Share News

పేదల్లో రేషన్‌ కార్డు ఆశలు!

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:25 PM

ఈ నెల 21న జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనుండడంతో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురించాయి.

పేదల్లో రేషన్‌ కార్డు ఆశలు!

ఈ నెల 21న కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం

కొత్త రేషన్‌ కార్డులు, మార్పులు, చేర్పులపై నిర్ణయిస్తారని ఎదురు చూపులు

తాండూరు, డిసెంబరు 18 : ఈ నెల 21న జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనుండడంతో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు చిగురించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే కొత్తరేషన్‌ కార్డులు ఇస్తామని ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చింది. ఏడేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీ, సభ్యుల చేర్పులు, మార్పులు చేపట్టలేదు. మీసేవల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నా అవన్నీ పెండింగ్‌లో నున్నాయి. రేషన్‌ కార్డులతో అనుసంధానమైన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథక పరితిమితిని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.10లక్షలకు పెంచింది. అయితే రేషన్‌ ఉన్న వారికి, అలాగే కార్డులో పేరున్న వారికే ఆరోగ్యశ్రీ స్కీమ్‌ వర్తిస్తుంది. కొన్నేళ్ల పాటు ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేయకపోవడం, ఉన్న కార్డుల్లోనూ కుటుంబీకుల చేర్పులు మార్పులు చేపట్టకపోవడంతో పథకం అర్హులందరికీ అందకుండా పోయే ఆస్కారం ఏర్పడింది. ఆరోగ్య శ్రీ పొందాలంటే రేషన్‌ కార్డు తప్పనిసరి. కొత్త ప్రభుత్వం అయినా తమకు రేషన్‌ కార్డులు మంజూరు చేస్తుందని పేదలు ఆశ పెట్టుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ, కార్డు ఉన్నా కొత్తగా చేర్చాల్సిన పేర్లు, మార్పులు చేర్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకం పొందాలన్నా అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుంటేనే వర్తిస్థాయి. 2018లో మార్పులుచేర్పులకు అవకాశం ఇచ్చినా వాటిని పరిష్కరించలేదు. అప్పటికే కార్డు ఉన్నా పుట్టిన పిల్లలకు, కొత్త కోడళ్లకు, వలస పోయిన వారికి మార్పులు చేర్పులు చేయలేదు. వేలల్లో దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆహార భద్రత కార్డు ఉంటే బియ్యం రావడంతో పాటు ప్రభుత్వ పథకాలూ వర్తించే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం నిర్ణయంపై పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:25 PM