరకు రైతు బంధు తీసుకున్నాం: రమేష్‌ సీలింగ్‌ భూమి పట్టాదారు, ఎన్కతల

మోకిల కిష్టయ్యకు వచ్చిన రెండు ఎకరాల భూమిని మా నాన్న చనిపోవడంతో నలుగురం అన్నదమ్ములం ఆ భూమిని అనువంశం కింద 20 గుంటల చొప్పున పట్టా అధికారులు పట్టా చేశారు. అయితే 2023 జనవరి 18న మా భూమికి సంబంధించి మా నలుగురు అన్నదమ్ములకు తెలియకుండానే ఇతరులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు చూపిస్తుంది. ఎవరో రామానుజం ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఆయన పేరుపైనే ధరిణిలో చూిపిస్తుంది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాంు. కలెక్టర్‌ స్పందించి మా భూమికి మాకు వచ్చే విధంగా చూడాలి.

మా నాన్న భూమి మాకు రాలేదు: రాంచంద్రయ్య, రైతు, అనంతయ్య కొడుకు

మా నాన్న మోకిల అనంతయ్యకు సంబంధించి రెండు ఎకరాల భూమి సిలింగ్‌ పట్టా ఉండే. అయితే మానాన్న 2013లో చనిపోతే 2017లో అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేశారు. అయితే తాజాగా అదే భూమి 2023 జనవరి 18న మరోసారి వేరే వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయింది. అట్టి భూమిని మా కుటుంబంలో ఎవరూ అమ్మలేదు. కావాలనే ఎవరూ దొంగ రిజిస్ట్రేషన్‌ చేశారు. మా భూమి మాకు వచ్చే విధంగా చూడాలి

విచారణ జరిపిస్తాం: కిరణ్‌ కుమార్‌, మోమిన్‌పేట తహసీల్దార్‌

ఎన్కతల సర్వేనెంబరు 176 రైతులకు సంబంధించిన సీలింగ్‌ భూములు అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగాయనే విషయం ఇప్పుడే మా దృష్టికి వచ్చింది విచారణ జరిపిస్తాం. అట్టి భూములను ఎవరూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవద్దు. ఎవరైనా చేసుకుంటే చెల్లదు. అయితే 2023 జనవరి 18న తహసీల్దార్‌గా మేము ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఏమైనా ఉంటే విచారణ జరిపి రైతులకు సంబంధించి భూములు వారి పేరున చేస్తాం.

Updated Date - 2023-05-30T23:35:52+05:30 IST