గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద దారి దోపిడీ
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:07 PM
శంషాబాద్ మండలం పాల్మాకుల-పెద్దగోల్కొండ పీవన్ దారిలో గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం దారి దోపిడీ జరిగింది. ముగ్గురు దుండగులు ఓ మినీ వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి రూ.1.35లక్షలు నిలువు దోపిడీ చేశారు.
మినీ ట్రక్కును అడ్డగించిన దుండగులు.. రూ.1.35లక్షలు చోరీ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు
శంషాబాద్ రూరల్, డిసెంబరు 17: శంషాబాద్ మండలం పాల్మాకుల-పెద్దగోల్కొండ పీవన్ దారిలో గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం దారి దోపిడీ జరిగింది. ముగ్గురు దుండగులు ఓ మినీ వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి రూ.1.35లక్షలు నిలువు దోపిడీ చేశారు. శంషాబాద్ జోన్ ఏసీపీ రాంచందర్‌రావు, శంషాబాద్ జోన్ ఎస్‌వోటీ, సీసీఎస్ పోలీసులు ఘటన స్ధలాన్ని పరిశీలించారు. సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా కిష్టాగిరి గ్రామానికి చెందిన జె.రమేష్, రాములు కలిసి అశోక్ లేలాండ్ ఆటో ట్రక్(టీఎస్ 312 టి 5986)లో వనపర్తి నుంచి గొర్రెలను తీసుకొని వరంగల్‌లోని సంతలో అమ్ముకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. వారు గొల్లూరు ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే శనివారం అర్ధరాత్రి 2.20గంటలకు ఒక స్కూటీపై ముగ్గురు దుండగులు వచ్చి ఆటో ట్రక్కుకు అడ్డంగా నిలిపారు. ఆటోలోని వారిని కత్తులతో బెదిరించి గొర్రెలను అమ్మగా వచ్చిన రూ.1,35 లక్షలను లాక్కొని పారిపోయారు. దీంతో రమే్‌ష,రాములు లబోదిబోమంటు చూట్టు పక్కాల వారి సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఏసీపీ రాంచందర్‌రావు, సీసీఎస్, ఎస్‌వోటీ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దారిదోపిడీ దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అయితే ఆటోలో ఉన్న వారి వద్ద డబ్బులున్న సంగతి దొంగలకు ఎలా తెలిసింది? వరంగల్ నుంచే దొంగలు వారిని ఫాలో అయ్యారా? లేక ఏ ముఠాకైనా సమాచారం ఇచ్చారా? తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గతంలోనూ పీవన్ రోడ్డులో పలుమార్లు దారి దోపిడీలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డులో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని వాహనాదారులు, స్ధానికులు పోలీసులను కోరారు.