విద్యార్థులకు పఠనోత్సవం

ABN , First Publish Date - 2023-06-25T23:30:47+05:30 IST

విద్యార్థుల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంచేందుకు, చదవడంలో నైపుణ్యాలు సాధించేందుకు పఠనోత్సవాన్ని(రీడింగ్‌ క్యాంపెయిన్‌) చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

విద్యార్థులకు పఠనోత్సవం

505 పాఠశాలల్లో నేటి నుంచి జూలై 31 వరకు కార్యక్రమం

1 నుంచి 10వ తరగతి వరకు అమలు

విద్యార్థులను స్వతహాగా పాఠకులుగా మల్చడమే లక్ష్యం

మేడ్చల్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్యార్థుల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంచేందుకు, చదవడంలో నైపుణ్యాలు సాధించేందుకు పఠనోత్సవాన్ని(రీడింగ్‌ క్యాంపెయిన్‌) చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి జూలై 31వరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పఠనోత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్ని అమలుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ, మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎంచుకున్న తెలుగు/ఇంగ్లి్‌ష/ఉర్ధూ భాషల్లో విద్యార్థులు ధారాళంగా చదివించేలా చేయడం, వారిలో చదివే అలవాటు పెంపొందించడం, విద్యార్థులు స్వతహాగా పాఠకులుగా ఎదిగేలా చేయడమే పఠనోత్సవ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

కార్యక్రమ నిర్వహణ ఇలా

పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు పఠనోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని అమలుకు హెచ్‌ఎంలు బాధ్యత వహిస్తారు. రోజూ పుస్తక పఠనానికి ఒక పీరియడ్‌ కేటాయిస్తారు. పిల్లలంతా భాగస్వాములయ్యేలా, ధారాళంగా చదివేలా ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రోజూ తాము బోధించిన పాఠ్యాంశాన్ని 10 నిమిషాల పాటు అందరు విద్యార్థులతో చదివిస్తారు. ఆ పాఠంలోని కీలక పదాలను బోర్డులు/చార్టులపై రాయించి తోరణంగా రూపొందించి ప్రదర్శిస్తారు. రెండో వ్యూహంగా గ్రంథాలయ పుస్తకాలను చదివిస్తారు. అయితే లైబ్రరీ పీరియడ్‌లో భాగంగా మూడ్రోజులు మాతృభాషలోని కథల పుస్తకాలు, రెండ్రోజులు ఇంగ్లిష్‌ కథల పుస్తకాలను, ఒక రోజు ద్వితీయ భాషలోని కథలను విద్యార్థులతో చదివిస్తారు.

గ్రంథాలయ కమిటీలు

ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థులతో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు. పిల్లలకు పుస్తకాలివ్వడం, సేకరిండం వంటి వివరాలను ఇష్యూ రిజిస్టర్‌లో రాసి లైబ్రరీ నిర్వహణ బాధ్యతను పిల్లలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయ కమిటీకి అప్పగిస్తారు.

పఠన పోటీలు

పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రతీ శనివారం పాఠశాలల్లో పఠన పోటీలు నిర్వహిస్తారు. ప్రతీ నెల మూడో శనివారం నిర్వహించే సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులను, ఎస్‌ఎంసీ సభ్యులను ఆహ్వానించి పిల్లలతో పుస్తక పఠన కార్యక్రమాన్ని నిర్వహించాలి. గ్రామం కూడళ్లలో, గ్రామ సమావేశాల్లో కథల పుస్తకాలు చదివి విన్పించడం, పిల్లలతో చదివించడం వంటివి నిర్వహిచాలి.

గ్రంథాలయ వారోత్సవం

అన్ని పాఠశాలల్లో జూలై 10 నుంచి 15 వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తారు. విద్యార్థులతో వార్తా పత్రికలు, మ్యాగజైన్‌లోని పజిల్స్‌, క్రీడలు, కథలు, పాటలు మొదలగునవి కత్తిరించి అతికించి పఠన కార్డులను రూపొందిస్తారు. విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తారు. ప్రతీ టీచర్‌ వారి సబ్జెక్టుల్లో ఎంత మంది వేగంగా తప్పుల్లేకుండా చదువుతున్నారు? ఎంత మంది నెమ్మదిగా చదువుతున్నారో గుర్తిస్తారు. పఠనలో వచ్చిన అభివృద్ధిపై నెలకోసారి హెచ్‌ఎంలు టీచర్లతో సమీక్షిస్తారు. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పఠనోత్సవాన్ని పకడ్బందీగా అమలయ్యేలా చూస్తారు.

విజయవంతం చేయాలి : విజయలక్ష్మి, డీఈవో

హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పఠనోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పఠనోత్సవ కార్యక్రమ విజయవంతానికి మేమూ నిరంతరం పర్యవేక్షిస్తాం.

Updated Date - 2023-06-25T23:30:47+05:30 IST