పర్యాటకానికి రెడ్‌ కార్పెట్‌

ABN , First Publish Date - 2023-03-26T00:06:11+05:30 IST

దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు మహర్దశ పట్టింది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై ఆకర్షణగా, ఆహ్లాదకరంగా ఉంది.

పర్యాటకానికి రెడ్‌ కార్పెట్‌
ఎలిమినేడు వద్ద పెద్దవాగుపై నిర్మించిన చెక్‌ డ్యాం

ముమ్మరంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సుందరీకరణ పనులు

రూ.15కోట్లతో ఫీడర్‌ చానళ్లకు మరమ్మతులు

పర్యాటకాభివృద్ధికి రూ.12కోట్లతో ప్రతిపాదనలు

భారీగా చేరిన వరద.. నీటితో తొణికిసలాడుతున్న చెరువు

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మిషన్‌ కాకతీయ కింద ఇప్పటికే ఫిరంగినాలా, పెద్ద కాలువలకు మరమ్మతులు చేయడంతో రెండేళ్లుగా నీరు చేరుతూ చెరువు నిండింది. కాలువలపై ఎక్కడికక్కడ చెక్‌ డ్యాములను నిర్మించడంతో వాటిల్లోనూ భారీగా నీరుంది. 46ఏళ్ల తర్వాత నిండి జలకళతో తొణికిసలాడుతున్న పెద్ద చెరువు కట్టను మూడు కిలో మీటర్ల మేర సుందరీకరించి, పార్క్‌లు, బోటింగ్‌ వంటి సదుపాయాలతో పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవేపై ఉన్న ఈ చెరువుకు అన్ని హంగులూ అద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.

ఇబ్రహీంపట్నం, మార్చి 25: దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు మహర్దశ పట్టింది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై ఆకర్షణగా, ఆహ్లాదకరంగా ఉంది. 3కిలోమీటర్ల పొడవున చెరువు కట్ట, రెండు తూములతో నిర్మితమైన ఈ చెరువు ప్రస్తుతం జలకళతో తొణికిసలాడుతోంది. చెరువు కట్టపై నుంచి నిత్యం వేలాది వాహనాలు వెళ్తున్నాయి. పదుల సంఖ్యలో ఇంజినీరింగ్‌, పీజీ కాలేజీలతో విరాజిల్లుతున్న పట్నానికి విద్యార్థులు, పర్యాటకులు వస్తూ చెరువు అందాలను తిలకిస్తూ చెరువు గట్టుపై సేదదీరుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో పట్టణానికి పైభాగానున్న ఈ చెరువును పర్యాటకంగా మరింత తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.12కోట్ల ప్రతిపాదనలు పంపింది. చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. చెరువుకు బ్యూటిఫికేషన్‌ పనులు చేయాలని, పిల్లల పార్క్‌, ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌, స్పీడ్‌, ఫెడల్‌ బోట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 46ఏళ్ల తర్వాత చెరువు పూర్తిగా నిండి నీటితో అలరారుతోంది. చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలమట్టాలు సైతం పెరిగి వ్యవసాయ బోర్లతో సమృద్ధిగా నీరు చేరుతోంది.

ఫీడర్‌ చానళ్లతో భారీగా వరద.. చెరువుకు జలకళ!

గతంలో ఎక్కడికక్కడ ఇసుకను తవ్వుకపోవడంతో చెరువుకు నీరొచ్చే కాలువల్లో నీరే లేకుండా పోయింది. భారీ ఇసుక గోతులతో ఎక్కడి నీరు అక్కడే ఇంకిపోయేది. ఈ చెరువు ఫీడర్‌ చానెళ్లలో ఒకటి ఫిరంగినాలా(రాచకాలువ) కాగా మరోటి పెద్ద కాలువ. ఫిరంగినాలాపై భారీగా నిర్మాణాలు వెలిశాయి. రియల్టర్లు కాలవను ధ్వంసం చేయడంతో చెరువులోకి వరద నీరు రాకుండా పోయేది. పెద్ద కాలువ ను ఇసుక కోసం తవ్వేయడంతో తాటిచెట్టు (పది మీటర్ల మేర) ఎత్తంత లోతుతో గోతులేర్పడ్డాయి. ఫిల్టర్‌ ఇసుక తీసి వరద రాకుండా చేశారు. నీరు రాక చెరువు నెర్రలు బారడం, ఎంతకూ నిండకపోవడంతో నీరొచ్చేలా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. చెరువు కట్టు కాలువల మరమ్మతు, నాలాలపై ఎక్కడికక్కడ చెక్‌ డ్యాంల నిర్మాణాలకు రూ.15కోట్లు మంజూరు చేయించి పనులు చేయించారు. దీంతో భారీగా వరద చేరి నేడు చెరువు నీటితో కళకళలాడుతోంది. ఎలిమినేడు నుంచి పోచారం కత్వ వరకు నాలుగు కిలోమీటర్ల కాలువను పునరుద్ధరించారు. ఎలిమినేడు వద్ద రెండు, పోచారం వద్ద ఓ చోట వాగుపై రూ.3.6కోట్లతో చెక్‌ డ్యాంలు నిర్మించారు. ఇవిగాక కాలువల రెన్యూవేషన్‌, ఎక్కడికక్కడ కరకట్టల నిర్మాణం చేశారు. ఎలిమినేడు-తిమ్మాపూర్‌ల మధ్య వాగుపై రూ.3కోట్లతో గడ్డర్‌ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జితో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు సుగమమైంది. ఆదిభట్ల నుంచి పెద్దచెరువు వరకు 16కిలోమీటర్ల పొడవున రూ.1.5కోట్లతో ఫిరంగినాలా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఈ నాలా వెంట ఆరు చోట్ల కల్వర్టులు నిర్మించారు.

ఉప్పరిగూడ క్రాసింగ్‌ వద్ద బైపాస్‌ నిర్మించాలి : బూడిద రాంరెడ్డి, సర్పంచ్‌, ఉప్పరిగూడ

చెరువు కొనకట్ట ఉప్పరిగూడ క్రాసింగ్‌ ప్రమాదకరంగా ఉంది.. ఇక్కడ బైపాస్‌ నిర్మించాలి. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు చెరువు నిండి అలుగు పారింది. అలుగుతో ఉప్పరిగూడ వెళ్లే రోడ్డులో రెండు నెలలపాటు రాకపోకలు స్తంభించాయి. మేం సొంత ఖర్చుతో పైపులు వేయించుకొని తాత్కాలికంగా రోడ్డు రిపేర్లు చేయించుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ బైపాస్‌ రోడ్డు వేస్తే కొన్ని గ్రామాలకు ఇబ్బందులు తీరుతాయి.

ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నం : గ్యార జంగయ్య, రైతు, పోచారం

చెరువుకు నీరొచ్చే కాలువలను ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ ఇసుక తవ్వేశారు. దీంతో చెరువులోకి నీరు రాలేదు. మిషన్‌ కాకతీయలో ప్రభుత్వం కాలువల మరమ్మతులు, చెక్‌డ్యాంల నిర్మించడంతో చెరువులోకి నీరు చేరింది. ఏళ్లుగా నిండని చెరువు రెండేళ్లుగా అనుకున్నంత నీరు చేరి బోర్లలోనూ నీరు ఊరుతోంది. మేం యేటా రెండు పంటలు పండించుకుంటున్నం. కరువు ప్రాంతమైన ఇక్కడ పశుపక్షాదులకూ నీటి ఎద్దడి తప్పింది.

చెరువుకు పర్యాటక హంగులు కల్పిస్తాం : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే

కేసీఆర్‌ ప్రభుత్వం రాకతో మా పట్నం చెరువుకు మిషన్‌ కాకతీయ కింద కట్ట పునరుద్ధరణ, కాలువల మర్మమతు పనులు చేయించుకున్నాం. కోట్లు వెచ్చింది పెద్ద చెరువు పనులు చేయిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు కూడా ఇబ్బంది రాకుండా ఉండేలా పనులు చేపట్టాం. పెద్ద చెరువు ఫీడర్‌ చానెళ్ల రెన్యూవేషన్‌, చెక్‌ డ్యాంల నిర్మాణం చేపట్టాం. త్వరలోనే చెరువు సుందరీకరణ పనులూ చేపడుతాం. ఎక్కువ పొడవున్న ఈ చెరువు కట్టకు బ్యూటిఫికేషన్‌ పనుల్లో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి పర్యాటకంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.

Updated Date - 2023-03-26T00:06:11+05:30 IST