సంగెం చెరువు తూముకు నెర్రెలు
ABN , First Publish Date - 2023-07-02T23:00:31+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. నాసిరకం పనులతో తూముకు పగుళ్లు ఏర్పడి నీరు నిలవని పరిస్థితి నెలకొంది.
మిషన్ కాకతీయలో కొత్తగా నిర్మాణం
నాసిరకం నిర్మాణంతోనే పగుళ్లు
వృథాగా పోతున్న నీరు
పెద్దేముల్, జూలై 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. నాసిరకం పనులతో తూముకు పగుళ్లు ఏర్పడి నీరు నిలవని పరిస్థితి నెలకొంది. అధికారులు త్వరగా స్పందించి తూముకు మరమ్మతులు చేయిస్తేనే వానాకాలంలో సాగు చేసుకునేందుకు రైతులకు అవకాశం కలుగుతుంది. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ సమీపంలోని సంగెం చెరువులో మిషన్ కాకతీయ కింద పూడికతీత పనులు, పాత తూమును పూర్తిగా తొలగించి కొత్తగా తూము నిర్మాణం చేశారు. అయితే తూము నిర్మాణ సమయంలోనే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తూము నిర్మాణం ఇలా ఉంటే శిథిలమవుతుందని హెచ్చరించారు.అయినా అధికారులు వినిపించుకోలేదు. వారు ముందుగా సిద్ధ్దం చేసుకున్న ప్రణాళిక ప్రకారం తూము నిర్మించారు. పనులు పూర్తి చేసి సుమారు మూడేళ్లు గడిచిపోయాయి. అంతలోనే చెరువు తూము శిథిలమైంది. నిలువునా చీలిక ఏర్పడి చెరువు నీరు వృథా పోతుంటే రైతులు గడ్డి, మట్టి వేసి నీటికి అడ్డుకట్ట వేశారు. అయినా చాలా వరకు నీరు వృథాగా పోయింది. ప్రస్తుతం చెరువులో నీరు లేకపోవడంతో తూముకు మరమ్మతులు చేసి దానిని పునరుద్ధ్దరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే వర్షాలకు చెరువులోకి వచ్చిన వరదనీరు ఎప్పటికప్పుడు వృఽథాగా పోయే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చెరువు తూముకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆయకట్టు పొలాలకు నీరందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
=============================================