ప్రైవేటు ‘ఫీజు’లుం

ABN , First Publish Date - 2023-06-14T22:49:12+05:30 IST

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వేలకువేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు.

ప్రైవేటు ‘ఫీజు’లుం

ఇష్టానుసారంగా పెంచుతున్న స్కూల్‌ యాజమాన్యాలు

నియంత్రణ కమిటీలు ఉత్తర్వులకే పరిమితం

మధ్యతరగతి కుటుంబాలకు భారమవుతున్న పిల్లల చదువులు

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

షాబాద్‌, జూన్‌ 14 : ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వేలకువేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈటెక్నో, కాన్సెప్ట్‌, టాలెంట్‌ వంటి పేర్లతో పాఠశాలలు నెలకొల్పి విద్యా వ్యాపారానికి తెర తీస్తున్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ కిమ్మనడం లేదు. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలు పిల్లల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు గానీ విద్యలో నాణ్యత మాత్రం చూపడం లేదు.

ఇష్టారీతిగా వసూలు

ఒక్కో పాఠశాలలో ఒక్కో తరహా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరు కాన్సెప్ట్‌, టాలెంట్‌, ఈటెక్నో అనే పేర్లతో, ఇంకొకరు ప్రత్యేక సదుపాయాలు, స్పెషల్‌ క్లాసులు, కంప్యూటర్‌ శిక్షణ అంటూ వేల రూపాయలను దండుకుంటున్నారు. షాబాద్‌ మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీకి రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫీజులు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఫీజులతోపాటు బస్సు చార్జీలంటూ అదనంగా దోచేస్తున్నారు. అంతేకాకుండా పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, టై, బెల్ట్‌ల కోసమంటూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రతీ ఏడాది ఫీజులు పెంచడానికి తల్లిదండ్రుల ఆలోచనలే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటులో అయితే తమ పిల్లలు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు పొందుతారనే భావనలో ఉండటంతో ఇష్టానుసారం ఫీజులు పెంచుతూ పోతున్నారు. స్కూళ్లల్లో ఫీజుకు తగ్గ వసతులు ఉన్నాయా.. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారా..? లేరా? అనే విషయాలపై అసలు దృష్టి సారించడం లేదు.

కమిటీలు ఎక్కడ?

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కోసం వేసిన కమిటీలు ఏమయ్యాయో తెలియదు. ప్రతీ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యంతో కలిపి ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇవి ఎక్కడా ఏర్పాటు అయిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఈ కమిటీ సమావేశమై ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2010లో రాష్ట్ర ప్రభుత్వం 91, 92, 93 ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇవి కేవలం ఉత్తర్వులకు మాత్రమే పరిమితమైంది. వాస్తవానికి విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతం ఉపాధ్యాయుల వేతనాల కోసం ఖర్చు చేయాలి. ఇది కూడా ఎక్కడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఫీజుల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసం ఉంది. లేకపోతే పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఫీజుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

అర్హత లేకున్నా..

ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్‌, డిగ్రీ చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు. ఇది బయటకు తెలియకుండా ఒకరిద్దరు అర్హత కలిగిన ఉపాధ్యాయులను, ఓ కేరళ టీచర్‌ను నియమించుకొని వారిచే బోధన చేయిస్తున్నామని హంగామా చేస్తున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యాక పిల్లలకు ఎవరు బోధిస్తున్నారన్న విషయాన్ని తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఎస్సీ, బీఈడీ చేయడంతో పాటు డీఎస్సీలో ఎంపికైన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమిస్తారు. ఈ విషయం తెలిసి కూడా సర్కార్‌ బడులకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. దీనిని అదునుగా చేసుకొని ప్రైవేట్‌ విద్యా సంస్థలు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.

తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం

మండలంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ గురించి మాట్లాడుతాం. ఏ పాఠశాలలోనైనా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం.

- శంకర్‌ రాథోడ్‌, మండల ఇన్‌చార్జి విద్యాధికారి

నియంత్రణ కమిటీ వేయాలి

ఇదివరకు ఫీజుల నియంత్రణ కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేశాం. ఆ సమయంలో కమిటీలు వేసేందుకు అధికారులు హామీ ఇచ్చి మరిచిపోయారు. మండలంలో ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజుల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను వేయాలి. అందులో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలకు స్థానం కల్పించాలి. ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఫీజు వసూలు చేయాలి. అంతే కాకుండా బెల్టు, టై, పుస్తకాలు, డ్రెస్సులు పాఠశాలల్లోనే కొనాలనే నిబంధనలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈటెక్నో, కాన్సెప్ట్‌, టాలెంట్‌ వంటివి స్కూళ్లకు పెట్టుకోకుండా రద్దు చేయాలి.

- కళ్లెం సూర్యప్రకాష్‌, ఏబీవీపీ శంషాబాద్‌ విభాగ్‌ కన్వీనర్‌

Updated Date - 2023-06-14T22:49:12+05:30 IST