Share News

ఇళ్ల వద్దే దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Dec 28 , 2023 | 11:55 PM

ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని కొందరు కౌన్సిలర్లు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అధికారులు పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్‌ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.

ఇళ్ల వద్దే దరఖాస్తుల స్వీకరణ
మేడ్చల్‌ మున్సిపాలిటీ రెండో వార్డు అత్వెల్లిలో కౌన్సిలర్‌ ఇంటి వద్ద దరఖాస్తుల స్వీకరణ

  • ‘ప్రజా పాలన’పై కౌన్సిలర్ల ఇష్టారాజ్యం

మేడ్చల్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని కొందరు కౌన్సిలర్లు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. అధికారులు పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్‌ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే గురువారం మేడ్చల్‌ జిల్లాలోని కొన్ని మున్సిపాల్టీల్లో కొందరు కౌన్సిలర్లు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని తమ ఇళ్ల వద్ద నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణకు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. అంతా బాగానే ఉన్నా కొందరు కౌన్సిలర్లు ఇది సొంత కార్యక్రమం వలె సొంతిళ్ల వద్ద కార్యక్రమాన్ని చేపట్టడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. కౌన్సిలర్లు తమ ఇంటి వద్ద కార్యక్రమాన్ని చేపట్టడంతో ఇతర పార్టీల కార్యకర్తలు, సామాన్యులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి అప్లికేషన్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇళ్ల వద్ద నిర్వహించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులే ప్రజలకు అనువుగా ఉండే చోట దరఖాస్తులు స్వీకరించాలని కోరుతున్నారు.

దరఖాస్తుదారులు రాక కౌంటర్ల వెలవెల!

కులకచర్ల: ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు మొదటి రోజు దరఖాస్తు చేసేందుకు ప్రజలు రాక కులకచర్లలో కౌంటర్లు వెలవెలబోయాయి. గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణకు కులకచర్లలో 12 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు ప్రత్యేకాధికారి సరళాదేవి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు రాక కౌంటర్లు వెలవెలబోయాయి. కాగా దరఖాస్తుల స్వీకరణపై ప్రజలకు అవగాహన కల్పించలేదని స్థానికులన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:55 PM