ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-04-03T23:57:48+05:30 IST
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 316 ఫిర్యాదులు అందాయి.
కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ రూరల్, ఏప్రిల్ 3: ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 316 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ఈ నెల 5, 11, 14వ తేదీలలో మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలని చెప్పారు. మునిసిపల్, గ్రామ పంచాయతీలలో ఉన్న విగ్రహాలకు రంగులు వేసి పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. అటెండెన్స్ యాప్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్‌డీవో కృష్ణన్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ప్రజావాణిలో 97 వినతులు
మేడ్చల్ అర్బన్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 97 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. డీఆర్వో లింగ్యానాయక్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.