రైతు బజార్‌ నిరుపయోగం

ABN , First Publish Date - 2023-09-21T23:27:14+05:30 IST

నూతనంగా ఏర్పాటైన మూడుచింతలపల్లి మండలంలోని ఐదు గ్రామాలను సీఎం దత్తత తీసుకున్నారు.

రైతు బజార్‌ నిరుపయోగం
కేశవరంలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌

ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.25లక్షలు వృథా?

రైతులకు అవగాహన కల్పించని అధికారులు, పాలకులు

మూడుచింతలపల్లి, సెప్టెంబరు 21: నూతనంగా ఏర్పాటైన మూడుచింతలపల్లి మండలంలోని ఐదు గ్రామాలను సీఎం దత్తత తీసుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి కోసం సీఎం ఎస్‌డీఎఫ్‌ కింద రూ.69కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు, ఫంక్షన్‌ హాళ్లు, మినీ స్టేడియం, గ్రామ పంచాయతీలు భవనాలు, దోభీఘాట్‌, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, పశువైద్యశాల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తదితర నిర్మాణాలు చేపట్టారు. కాగా పూర్తయిన నిర్మాణాలు నిరుపయోగంగానే ఉన్నాయి. రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు కేశవరంలో రూ.25లక్షలతో కవర్డ్‌ షెడ్‌ నిర్మించారు. రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రైతు బజార్‌ నిర్మించగా మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అయితే ఆ రైతు బజారులో ఇప్పటి వరకూ రైతులు కూరగాయాలను అమ్మింది లేదు. వారంతపు సంతా నిర్వహించలేదు. రైతులు రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్నారు. పంచాయతీ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదు. వారు రైతులకు అవగాహన కల్పించడం లేదు. రూ.25లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు బజార్‌ను రైతులు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులది. అయితే దాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు వారు దృష్టిపెట్టడం లేదు. నిర్మాణ సమయంలో ఉన్న శ్రద్ధ ప్రారంభించిన తరువాత చూపడం లేదు. లక్షలు వెచ్చించిన నిర్మించిన ఈ షెడ్డును వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఒక్కసారి మార్కెట్‌ నిర్వహించారు : కాసుల వెంకటేశ్‌, కేశవరం

రూ.25లక్షలతో నిర్మించిన రైతుబజార్‌ నిరుపయోగంగా మారింది. రైతులు అందులో ఒక్కసారి మాత్రమే మార్కెట్‌ నిర్వహించారు. తిరిగి యథావిధిగా రోడ్లపైనే కూరగాయలు అమ్ముకుంటున్నారు. రోడ్లుపై అమ్మకుండా పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతు బజార్‌ వినియోగంలోకి వస్తుంది. స్థానికులు సైతం దానిలోకి వెళ్లి కొనుక్కుంటారు. ఇప్పటికైనా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2023-09-21T23:27:14+05:30 IST