రియల్‌ మోసం

ABN , First Publish Date - 2023-03-30T23:48:24+05:30 IST

మండల కేంద్రాలను ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పచ్చని పొలాల్లో అక్రమ లేఅవుట్లు చేస్తూ జనాన్ని మోసగిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రూ.కోట్లు దండుకుంటున్నారు.

రియల్‌ మోసం

విచ్చలవిడిగా ఫామ్‌ల్యాండ్లు, అక్రమ వెంచర్లు

హెచ్‌ఎండీఏ/డీటీసీపీ అనుమతి లేకుండానే ప్లాట్ల విక్రయాలు

ఫామ్‌ల్యాండ్‌ పేరుతో గుంటల్లో అమ్మకాలు

అమాయకులకు అంటగడుతున్న వ్యాపారులు

అక్రమాలకు ఊతమిస్తున్న అధికారులు

మోసపోతున్న కొనుగోలుదారులు

మూడుచింతలపల్లి మండల కేంద్రం, దానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో అనుమతుల్లేని వెంచర్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలుదారులను నిండా ముంచుతున్నారు. వ్యవసాయ భూమిని కన్వర్షన్‌ చేయకుండానే ఫాం ల్యాండ్‌ పేరుతో గుంటల్లో కట్టబెడుతూ కోట్లు దండుతున్నారు. ఈ ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవాలంటే అన్ని పర్మిషన్లూ కొనుగోలుదారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా పంచాయతీ రాజ్‌, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు అక్రమాలకు వారే ఊతమిస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి.

మూడుచింతలపల్లి, మార్చి 30: మండల కేంద్రాలను ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పచ్చని పొలాల్లో అక్రమ లేఅవుట్లు చేస్తూ జనాన్ని మోసగిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అక్రమ వెంచర్లు, ఫామ్‌ల్యాండ్లను తెరమీదికి తెస్తున్నారు. ఆకర్షణీయమైన పబ్లిసిటీ పాంప్లెట్లతో ప్రజలను మోసగిస్తూ అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు అంటగడుతున్నారు. అక్రమ లే అవుట్లను అడ్డుకోవాల్సిన అధికారులు.. వ్యాపారులు ఇచ్చే తాయిలాలకు లొంగుతూ ఏ చర్యలూ తీసుకోవడం లేదు.

సర్కారు భూములనూ వదలడం లేదు

అధికారులు, రియల్టర్లు కలిసి నిబంధనలకు పాతరేస్తున్నారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో సర్వే నెంబరు 48, 249లో 2ఎకరాలపై చిలుకు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే వెంచర్‌ చేసి డీటీసీపీ లే అవుట్‌ అంటూ ప్రజలకు ప్లాట్లుగా అమ్ముతున్నారు. సర్వే నెంబర్‌ 252లోని ప్రభుత్వ భూమినీ పట్టాభూముల్లో కలిపేసుకొని లేఅవుట్‌ వేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలోనే ఉన్న గ్రామంల్లో ఇలా అక్రమ భూ దందా జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు చూసీ చూడనట్టే వ్యవహరిస్తున్నారు.

రియల్టర్లకు అధికారుల అండ

మండల కేంద్రంలో, గ్రామాల్లో వెలుస్తున్న అక్రమ వెంచర్లకు అధికారులే మద్దతిస్తున్నారు. నిబంధనల నుంచి తప్పించుకునేలా అక్రమాన్ని ఎలా చేయాలో వారే క్లూ ఇస్తున్నారు. కంచే చేను మేసిన చందంగా అధికారుల తీరు ఉంది. రియల్టర్లు ఫామ్‌ ల్యాండ్‌లు చేస్తే వాటిల్లో కేవలం మొక్కలు నాటాలని, హద్దురాళ్లు పాతొద్దని సూచిస్తున్నారు. హద్దులు పాతితే ప్లాట్లుగా పరిగణిస్తామని, అందుకు ల్యాండ్‌ కన్వర్షన్‌ తప్పనిసరి కాబట్టి.. ఫామ్‌ ల్యాండ్‌ పేరుతో గుంటల్లో అమ్మకాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దాని రిజిస్ర్టేషన్‌కు కూడా కమర్షియల్‌ టారిఫ్‌ వర్తించదని ఉచిత సలహా ఇస్తున్నారు. కొనుగోలుదారులకు రైతుబంధు, రైతు బీమా సైతం వర్తిస్తాయంటూ ప్లాట్ల అమ్మకందారులు అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఎకరాల్లోని విస్తీర్ణాన్ని గుంట, రెండు గుంటలు ఇలా చిన్నచిన్న విస్తీర్ణాల్లో పామ్‌ల్యాండ్‌ పేరిట జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. గజాల్లో అమ్మితేనే వెంచర్‌ కిందికి వస్తుందని, గుంటల్లో అమ్మితే వ్యవసాయ భూమి కిందే లెక్క అంటూ మెలిక పెడుతున్నారు. ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటనే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానిక ప్రజలంటున్నారు.

అనుమతుల్లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం : రవినాయక్‌, ఎంపీవో, మూడుచింతలపల్లి

గ్రామాల్లో అక్రమ వెంచర్లపై మాకు సమాచారం లేదు. పంచాయతీ శాఖ అధికారులు, సిబ్బంది ద్వారా ప్రతీ గ్రామంలో తనిఖీలు చేస్తున్నాం. అనుమతి లేకుండా ఫాం ల్యాండ్లు, లేదా వెంచర్లు చేసినట్టు తెలిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు అక్రమ వెంచర్లలో ప్లాట్లు, ఫామ్‌ ల్యాండ్‌ కొని మోసానికి గురికావొద్దు. ఏ గ్రామంలో అయినా అక్రమ వెంచర్‌ చేశారని సమాచారమిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

కేసులు నమోదు చేస్తాం : వాణిరెడ్డి, తహసీల్దార్‌, మూడుచింతలపల్లి

అనుమతులు లేకుండా వెంచర్లు, ఫామ్‌ ల్యాండ్లు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో వెంచర్‌ చేశారని నిర్ధారణైతే అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు కేసులు నమోదు చేయిస్తాం. ప్లాట్ల కొనుగోలుదారులు కూడా డీటీసీటీ/హెచ్‌ఎండీఏ అనుమతి ఉన్న ప్లాట్లే కొనాలి. లేకుంటే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇల్లు కట్టుకోవాలంటే మొదటి నుంచీ పర్మిషన్లు తీసుకోవాలి. అధికారిక వెంచర్‌లో కొంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Updated Date - 2023-03-30T23:48:24+05:30 IST