నాలుగు లేన్లుగా సాగర్-హైదరాబాద్ రహదారి
ABN , First Publish Date - 2023-07-27T00:28:37+05:30 IST
హైదారాబాద్-నాగార్జున సాగర్ ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు బుధవారం సర్వే చేపట్టారు.
రోడ్డు ప్రమాదాలతో స్పందించిన ప్రభుత్వం
ఆర్‌అండ్‌బీ అధికారుల సర్వే
యాచారం, జూలై 26 : హైదారాబాద్-నాగార్జున సాగర్ ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు బుధవారం సర్వే చేపట్టారు. ఈమేరకు యాచారం మండలం మాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కల్వర్టులు, కృష్ణా తాగునీటి పైప్‌లైన్‌ను, ఎయిర్‌వాల్వ్‌లను పరిశీలించారు. కాగా, నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం సూచనలతో ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి వెంట కల్వర్టులు, కృష్ణా నీటి ఎయుర్‌వాల్వ్‌లను పరిశీలించారు. కాగా, కృష్ణా తాగునీటి పైప్‌లైన్ రోడ్డుకు ఎంత దూరంలో ఉంది.. రోడ్డు వెడల్పులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అఽధికారులు అంచనా వేస్తున్నారు. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గేటు సమీపంలో ఉన్న బ్రిడ్జిని మరింత విస్తరించాలా? వద్దా? అనే అంశంపై అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అదేవిధంగా యాచారం, గున్‌గల్ ఆగాపల్లి వద్ద బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాగా, ఈనెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో నెత్తురోడుతున్న సాగర్-హైదరాబాద్ రహదారి అనే కథనం ప్రచురితమైంది. దీంతో రహదారి ఇరుకుగా ఉండటంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారు.