‘సదరం’ స్లాట్ బుకింగ్ తేదీలు ఖరారు
ABN , First Publish Date - 2023-04-28T23:22:48+05:30 IST
సదరం క్యాంపునకు సంబంధించి మూడు నెలలు ఆన్‌లైన్ బుకింగ్ స్లాట్ల తేదీలు విడుదల చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 28 : సదరం క్యాంపునకు సంబంధించి మూడు నెలలు ఆన్‌లైన్ బుకింగ్ స్లాట్ల తేదీలు విడుదల చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి త్రైమాసిక సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ స్లాట్లు మే 2 నుంచి 30 వరకు మీ సేవా ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. స్లాట్ బుక్ చేసుకున్నవారు సూచించిన తేదీల్లో కొండాపూర్, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో జరిగే సదరం క్యాంపులకు హాజరు కావాలని తెలిపారు. కొత్తగా వికలత్వ పరీక్షల కోసం వచ్చేవారితో పాటు రెన్యూవల్ కోసం వచ్చేవారు కూడా మీ సేవా ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ క్యాంపునకు కేవలం రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. కొండాపూర్ ఆసుపత్రిలో మే 2, 9, 16, 23, 30 తేదీల్లో శారీరక, మానసిక వికలత్వం, అంధత్వం, వినికిడి లోపం... వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో మే 5, 19, 26 తేదీల్లో శారీరక వికలత్వ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత డాక్టర్ బృందం పరీక్షలు నిర్వహించి వికలత్వ శాతాన్ని నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. మీ సేవాలో బుకింగ్ చేసుకున్న స్లిప్, ధ్రువ పత్రాలతో (ఆధార్ కార్డు, ఫొటో, రేషన్ కార్డు, ఓటరు ఐడీ కార్డు, వినికిడి లోపం ఉన్న వారు ప్రభుత్వ ఈఎన్టీ, హైదరాబాద్ వారి బెరా సర్టిఫికెట్, సంబంధిత డాక్టర్ రిపోర్టు తీసుకుని సదరం క్యాంపునకు హాజరు కావాలని సూచించారు.