లక్ష్యం చేరేనా!
ABN , Publish Date - Dec 14 , 2023 | 11:04 PM
వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏటేటా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌తో భూగర్భ జలమట్టాల స్థాయి ఏటేటా పడిపోతోంది.
ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించని అధికారులు
లక్ష్యానికి దూరంగా నిర్మాణాలు
షాబాద్, డిసెంబరు 14 : వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఏటేటా పెను మార్పులు సంభవిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌తో భూగర్భ జలమట్టాల స్థాయి ఏటేటా పడిపోతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించడంతో వాన నీరు వృథాగా పోకుండా ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయంకూడా అందిస్తోంది. కాగా గ్రామీణులకు ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహక కల్పించకపోవడంతో లక్ష్యం నీరు గారుతోంది. షాబాద్ మండలంలో లక్ష్యం మేర ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి కాలేదు. కాగా, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. అంతేకాకుండా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఉపాధిహామీ కింద ఇంకుడుగుంత నిర్మించుకున్న వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. స్వతహాగా నిర్మించుకునే వాటికి రూ. 6వేలు చెల్లిస్తోంది. వ్యక్తిగత ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధ్దిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తున్నారు. అయితే ఇంకా కొన్ని గ్రామాల్లో ప్రజలు ఆసక్తి చూపడంలేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవగాహన కల్పిస్తే అనుకున్నమేర లక్ష్యాన్ని సాధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అవగాహన కల్పించాలి : సామ జైపాల్‌రెడ్డి, ఎర్రోనిగూడ, షాబాద్ మండలం
పల్లెల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ఇంకుడుగుంతల అవశ్యకతపై అవగాహన కల్పించాలి. భవిష్యత్‌లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందకు ఇంకుడుగుంత ప్రాముఖ్యతను వివరించాలి. ప్రతి ఇంటిలో దీనిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలి.
లక్ష్యం మేరకు పూర్తిచేస్తాం : వీరాసింగ్, ఏపీవో, షాబాద్
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాల్లో ఇంకుడుగుంతల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నాం. ఇంకుడుగుంత నిర్మించుకున్న లబ్ధ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి.