Share News

అక్రమాలపై సింహంలా గర్జించండి

ABN , First Publish Date - 2023-11-16T23:44:07+05:30 IST

రాజకీయ నేతల అక్రమాలపై ప్రజలంతా సింహంలా గర్జించాలని ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అక్రమాలపై సింహంలా గర్జించండి
కేశంపేటలో రోడ్‌ షోలో ప్రసంగిస్తున్న పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి

కొందుర్గు/కేశంపేట, నవంబరు 16: రాజకీయ నేతల అక్రమాలపై ప్రజలంతా సింహంలా గర్జించాలని ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కొందుర్గు, కేశంపేట మండలాల్లో ఆయన నిర్వహించిన రోడ్‌షోలకు భారీ ఎత్తున జనం వచ్చారు. కేశంపేటలో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారం అంటే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు కాదన్నారు. అలాంటి వారిని సొంతూరు, పుట్టిన గడ్డ కూడా క్షమించదన్నారు. తనలా ప్రజాసేవ చేసే లక్ష్యం ఎవరికైనా ఉందా?అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా పేరు గడించిన వారు ప్రజల కోసం నయాపైస కూడా ఖర్చుచేయపోవకడం బాధాకరమన్నారు. ‘ప్రజలారా నన్ను దీవించి సింహం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటా.’ అని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కల్పించే పథకాలతో పాటు, తన సొంతంగా మరో 12పథకాలనూ ప్రజలకు అందిస్తానని చెప్పారు. నిరుద్యోగ నిర్మూలన కోసం జాబ్‌ మేళాలు నిర్వహించి ప్రతీ సంవత్సరం 5వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు కొందుర్గులో రోడ్డు షోలో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. మీ సేవ కోసమే ఆ భగవంతుడు తనను పంపాడని, ఆ దేవదేవుడి ఆశయం మేరకు మీ రుణం తీర్చుకునే భాగ్యాన్ని కల్పించాలని, సింహం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో సింహం వేట మొదలైయిందని, ఈ సింహాన్ని ఆశీర్వందించేందుకు పల్లెల నుంచి ప్రజలు తరలివస్తున్నారన్నారు. విష్ణన్న వస్తే అంతా మంచే జరుగుతుందని భావించి తనను గెలిపించాలని కోరారు. పీవీఆర్‌ ప్రచారాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న టీవీ నటుడు కొమురక్క(కొమురయ్య) మాట్లాడుతూ.. షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి పర్చడం కేవలం విష్ణన్నతోనే సాధ్యం అన్నారు. పీవీఆర్‌ ఎమ్మెల్యే అయితేనే పేదల బతుకులు మారతాయన్నారు. సింహం గుర్తుకు ఓటేసి విష్ణువర్ధన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-16T23:44:08+05:30 IST