వాన.. వణుకు!

ABN , First Publish Date - 2023-03-19T00:10:51+05:30 IST

వికారాబాద్‌ జిల్లాను వడగళ్ల వాన వణికిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జనం ఆగమాగమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వానతో పాటు వడగళ్లు పడడంతో పంటలు చేతికందకుండా పోతున్నాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మర్పల్లి మండలం పిల్లిగుండ్ల, దామస్తాపూర్‌లో పెద్ద సైజు వడగళ్లు పడ్డాయి. నీటిలో పడ్డ వడగళ్లు బాంబుల శబ్దాన్ని తలపించాయి. కురిసిన వర్షానికి వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వాన.. వణుకు!
నీట మునిగిన క్యాబేజీ పంట

మూడు రోజులుగా వదలని వడగళ్లు(ట్యాగ్‌)

వికారాబాద్‌ జిల్లాను ముంచెత్తుతున్న వర్షం

పిల్లిగుండ్లలో బాంబుల శబ్దాన్ని తలపించిన వడగండ్లు

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు.. నిలిచిపోయిన సరఫరా

దెబ్బతిన్న పంటలు... నేలకొరిగిన మామిడిచెట్లు.. రాలిన కాయలు

బెంబేలెత్తుతున్న రైతులు...

పంటనష్టంపై సర్వే చేస్తున్న అధికారులు

మేడ్చల్‌ జిల్లాలో నాగారం మున్సిపాలిటీ ప్రశాంత్‌నగర్‌ కాలనీలో పడిన పిడుగు

కాలి బూడిదైన గృహోపకరణాలు

వికారాబాద్‌ జిల్లాను వడగళ్ల వాన వణికిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో జనం ఆగమాగమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వానతో పాటు వడగళ్లు పడడంతో పంటలు చేతికందకుండా పోతున్నాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మర్పల్లి మండలం పిల్లిగుండ్ల, దామస్తాపూర్‌లో పెద్ద సైజు వడగళ్లు పడ్డాయి. నీటిలో పడ్డ వడగళ్లు బాంబుల శబ్దాన్ని తలపించాయి. కురిసిన వర్షానికి వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వికారాబాద్‌/మోమిన్‌పేట్‌/పరిగి/యాలాల/మోమిన్‌పేట్‌/దౌల్తాబాద్‌/బంట్వారం (కోట్‌పల్లి)/ధారూరు మార్చి18 : వికారాబాద్‌ జిల్లాలో వరుసగా మూడోరోజు వడగండ్ల వాన కురిసింది. జిల్లాలో గురువారం ప్రారంభమైన వడగండ్ల వర్షం శనివారం కూడా కురిసింది. మర్పల్లి మండలంలో పిల్లిగుండ్లలో, దామస్తాపూర్‌లో పెద్ద సైజు వడగండ్లు పడ్డాయి. నీటిలో పడ్డ వడగండ్లు బాంబుల శబ్దాన్ని తలపించాయి. పీరంపల్లిలో వర్షానికి దూడ మృతి చెందింది. వర్షం తీవ్రతకు సిద్దులూరు మార్గంలో పాతూరు గేటు వద్ద విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కురిసిన వర్షానికి వాగులు, వంకలు వరద నీటితో భారీగా ప్రవహించాయి. కురిసిన వడగండ్లు, భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వికారాబాద్‌ పట్టణంతో పాటు మండలంలో సాధారణ వర్షం కురియగా సెలవు రోజు కావడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మోమిన్‌పేట్‌ మండల కేంద్రంతో పాటు టేకులపల్లి, ఎన్కతల, మేకవనంపల్లి తదితర గ్రామాల్లో శనివారం వడగళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు సాగు చేసిన పంటలు వరి, జొన్న, ఉల్లి, టమాట, పొప్పయ, ఆలుగడ్డ, గులాబీ తదితర వాటితో పాటు మామిడి, అరటి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి జయశంకర్‌ పరిశీలించారు. దౌల్తాబాద్‌ మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా, కరెంటు సరఫరా ఆగిపోయింది. మామిడి తోటలు, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. మర్పల్లిలో వడగళ్ల వర్షం భారీగా కురియడంతో మరోసారి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. బంట్వారం, కోట్‌పల్లి, వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి చెట్లే నెలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది యాలాల మండలంలో శనివారం 40 నిమిషాల పాటు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కులకచర్ల మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు గోపాల్‌గౌడ్‌ మామిడి తోటలో 70 శాతానికి పైగా మామిడి కాయలు రాలిపోయాయి. కులకచర్ల, గండిచెరువు, ఘనాపూర్‌, రాంరెడ్డిపల్లి లాల్‌సింగ్‌ తండా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో ఇటుకలు వర్షాలనికి కరిగిపోయాయి. పరిగి సబ్‌ డివిజన్‌లోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్‌ మండలాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డికి చెందిన ఆవు మృతి చెందింది. ధారూరుతో పాటు మండలంలోని పలు గ్రామాలు, బంట్వారం, కోట్‌పల్లి మండలాల పరిధిలోని తొర్మామిడి, బంట్వారం, రాంపూర్‌, బర్వాద్‌ తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వర్షం పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. కాగా మోమిన్‌కలాన్‌ గ్రామంలో నస్కంటి గోపాల్‌ ఇంటి సమీపంలో పిడుగు పడింది. పిడుగుపాటుకు ఇంటిలోపల పోగ అలుముకుని పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్నది.

వికారాబాద్‌ నియోజకవర్గంలో సుమారు 4 వేల ఎకరాల్లో పంట నష్టం

వికారాబాద్‌ నియోజకవర్గంలో ఉద్యాన , వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్షేత్ర స్థాయి సర్వేలో మొత్తంగా నాలుగు వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లే దెబ్బతిన్న పంటల గురించి వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్‌ మండలం మదన్‌పల్లి గ్రామంలోని కొండి రాములు మామిడి తోటలో ఏకంగా 50 చెట్లు నేలకొరగగా మిగతా చెట్లకు ఉన్న కాయాలు రాలిపోయాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మొక్కజొన్న, జొన్నతో పాటు కూరగాయ పంటలు, మామిడి, చింతకాయ వంటివి నెలరాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకుని పంట నష్ట పరిహారం అందించాలని నియోజకవర్గ రైతులు కోరుతున్నారు.

ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి

అకాల వర్షంతో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. శనివారం మండల పరిధిలోని సయ్యద్‌అలీపూర్‌ గ్రామస్థులు తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. ఇళ్లలో ఉన్న బీరువాలు, టీవీలు, నిత్యావసర సరుకులు, పప్పులు వర్షానికి దెబ్బతిన్నాయని వాపోయారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ వడగళ్ల వర్షానికి ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు.

పంటల నష్టం వివరాల సేకరణ

మర్పల్లి మండలంలోని 10 గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పంటనష్టం సర్వే చేపట్టారు. వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 34 మంది వ్యవసాయాధికారులు టీంలుగా ఏర్పడి రైతుల వద్దకు వెళ్లి ఏయే పంట ఎన్ని ఎకరాల్లో పాడైందని రైతుల నుంచి వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదివారంకూడా పంట నష్టం వివరాలు సేకరిస్తామని ఉద్యానశాఖ అధికారి చక్రపాణి తెలిపారు.

వర్షపాతం వివరాలు

ఇదిలా ఉంటే, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలో అత్యధికంగా మర్పల్లి మండలంలో 36.0 మి.మీ., వర్షపాతం నమోదు కాగా, నవాబ్‌పేట్‌లో 28.6 మి.మీ., బషీరాబాద్‌లో 22.6 మి.మీ., వికారాబాద్‌లో 21.7 మి.మీ., మోమిన్‌పేట్‌లో 20.7 మి.మీ., బొంరాస్‌పేట్‌లో 19.9 మి.మీ. వర్షం కురిసింది. పెద్దేముల్‌లో 18.7 మి.మీ., దౌల్తాబాద్‌లో 17.7 మి.మీ., కులకచర్లలో 17.3 మి.మీ., తాండూరులో 16.8 మి.మీ., కొడంగల్‌లో 16.7 మి.మీ., యాలాల్‌లో 16.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. బంట్వారంలో 16.4 మి.మీ., దోమలో 12.9 మి.మీ., కోట్‌పల్లిలో 10.0 మి.మీ., పూడూరులో 6.9 మి.మీ., ధారూరులో 5.8 మి.మీ., పరిగిలో 4.8 మి.మీ., చౌడాపూర్‌లో 0.5 మి.మీ. వర్షం కురిసింది. కాగా, శనివారం సాయంత్రం వరకు అత్యధికంగా మర్పల్లి మండలంలో 14.5 మి.మీ వర్షం కురియగా, మదన్‌పల్లిలో 6.8 మి.మీ., వికారాబాద్‌లో 5.8 మి.మీ., మోమిన్‌పేట్‌, కోట్‌పల్లిల్లో 5.0 మి.మీ., దోమలో 4.8 మి.మీ., నవాబ్‌పేట్‌లో 1.3 మి.మీ. వర్షం నమోదైంది.

మేడ్చల్‌ జిల్లాలో ఇంటిపై పిడుగుపాటు

కీసర రూరల్‌ : మేడ్చల్‌ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జనాలు బెంబేలెత్తి పోయారు. అరగంట పాటు కురిసిన వర్షానికి కాలనీల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. నాగారం మున్సిపాలిటీ ప్రశాంత్‌నగర్‌ కాలనీలోని పొలంగారి బాల్‌రెడ్డి ఇంటిపైన పిడుగు పడింది. దీంతో ఇంటి పైభాగాన పిట్టగోడ కూలింది. ఏసీలు, ఫ్రిజ్‌, టీవీ కాలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాలనీలన్నీ అంధకారంగా మారాయి. మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి మున్సిపాలిటీలో పర్యటించారు. పిడుగు పాటుకు గురైన బాల్‌రెడ్డి ఇంటిని పరిశీలించారు.

Updated Date - 2023-03-19T00:10:51+05:30 IST